గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనలను కఠిన తరం చేశాయి. విద్యార్థి కాపీకి పాల్పడితే ఇంటికి పంపే ఏర్పాట్లు చేశాయి. అలాగే విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నాయి.
తాజా నిబంధనలతో విద్యార్థి మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు, మాతృస్థానం నుంచి సస్పెండ్ చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విద్యార్థి కాపీ కొట్టిన సంఘటనల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, సీనియర్ అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో పాటు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను పరీక్షల విధులతో పాటు పాఠశాలల నుంచి సస్పెండ్ చేస్తారు.
ఇటువంటి సంఘటనల్లో వారిని సస్పెండ్ చేసే అధికారాన్ని సంబంధిత శాఖల డీఈవో, ఆర్జేడీ స్థాయి అధికారులకు కల్పించారు.
రూ. లక్ష వరకూ భారీ జరిమానా విధించే అవకాశముంది.
ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేశారని నిరూపణ అయితే యాక్ట్-25 కింద క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.
మూడు నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది.
విద్యార్థిపై అనర్హత వేటు
మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన విద్యార్థులకు షోకాజ్ నోటీసు జారీ చేసి, తదుపరి పరీక్షలకు హాజరయ్యే వీలు లేకుండా అనర్హత వేటు వేస్తారు. అనంతరం పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా జరిగే విచారణలో గరిష్టంగా ఐదేళ్ళ వరకు అనర్హత వేటు విధించే అవకాశాలు న్నాయి.
పదో తరగతి పరీక్షలకు 578 మంది సీఎస్, డీవోల నియామకం
ఈ నెల 27 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మొత్తం 578 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు.
301 మంది పైబడిన విద్యార్థులన్న పరీక్షా కేంద్రానికి మరొక అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించారు.
ఒక్కో కేంద్రానికి 11 మంది చొప్పున మొత్తం 3,179 మంది ఇన్వజిలేటర్లను నియమించారు.
పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్లకు ఈనెల 6 నుంచి శిక్షణ వుంటుంది.
ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్‌మెంటల్ అధికారులతో గుంటూరులో బుధవారం సమీక్షా సమావేశం జరగనుంది.
కాపీ కొడితే....ఇంటికే
Published Wed, Mar 5 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement