
ఏపీ సీఎస్ కే విజయానంద్
ఫిర్యాదులకు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నంబరు 18004251531
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఇంటర్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షల(Open School Society Inter exams)పై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. మార్చి, ఏప్రిల్ నెలలు పరీక్షల నెలలని, సజావుగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్ష(Intermediate Exams)లకు 1,535 కేంద్రాలకు గాను 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని వీటిలో పటిçష్ట ఏర్పాట్లు చేయాలని విజయానంద్ ఆదేశించారు.
వేసవి దృష్ట్యా తాగునీరు, ప్రథమ చికిత్స, విద్యుత్తు, బెంచ్‌లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పేపర్ లీకేజీ వంటి వదంతులు వ్యాపింపజేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేయాలని, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు సకాలంలో చేరుకునేలా తగిన సంఖ్యలో బస్సులను నడపాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు నెలకొల్పాలని కలెక్టర్లకు సూచించారు. వయోజన విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏర్పాట్లను వివరించారు. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అనుమతించొద్దని స్పష్టం చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు గదుల్లో తగినంత వెలుతురు ఉండేలా, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని నిర్దేశించారు.
పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షించాలని తెలిపారు. ప్రథమ చికిత్స కిట్లతో పాటు అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 19 వరకు ప్రథమ, 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. 26 జిల్లాల్లో 10,58,892 మంది హాజరుకానున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనుండగా 325 కేంద్రాల్లో 67,952 మంది హాజరుకానున్నారు.