open school society
-
సు‘దూర’ విద్య!
గుంటూరు ఎడ్యుకేషన్: దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఆగస్టులో అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.2024–25 విద్యాసంవత్సరానికి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించిన అడ్మిషన్ల ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో దాదాపు లక్ష మంది ప్రవేశం పొందారు. వీరికి వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరుగుతాయి. వీరందరికీ ప్రస్తుతం గుంటూరులోని ఏపీఓఎస్ ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠ్య పుస్తకాలను పోస్టాఫీసుల ద్వారా పంపుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికి 30 వేల మందికి పైగా పుస్తకాలు అందించినట్టు ఏపీఓఎస్ఎస్ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. -
అప్పుడు చదువకపోతేనేం..!
అనివార్య కారణాల వల్ల చిన్న వయసులోనే చదువుకు దూరమైనవారికి ఓపెన్ స్కూల్(సార్వత్రిక విద్యాపీఠం) ఆశాదీపంలా నిలుస్తోంది. ఆర్థిక కారణాలు, కట్టుబాట్లు సంప్రదాయాల పేరిట మధ్యలోనే చదువు మానేసిన వారు, ఇతర కారణాలతో అర్ధంతరంగా చదువు ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ బాసటగా ఉంటోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం సార్వత్రిక విద్యాపీఠం ఇటీవల ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. సాక్షి, ఆరిలోవ(విశాఖపట్టణం) : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో సార్వత్రిక, దూరవిద్య విధానంలో టెన్త్, ఇంటర్మీడియెట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్తోపాటు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొల్పిన అధ్యయన కేంద్రాల ద్వారా ఈ కోర్సులను అందిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం టెన్త్‌కు 56 , ఇంటర్మీడియెట్‌కు 43 అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సార్వత్రిక విద్యాపీఠం ఇచ్చిన సర్టిఫికెట్లపై చాలా మందికి అపోహ ఉంది. అయితే అవన్నీ అవాస్తవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు, యూనివర్సిటీ అధికారులు సైతం స్పష్టంచేస్తున్నారు. ఈ సర్టిఫికెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందటమే కాక ఉన్నత చదువులు, ఉద్యోగాలకు నేడు సైతం అర్హమై ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యాసకులు త్రివిధ దళాలతోపాటు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. ముఖ్యమైన తేదీలు ► ప్రాస్పెక్టస్ లభ్యత, ప్రవేశాల ప్రారంభం: 2019 జూన్ 28 నుంచి ► ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణకు ఆఖరు తేదీ: 2019 జూలై 26 ► నిర్ణీత ప్రవేశ రుసు చెల్లించేందుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 31 ► రూ. 200 అపరాధ రుసుంతో దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ: 2019 సెప్టెంబర్ 26 ► హెల్ప్‌లైన్ కేంద్రాలు: సార్వత్రిక విద్యాపీఠం గుంటూరు: 0863–2239151, విశాఖపట్నం: 80084 03662 మహిళలకు ప్రత్యేక రాయితీ.. సార్వత్రిక విద్య ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకోవడానికి అన్ని వర్గాల స్త్రీలకు ఫీజుల చెల్లింపులో ప్రభుత్వం కొంత రాయితీ ఇస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మాజీ సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రవేశ రుసుం ఫీజులోను రాయితీ కల్పిస్తున్నారు. దీని కోసం అభ్యర్థులు తహసీల్దార్/మెడికల్ బోర్డు/సైనిక సంక్షేమాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జనరల్ కేటగిరి ఫీజులనే చెల్లించాలి. ముఖ్యమైన అంశాలు.. వయో పరిమితి ఆగస్టు 31 నాటికి లేదా ప్రవేశం కోరే సమయానికి పదో తరగతికి 14, ఇంటర్మీడియట్‌కు 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఉర్దూ మాధ్యమం కూడా అందుబాటులో ఉంది. సబ్జెక్టుల ఎంపికనేది అభ్యాసకులు ఆసక్తిని బట్టి, ఒక అదనపు సబ్జెక్టును ప్రవేశ సమయంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.∙గ్రూపుల లిస్టులో 5 సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. గ్రూపు–ఎలో ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరి. ఇంటర్లో సైన్స్ గ్రూపు ఎంపిక చేసుకునే వారు టెన్త్‌లో తప్పనిసరిగా గణితం, జనరల్ సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి.∙నియత పాఠశాలలో పదో తరగతి/కళాశాలలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ఫెయిలైనప్పటికీ.. పాసైన రెండు సబ్జెక్టుల మార్కులను బదలాయించుకునే వెసులుబాటు ఉంది. ఏ కోర్సులో చేరినా రిజిస్ట్రేషన్ పొందిన నాటి నుంచి ఐదేళ్ల వరకు ప్రవేశం చెల్లుబాటు అవుతుంది. ఏపీ ఓపెన్ స్కూల్లో రెండు సార్లు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. క్తిగతంగా కానీ, ఏపీ ఆన్లైన్ ద్వారా అభ్యాసకులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు పూర్తి చేయండి ఇలా.. ఓపెన్ స్కూల్, ఇంటర్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నవారు వ్యక్తిగతంగానైనా ఏపీ ఆన్లైన్, మీ–సేవ కేంద్రాల్లో అన్ని దశల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్.ఓఆర్జీ వెబ్సైట్లో పూర్తిచేయాలి. టెన్త్ లేదా ఇంటర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తదుపరి అభ్యాసకులు తమ పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత మీసేవ, క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్, ఏపీఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. తదుపరి దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ సమయంలో అభ్యర్థులకు సంబంధించిన ఆధార్, మొబైల్ నంబర్, సమీప అధ్యయన కేంద్రం పేరు–కోడ్ నంబర్, అభ్యాసకుల పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, అభ్యాసకుల ఫొటో, సంతకం, సంరక్షకుని పేరు, లింగ నిర్ధారణ, వైవాహిక పరిస్థితి, పుట్టిన తేదీ, కమ్యూనిటీ వివరాలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, విద్యార్హతలు, మార్కుల బదలాయింపులు, సబ్జెక్టుల ఎంపిక, అదనపు సబ్జెక్టు ఎంపిక, మీడియం, ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా వంటి వివరాలను ఔత్సాహికులు సిద్ధం చేసుకోవాలి. చదువు నిలిపి వేసిన వారికి మంచి అవకాశం చదువు మధ్యలో నిలిపి వేసిన వారికి సార్వత్రిక విద్య మంచి అవకాశం. దీని ద్వారా వచ్చిన సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యకు వచ్చిన దానితో సమానమే. ఇందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో పది, ఇంటర్మీడియెట్ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువు కొనసాగించాలి. దీని వల్ల వచ్చే సర్టిఫికెట్తో ఉద్యోగాలు రావనే ప్రచారంలో నిజం లేదు. – బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో 14 ఏళ్లు నిండిన వారు అర్హులు సార్వత్రిక విద్యా విధానంలో చదువుకోవడానికి 14 ఏళ్ల నిండి ఉండాలి. దీనికి గరిష్ట వయోపరిమితి లేదు. బాలురు, బాలికలు, మహిళలు, ఉద్యోగం చేస్తున్నవారు చదువుకోవచ్చు. మధ్యలో చదువు మానేసినవారు ఈ విధానం ద్వారా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాదికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు గడువుంది. – దేవి, జిల్లా కో–ఆర్డినేటర్ సెలవుల్లో తరగతుల నిర్వహణ.. సాధారణ విద్యకు భిన్నంగా సార్వత్రిక తరగతులను నిర్వహిస్తున్నారు. ఓపెన్ స్కూల్ తరగతులను సెలవు రోజుల్లోనే నిర్వహిస్తారు. ఎంపిక చేసిన స్టడీ సెంటర్లలో జరిగే తరగతులకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్ సైన్స్ గ్రూపునకు సంబంధించి ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షల క్లాసులకు హాజరు కావాలి. ప్రతి విద్యార్థి కనీసం 30 తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఇక్కడంతా... ఓపెన్
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచి రాతలు జిల్లాలో ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు ‘డీల్’ కుదుర్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు పరీక్ష రాస్తున్న అభ్యర్థులే నేరుగా చెబుతున్నారు. పరీక్ష రాసే సెంటర్లోనే ఒక్కో అభ్యర్థి నుంచి రూ.300 నుంచి రూ.500 వరకూ వసూలు చేస్తున్న విషయం గుప్పుమంటోంది. ముందుగా పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు నేరుగా స్లిప్పులను అందజేస్తున్నారు. దీనికోసం ఒక్కో గదిలో మూడు నుంచి నాలుగు టెస్ట్ పేపర్లు పెట్టుకుంటున్నట్లు సమాచారం. బయట నుంచి ఎవరైనా పర్యవేక్షణకు వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించేదిలేదని అక్కడున్న ఇన్విజిలేటర్లే స్వయంగా ఎదురొచ్చి చెప్పేస్తున్నారు. జిల్లాలో 27 సెంటర్లలో 8,601 మంది అభ్యర్థులు పదో తరగతి పరీక్షలు, 35 కేంద్రాల్లో11,521 మంది అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలను రాస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ పరీక్షలు లోపభూయిష్టంగానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్వాకం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందంటున్నారు. విద్యార్థులు చదివే సెంటర్లకు చెందిన ఉపాధ్యాయులనే పర్యవేక్షకులుగా నియమించి మరోసారి విద్యాశాఖ అధికారులు విమర్శల పాలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో పరీక్షల నిర్వాహకులు తమకు కావాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించి వారి ద్వారా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరైతే ‘పరీక్షల్లో పాస్ కావాలి ... అన్ని విధాలా సహకరిస్తే రూ.15 వేల వరకూ ముట్టజెబుతామ’ని ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా కొంతమొత్తం అడ్వాన్స్‌గా కూడా అందజేస్తున్నారు. ఈ పరీక్షలు పదోన్నతుల కోసమో, లేక ఉద్యోగాలు చేస్తున్న వారు అర్హత పొందేందుకో రాస్తారు తప్ప ఉన్నత చదువుల కోసం కాదు కదా...అందుకే అంత సీరియస్‌గా దృష్టి పెట్టం అని నిర్వాహకులే చెబుతుండడం గమనార్హం. జిల్లా విద్యాశాఖ అధికారులకు డబ్బులు ఇస్తే సర్టిఫికెట్ తమకు వచ్చేస్తుందని అభ్యర్థులు ధీమాగా చెబుతున్నారంటే ఈ పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఈ సర్టిఫికెట్లకు ఎంతో విలువ... ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ఉన్నంత విలువ ఉంది. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, పదోన్నతులు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అనేక మంది ఓపెన్ స్కూల్స్ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. నామమాత్రపు ఫీజుతో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరిన తరువాత వార్షిక పరీక్షల్లో నిర్వాహకులు అడిగినంత ముట్టజెబితే దర్జాగా సర్టిఫికెట్లు వచ్చి చేతిలో పడతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాన్ని నిర్వాహకులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్‌గా మారిపోయింది. సెంటర్లోనే రాయ ‘బేరాలు’... జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి 62 సెంటర్లున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివే వారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఏడాదికి 24కి తగ్గకుండా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పదో తరగతి చదవాలనుకునేవారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 14 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సున్నా అర్హులే. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి 15 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సున్నా అర్హులే. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. వారిలో ఒకరు ప్రధానోపాధ్యాయులుగా, సెంటర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. తాము నిర్వహించే సెంటర్లలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు వచ్చే వారి వివరాలను, ఎలాంటి అవసరార్థం కోసం చేరుతున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడి నుంచే రాయ‘బేరాలు’ సాగిస్తుంటారు. జోరుగా కాపీయింగ్... జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం ప్రధాన కేంద్రాల్లో పరీక్ష రాసే వారికి ఇన్విజిలేటర్లే ఎంచక్కా గైడ్లను అందజేస్తున్నట్లు పరీక్ష రాసి వచ్చే విద్యార్థులు చెబుతున్నారు. ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం ... కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు పత్రికలకే పరిమితమవుతున్నాయిగానీ ఆచరణలో అవేవీ కనిపించడం లేదని అభ్యర్థులే చెప్పడం గమనార్హం. ఎక్కడో చెబితే చర్యలు తీసుకుంటాం: డీఈవో అబ్రహం ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని, అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లి వివరణ కోరగా, ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారో చెబితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షల పర్యవేక్షణకు 12 మందితో స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని, నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇన్విజిలేటర్ డ్యూటీలకు డిమాండ్... జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల ఇన్విజిలేటర్ డ్యూటీలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. ఏటా వేసవి సెలవుల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఉండే ఉపాధ్యాయులు ఓపెన్ స్కూల్ పరీక్ష విధులకు హాజరైతే వచ్చే విద్యా సంవత్సరం ఈఎల్స్ పొందే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఇన్విజిలేటర్ డ్యూటీలంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎగిరి గంతేస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో పరీక్ష నిర్వహకులు ఒక్కో చోట అవసరానికి మించి ఇన్విజిలేటర్లను, ఓపెన్ స్కూల్ నిర్వహకులు ఏర్పాటు చేసి పరీక్ష రాసే అభ్యర్థుల నుంచి ప్రతి రోజు పరీక్షలయ్యేంత వరకూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 300 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. -
ఓపెన్ పై గట్టి నిఘా..
విజయనగరం, శృంగవరపుకోట: పట్టణంలోని కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఓపెన్ ఇంటర్మీడియట్.. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఓపెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరగడం.. మీడియాలో వరుసగా వస్తున్న కథనాలపై విద్యాశాఖ స్పందించి చర్యలకు సిద్ధపడుతోంది. అదనపు సిబ్బంది నియామకం.. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను, మహిళా అభ్యర్థుల తనిఖీల నిమిత్తం ఒక్కో మహిళా ఉపా«ధ్యాయురాలిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం వారు ఆయా కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యారు. మాస్ కాపీయింగ్ నివారణకు నిరంతర నిఘా, తనిఖీలు చేపట్టినట్టు ఎంఈఓ కూర్మారావు చెప్పారు. మాస్‌కాపీయింగ్ జరిగితే అభ్యర్థులపై చర్యలతో పాటూ ఇన్విజిలేటర్లపై సస్సెన్షన్ వేటు వేస్తామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఆగని దొంగరాతలు కేంబ్రిడ్జ్, ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సోమవారం కూడా చూచి రాతలు దర్జాగా సాగాయి. అభ్యర్థులను తనిఖీ చేసే సమయంలో స్లిప్పులు దొరికినా.. కొంతమంది దొంగచాటుగా మెటీరియల్ పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లారు. కేంబ్రిడ్జ్ పాఠశాలకు మీడియా వాళ్లొచ్చారనగానే అభ్యర్థులు కిటీకీల్లోంచి సోమవారం నాటి పరీక్షలైన భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రంలకు చెందిన మెటీరియల్ విసిరేశారు. ఇదేమని నిర్వాహకులను అడిగితే మాస్ కాపీయింగ్‌ను నివారించడానికి మా శాయశక్తులా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ బదులివ్వడం విశేషం. -
పాస్ గ్యారంటీ స్కీమ్‌తో అక్రమాలు..
ఒంగోలు టౌన్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల్లో అక్రమాలు ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారు. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పరీక్ష రాస్తున్న ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల రూపాయల చొప్పున డిమాండ్ చేస్తున్నారు. ఈ పరీక్షలు రాసేవారిలో రెగ్యులర్ విద్యార్థుల కంటే సర్టిఫికేట్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఉండటంతో నిర్వాహకులు అడిగినంతగా ముట్ట చెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల చూచిరాతకు గేట్లను బార్లా తెరిచారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలకు 5049 మంది అభ్యర్థులు, ఇంటర్మీడియట్ పరీక్షకు 5479 మంది హాజరవుతున్నారు. పదో తరగతి అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియట్ అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సర్టిఫికెట్లు ఎంతో వాల్యూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ సర్టికెట్లకు రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ఉన్నంత విలువ ఉంది. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, పదోన్నతులు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అనేకమంది ఓపెన్ స్కూల్స్ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. నామమాత్రపు ఫీజులతో పదో తరగతి, ఇంటర్ మీడియట్లో చేరిన తరువాత వార్షిక పరీక్షల్లో నిర్వాహకులు అడిగినంత ముట్టచెబితే దర్జాగా సర్టిఫికెట్లు వచ్చి చేతిలో పడతాయి. ఎంతో విలువైన సర్టిఫికెట్లనునిర్వాహకులు కూడా అంతే విలువుగా మార్చుకోవడం విశేషం. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాన్ని, ఆతృతను నిర్వాహకులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్. సెంటర్లోనే రాయ‘బేరాలు’ జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి 60 సెంటర్లు ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్ మీడియట్ చదివేవారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఏడాదికి 24కు తగ్గకుండా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పదో తరగతి చదవాలనుకునేవారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 14 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సు ఉన్నా అర్హులే. ఇంటర్ మీడియట్‌కు సంబంధించి కచ్చితంగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి 15 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సు ఉన్నా అర్హులే. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. వారిలో ఒకరు ప్రధానోపాధ్యాయులుగా, సెంటర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. తాము నిర్వహించే సెంటర్లలో పదవ తరగతి, ఇంటర్ మీడియట్లో చేరేందుకు వచ్చేవారి వివరాలను, ఎలాంటి అవసరార్ధం కోసం చేరుతున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడ నుండే రాయ‘బేరాలు’ సాగిస్తుంటారు. ఇన్విజిలేటర్ డ్యూటీలకు డిమాండ్.. జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల ఇన్విజిలేటర్ డ్యూటీలకు ఎక్కడాలేని డిమాండ్ వచ్చి పడింది. ఏటా వేసవి సెలవుల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఉండే ఉపాధ్యాయులు ఓపెన్ స్కూల్ పరీక్ష విధులకు హాజరైతే వచ్చే విద్యా సంవత్సరంలో ఎర్న్డ్ లీవ్‌లు పొందే వెసులుబాటు ఉంది. దీంతో ఇన్విజిలేటర్ డ్యూటీలంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎగిరి గంతేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఒంగోలులోని ఒక పరీక్ష కేంద్రం. దీని పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏడుగురు ఇన్విజిలేటర్లు సరిపోతారు. కానీ, ఏకంగా 35మంది ఇన్విజిలేటర్లు విధులకు హాజరవుతున్నారంటే ఆ డ్యూటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. రూ.15 లక్షల కారు గిఫ్ట్.. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరిగే ప్రతిసారీ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటాయి. 2015–2017 మధ్యకాలంలో జిల్లా విద్యాశాఖాధికారిగా వ్యవహరించిన ఒక అధికారికి అప్పటి ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ 15 లక్షల రూపాయల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారంటే పరీక్షల్లో అభ్యర్థుల నుండి ఏ మేరకు వసూలు చేశారో అర్ధమవుతోంది. ఆ సమయంలో జిల్లాలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల అక్రమాల గురించి పత్రికల్లో కథనాలు రావడంతో సాక్షాత్తు ఓపెన్ స్కూల్ డైరెక్టర్ వచ్చి పరీక్షలను పర్యవేక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఓపెన్ పరీక్షల్లో కూడా అభ్యర్థుల నుంచి వసూళ్లు చేస్తున్న దానిలో కింది నుంచి విద్యాశాఖలో కీలక స్థాయిగా వ్యవహరించే వారివరకు ఎవరి వాటాలు వారికి సిద్ధం చేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే.. ఓపెన్ స్కూల్ సొసైటీకి జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఓపెన్ స్కూల్‌కు కార్యక్రమాల నివేదికలను కలెక్టర్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఓపెన్ పరీక్షల విషయంలో గేట్లు బారుగా తెరిచి పెద్ద ఎత్తున జరుగుతున్న వసూళ్ల పర్వానికి జిల్లా కలెక్టర్ బ్రేక్‌లు వేయాల్సి ఉంది. ఆయన కూడా మౌనంగా వ్యవహరిస్తే జిల్లాలో ఓపెన్ అక్రమాలకు అడ్డే ఉండదు. అభ్యర్థుల నుంచి వసూళ్లకు అంతమనేది ఉండదు. కంభంలో జోరుగా కాపీయింగ్ కంభం : పదో తరగతి ఓపెన్ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా సాగింది. పాపం విద్యార్థుల కష్టాన్ని చూడలేక ఇన్విజిలేటర్లే ఎంచక్కా ప్రశ్న పత్రం చూసి బ్లాక్ బోర్డుపై సమాధానం రాశారు. ఆ కేంద్రంలో లేటు వయసులో పరీక్షకు హాజరైన వారంతా వాటిని చూచి రాస్తూ పండుగ చేసుకున్నారు. పదోతరగతి ఓపెన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు ముందు జిల్లా ఉన్నతాధికారులు ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ ఆచరణలో కనబడలేదు. కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించగా అక్కడ జరిగిన పరీక్షల్లో ఇన్విజిలేటర్లే బోర్డులపై ప్రశ్నలకు సమాధానాలు రాయడం విశేషం.పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా కేంద్రంలోకి వెళ్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే చీఫ్ సూపరిండెంట్ వెళ్లిపోయినట్లు తెలిసింది. స్క్వాడ్ అధికారులు కూడా అలా వచ్చి, ఇలా వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్లు కాపీయింగ్‌కు తెరలేపారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక పరీక్షలు ఎంత బాగా జరగనున్నాయో వేచి చూడాలి. -
టెన్త్ పాత సిలబస్ వారు ఓపెన్ స్కూల్‌కే!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పాత సిలబస్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే దూర విద్య పరీక్షల్లోనే పదో తరగతి పరీక్షలు రాసుకోవాలని, వారికి 2016 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో అవకాశం ఇవ్వడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత సిలబస్‌లో 2015 మార్చి పరీక్షలకంటే ముందు సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇకపై ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంలోనే టెన్త్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2014-15 విద్యా సంవత్సరంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని విద్యాశాఖ 9, 10 తరగతుల్లో అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్నల్స్ విధానం ప్రవేశ పెట్టి.. వాటికి 20 మార్కులను ఇస్తోంది. ఇక రాత పరీక్షలను ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే నిర్వహిస్తోంది. ఆ ప్రకారమే 2015 మార్చిలో పరీక్షలను నిర్వహించింది. ఇక 2014 మార్చి వరకు పాత విధానంలో టెన్త్ పరీక్షలు జరిగాయి. ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో 2014 మార్చి, అంతకుమందు జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారంతా 2016 మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు హాజరయ్యే వీలు లేదని విద్యా శాఖ వెల్లడించింది. వారు జాతీయ ఓపెన్ స్కూల్ సొసైటీ లేదా రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు హాజరై పదో తరగతి పూర్తి చేయాలని సూచించింది. ఈ అంశంపై డీఈవోలు విస్తృత ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేసింది. పదో తరగతి పాత సిలబస్‌లో ఫెయిల్ అయిన వారంతా ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని వెల్లడించింది. ఓపెన్ స్కూల్లో 4వరకు ప్రవేశాలు.. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసిందని, ఈ నెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించిందని విద్యాశాఖ వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది. అలాగే ఇదే అంశంపై సోమవారం ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు కలసి జిల్లాల్లోని ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. మీసేవ/ఏపీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించింది. ఒకటి ఫెయిలైనా.. మూడు రాయాల్సిందే... టెన్త్ పాత సిలబస్‌లో ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఓపెన్ స్కూల్ విధానంలో ఆ ఒక్క సబ్జెక్టులో మాత్రమే పరీక్షలు రాసే వీలు లేదు. ఆ అభ్యర్థి ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీలో కనీసం మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. రెగ్యులర్ టెన్త్‌లో ఫెయిల్ అయిన వారికి ఓపెన్ స్కూల్లో రెండు సబ్జెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్(టీవోసీ) కింద రెండింటికే అవకాశం ఉంటుందన్నారు. ఓపెన్ స్కూల్లో చేరే పదో తరగతి విద్యార్థులు మొత్తంగా 5 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అప్పుడే ఎస్సెస్సీ పాస్ అయినట్లు లెక్క. కాబట్టి టీవోసీ కింద రెండింటికి మినహాయింపు ఇస్తామని, మరో మూడు సబ్జెక్టుల్లో కచ్చితంగా పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. -
ఓపెన్ స్కూల్ సొసైటీ ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలోని ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు విభజిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో సూచించిన దామాషా ప్రకారం ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
క్షమించు భారతీ
ఏ రంగంలోనైనా ఏటా పురోగతి సాధించడం రివాజు... కానీ జిల్లా విద్యారంగంలో మరింత వెనుకబడిపోయింది. పది ఫలితాల్లో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంటర్లో ‘17’ నుంచి చిట్టచివరి స్థానానికి దిగజారింది. విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఆర్వీఎం, విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యావ్యవస్థ నిర్వీర్యమైపోతుందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం జిల్లాలో విద్యారంగం అభివృద్ధి నత్తనడకన నడుస్తోంది. ఎంతో ఉన్నతాశయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినా ఈ పథకం అమలుపై, పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ అమలుపై కూడా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ప్రకటించనే లేదు. నిధుల మంజూరు కూడా అంతంత మాత్రమే. దీనికి తోడు సర్కారు పథకాలేవీ సమర్థవంతంగా అమలు కాకపోవడంతో విద్యారంగం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. తెలంగాణ, సమైక్య ఉద్యమాల వల్ల ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. కార్పొరేట్ విద్యను అభ్యసించలేక విద్యార్థులు బడిమెట్లు ఎక్కలేకపోయారు. పత్తిచేళ్లు, పంటపొలాల్లో మరోఏడాది బాల్యం గడిచిపోయింది. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రకారం బోధన కొనసాగించాలని ఆదేశాలున్నప్పటికీ, ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చినప్పటికీ పాఠశాలల్లో సీసీఈ ప్రకారం బోధన కొనసాగలేదు. - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ విద్యావిభాగం బదిలీలు పదోన్నతులు జిల్లా వ్యాప్తంగా 2794 మంది ఉపాధ్యాయులు బదిలీ అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రతినెల పదోన్నతుల కౌన్సెలింగ్ చేపడుతుండటంతో ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 700మంది ఉపాధ్యాయులకు పదోన్నతి అవకాశం దక్కింది. జిల్లాలో కొత్తగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ కోర్సును ప్రవేశపెట్టి పరీక్షలను కూడా నిర్వహించడంతో ఓపెన్ విధానంతో వయోజనులకు ఇంటర్ చదివే అవకాశం దక్కింది. ఏప్రిల్ 22న అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించి, 59 మందికి పోస్టింగ్ ఇచ్చారు. డీఈఓ సుదర్శన్‌రెడ్డి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఏప్రిల్ 26న చంద్రమోహన్ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మే 24న ఆర్వీఎం పీఓ విష్ణువర్ధన్‌రావు బదిలీ కాగా, ఆయన స్థానంలో పద్మహర్ష ఇన్చార్జి పీఓగా బాధ్యతలు చేపట్టారు. ‘పది’లో తొమ్మిదో స్థానం పదోతరగతిలో గతేడాది 90.59 శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి కూడా ఉత్తీర్ణత శాతం (91.22) పెరిగినా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 45,897 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41,868 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా గ్రేడింగ్ విధానంలో ఫలితాలు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం పదికి పది (గ్రేడ్1) పాయింట్లు సాధించడం విశేషం. ఇంటర్లో అట్టడుగు.. ఇంటర్ ఫలితాల్లో ఈ సారి పాలమూరు జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది 57 శాతం ఉత్తీర్ణతతో 17వ స్థానంలో నిలవగా, ఈ సారి 45 శాతంతో చివరి స్థానానికి దిగజారింది. మొత్తం 37,039 మంది పరీక్ష లకు హాజరుకాగా, 16,580 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాల ఉత్తీర్ణతలో జిల్లా 58 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్‌లో 40 శాతంతో చివరిస్థానంలోనే నిలిచింది. ముఖ్యమైన పోస్టులు ఖాళీ... జిల్లాలోని 64 మండలాలకు గాను 50 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. డిప్యూటీ ఈఓలు సైతం డిప్యుటేషన్‌పై పనిచేస్తుండటంతో విద్యా వ్యవస్థ గాడిన పడటం లేదు. అధికారుల అలసత్వం కారణంగా జిల్లాలోని 39 ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 200 ఉపాధ్యాయ పోస్టులకు పైగా ఖాళీ ఏర్పడింది. నిరుద్యోగులకు తప్పని నిరాశ... టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడటంతో అభ్యర్థులలో అయోమయం నెలకొంది. రాష్ట్ర విభజన ఉద్యమాలతో ప్రభుత్వం టెట్‌ను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో డీఎస్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలోని వేలాది మంది డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంతుళ్లపై క్రిమినల్ కేసులు నకిలీ మెడికల్ బిల్లులతో ప్రభుత్వ సొమ్మును కాజేసిన 37 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టారు. విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, ఈ విషయాన్ని బయటపెట్టారు. నవంబర్ 21న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణిమోహన్ ఆదేశాలు జారీ చేశారు. మి(మ)థ్యాన్న భోజనం జిల్లాలోని 3677 సర్కారు బడుల్లోని 4,90,254 విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు. ఫిబ్రవరి 6న ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కొండనాగుల డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అదే నెల 15న మంత్రి డీకే అరుణ ఈ పథకంలో జొన్నకిచిడిని ప్రారంభించారు. పీయూ విశేషాలు ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పీయూ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పీయూ అభివృద్ధి కోసం * 15 కోట్ల ప్యాకేజీ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.8.9 కోట్లు మంజూరు చేశారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 12 పీజీ కళాశాలలు, 68 డిగ్రీ కళాశాలలు, 2 ఫార్మసీ కళాశాల, 40 బీఈడీ కళాశాలలు, 5ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. పీయూ ప్రిన్సిపల్ పిండి పవన్‌కుమార్‌కు రిసెర్చ్‌లో యూజీ అవార్డు వచ్చింది. పీయూలో అడ్మినిస్ట్రేషన్, లైబ్రరీ, పీజీ. ఫా ర్మసీ విభాగాలకు నూతన భవనాలు నిర్మించారు. ముఖ్య సంఘటనలు... గతేడాదికి సంబంధించిన యూనిఫామ్‌లను మాత్రమే ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు సరఫరా చేశారు. ఎంఈఓలు ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై జిల్లా కేంద్రంలోనే యూనిఫామ్స్ కుట్టేందుకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గోదాంలపై దాడి చేసి యూనిఫామ్స్ వస్త్రాన్ని సీజ్ చేశారు. జూన్ 22న ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలు విద్యార్థి సంఘాల నాయకులకు గాయాలయ్యాయి. జూలైలో బల్మూర్ కేజీబీవీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈసారి జిల్లాలోఆరుగురుజాతీయ ఉత్తమఉపాధ్యాయు లుగాఎంపికకాగా,11మందిరాష్ట్రస్థాయి, 42మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్నారు. వైఫల్యాలు... స్కూల్ కాంప్లెక్సు నిర్వహణ తగిన విధంగా కొనసాగడం లేదు. కిందిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంప్లెక్స్‌ల ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు వెనుకబడి పోయాయి. రాజీవ్ విద్యామిషన్ పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రవూలు తగిన ఫలితాలు చూపలేదు. అన్నీ మొక్కుబడి కార్యక్రమాలే కొనసాగాయి. విద్యార్థుల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం సక్రమంగా అమలు కావడంలేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం పూర్తిస్థాయిలో బోధన అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కేజీబీవీ, సంక్షేమ హాస్టళ్లు, ఇతర డిపార్ట్మెంటుల్లో రాజకీయ పలుకుబడితో ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం, మూత్ర శాలలు, కిచెన్ షెడ్లు, ఇతర నిర్మాణాల కోసం నిధులు మంజూరయినప్పటికీనిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. విద్యావ్యాపారాన్నిఅడ్డుకోవడంలోఅధికారులువిఫలమయ్యారు.