
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి.
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 159 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
విజయవాడ నగరంలో 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1,30,100 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 65,091 మంది, రెండో సంవత్సరం 65,009 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఒకేషనల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 966 మంది, రెండో సంవత్సరం 1,666 మంది రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 159 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 159 మంది డిపార్టుమెంటల్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
నిర్ణీత వ్యవధిలోగా చేరుకోవాలి
నిర్ణీత వ్యవధిలోగా వచ్చినవారిని మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి వెంకట్రామయ్య స్పష్టం చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 8.25 గంటలకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని, 8.30 గంటలకు హాల్‌టిక్కెట్లు పరిశీలించి, 8.45 గంటలకు ప్రొఫార్మా షీట్లు ఇస్తామని ఆయన తెలిపారు.
9 గంటల తరువాత పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు.