
ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణ హాల్ టికెట్లు
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్రం విడిపోవడంతో ఉన్నత విద్యాశాఖను కూడా విభజించారు. కానీ కొంతమంది ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు తెలంగాణా బోర్డు నుంచి రావడంతో వారు అవాక్కయ్యారు. బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో ఉన్న 7 పరీక్ష కేంద్రాల్లో నలుగురు విద్యార్థులకు తెలంగాణ బోర్డు నుంచి హాల్ టికెట్లు వచ్చాయి. గురువారం నుంచి ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సరం విషయంలోనూ సూరిపోగు రాజ్‌కుమార్ అనే విద్యార్థికి తెలంగాణ హాల్ టికెట్ వచ్చింది. మార్కుల జాబితా, ధ్రువీకరణ పత్రం కూడా తెలంగాణ బోర్డు నుంచి వస్తే మన రాష్ట్రంలో ఉన్నత చదువుకు, ఉద్యోగాలకు అనర్హుడుగా అవుతానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ప్రింటింగ్ ప్రెస్ వల్లే ఇబ్బందులు
ఈ విషయమై ఇంటర్మీడియెట్ ప్రాంతీయ బోర్డు అధికారి రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా హైదరాబాద్‌లో ప్రింటింగ్‌ప్రెస్ ఒకటేనని అందువలనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. చీరాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నుంచి హాల్‌టికెట్లు పొందిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని, ఆందోళన చెందనవసరం లేదన్నారు. తెలంగాణ బోర్డు నుంచి వచ్చిన హాల్‌టికెట్లున్న విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాళ్ల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సమస్యలు రాకుండా చూస్తానన్నారు.