
బాలికలదే హవా
– ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు
– జూనియర్ ఇంటర్‌లో జిల్లాకు 9వ స్థానం
– సీనియర్ ఇంటర్‌లో 10వ స్థానం
– ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల
- ప్రభుత్వ కళాశాలల్లో పెద్దపప్పూరు టాప్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బాలికలు హవా కొనసాగింది. గురువారం విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే మొదటిస్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాదికంటే ఈ సారి మెరుగుపడగా, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెనుకబడ్డాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతేడాది జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ఈసారి 54 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానానికి ఎగబాకింది. జిల్లాలో మొత్తం 33,244 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 18,076 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 16,356 మంది బాలురకు గాను 7,990 మంది 49 శాతం, 16,888 మంది బాలికలకు గాను 10,086 మంది 60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత
జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాదికంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 40 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి 35.96 శాతానికి పడిపోయింది. మొత్తం 7,124 మంది విద్యార్థులకు గాను 2,562 మంది ఉత్తీర్ణత సాధించారు. పెద్దపప్పూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ 66 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 86.36 శాతంతో 57 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే రొద్దం కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. 111 మంది విద్యార్థులకు గాను 68.47 శాతంతో 76 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గుడిబండ కళాశాల తృతీయ స్థానంలో నిలిచింది. 189 మంది విద్యార్థులకు గాను 56.61 శాతంతో 107 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రాయదుర్గం జూనియర్ కళాశాల చివరిస్థానంలో నిలిచింది. 401 మంది విద్యార్థులకు గాను 17.71 శాతంతో కేవలం 71 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎయిడెడ్ కళాశాలల్లో 39.19 శాతం ఉత్తీర్ణత
ఎయిడెడ్ కళాశాలల్లో 39.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎస్‌ఎస్ బాలికల కళాశాల ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ 479 మంది విద్యార్థినులకు గాను 48.02 శాతంతో 230 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే గోరంట్ల ఎస్‌ఏపీఎస్ కళాశాల చివరిస్థానంలో నిలిచింది. 154 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 15.58 శాతంతో కేవలం 24 మంది గట్టెక్కారు.
దిగజారిన ద్వితీయ సంవత్సరం స్థానం
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మన జిల్లా స్థానం రాష్ట్రంలో గతేడాదికంటే ఈసారి కిందకు దిగజారింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా ఈసారి 10వ స్థానానికి పడిపోయింది. మొత్తం 28,230 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 70 శాతంతో 19,747 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 13,761 మంది బాలురకు గాను 8,945 మంది 65 శాతం, 14,469 మంది బాలికలకు గాను 10,802 మంది 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లో 63.55 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది 63.55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదికంటే 0.55 శాతం మెరుగుపడింది. మొత్తం 5,918 మంది విద్యార్థులకు గాను 3,761 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా పెద్దపప్పూరు జూనియర్ కళాశాలే జిల్లా ప్రథమస్థానం దక్కించుకుంది. ఈ కళాశాలలో 85 మంది విద్యార్థులకు గాను 94.12 శాతంతో 80 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కంబదూరు కళాశాల ద్వితీయస్థానంలో నిలిచింది. 93 మంది విద్యార్థులకు గాను 86.02 శాతంతో 80 మంది ఉత్తీర్ణత సాధించారు. చిలమత్తూరు కళాశాల తృతీయస్థానంలో నిలిచింది. 87 మంది విద్యార్థులకు గాను 81.61 శాతంతో 71 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక నల్లమాడ కళాశాల చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ 72 మంది విద్యార్థులకు గాను 38.89 శాతంతో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
‘ఎయిడెడ్’లో 56.71 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 56.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,208 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 685 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక్కడ కూడా నగరంలోని ఎస్‌ఎస్‌ఎస్ బాలికల కళాశాల ప్రథమస్థానంలో నిలిచింది. 410 మంది విద్యార్థినులకు గాను 62.93 శాతంతో 258 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. 283 మంది విద్యార్థులకు గాను 56.18 శాతంతో 159 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక గోరంట్ల ఎస్‌ఏపీఎస్ కళాశాల ఇక్కడ కూడా చివరిస్థానంలో నిలిచింది. 117 మంది విద్యార్థులకు గాను 28.21 శాతంతో కేవలం 33 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
నెట్ కేంద్రాలు, సెల్‌ఫోన్లతో సందడి
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి బంధువులు నెట్ సెంటర్ల వద్ద, ఆండ్రాయిడ్ ఫోన్లతో సందడి చేశారు. మార్కులు తెలుసుకునేందుకు ఎగబడ్డారు. ఫలితాలు వెలువడగానే అనంతపురం నగరంతో పాటు హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, ఉరవకొండ, గుత్తి, పుట్టపర్తి, మడకశిర పట్టణాల్లోని నెట్ కేంద్రాలు కిటకిటలాడాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందంగా గడిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం గత ఫలితాలు ఇలా...
సంవత్సరం శాతం
2008 45
2009 33.53
2010 36
2011 44
2012 47
2013 45.5
2014 49
2015 53
2016 47
2017 54
ఇంటర్ ద్వితీయ సంవత్సరం గత ఫలితాలు ఇలా...
సంవత్సరం శాతం
2008 60
2009 52.86
2010 53
2011 57
2012 55
2013 63
2014 65
2015 66
2016 69
2017 70