
అనంతపురం: జూనియర్æకళాశాల కేంద్రంలో చీకట్లోనే పరీక్ష
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించామని ఊదరగొట్టిన అధికారుల డొల్లతనం తొలిరోజే బయటపడింది. చాలా కేంద్రాల్లో ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చెమటలు కక్కుతూనే పరీక్ష రాశారు. వెలుతురు సరిగాలేని గదుల్లో లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకటికి పదిసార్లు సమీక్షలతో కాలం గడిపిన జిల్లా ఉన్నతాధికారులు, ఇంటర్‌బోర్డు అధికారులు పరీక్ష వేళ చేతులెత్తేయడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.
అనంతపురం విద్య: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 97 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 34,839 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 33,709 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో అధికారులు కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. దీంతో విద్యార్థులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. లైట్లు లేకపోవడంతో చీకట్లోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరీక్షలు బాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా గత 20 రోజులుగా జాయింట్ కలెక్టర్–2, ఆర్‌ఐఓలు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, న్యూటౌన్–ఎస్.ఎస్.బీ.ఎన్ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం.. ఫ్యాన్లు అసలు లేకపోవడంతో విద్యార్థులు చుక్కలు చూడాల్సి వచ్చింది.
జూమ్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మాస్‌కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆర్‌ఐఓ, ఇతర ఉన్నతాధికారులతో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ‘జూమ్ యాప్’ ద్వారా పర్యవేక్షించారు. 97 పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
యాప్.. బంపర్ గైడ్
గతంలో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ నోటీసు బోర్డులో వేసిన సమాచారం ఆధారంగా తమకు కేటాయించిన గదికి వెళ్లేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా ముందు రోజు రాత్రే విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్డ్ నంబర్‌కు పరీక్ష కేంద్రం, సీటింగ్ అరైంజ్‌మెంట్ సమాచారాన్ని చేరవేసేలా ఇంటర్‌బోర్డు అధికారులు ‘సెంటర్ మొబైల్ లొకేటర్ యాప్ ’ను అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ యాప్ ఇంటర్ విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేశారు.
నేడు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు గురువారం తెలుగు/సంస్కృతం పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 97 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుండగా.. 32,041 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముందస్తుగానే పరీక్ష కేంద్రానికి వస్తే ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
27 ప్రత్యేక బస్సులు
ప్రతి విద్యార్థికీ, తాను చదువుతున్న కళాశాలకు 20 కి.మీ దూరం లోపే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ‘ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు’ అని గతంలో పేర్కొన్నప్పటికీ.. బుధవారం పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు సడలింపు ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు విద్యార్థి పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు కారణాన్ని చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయన సమ్మతిస్తే పరీక్షకు అనుమ తిస్తారు. ఎక్కువ ఆలస్యమైతే ప్రత్యేకమైన పరిస్థితులు, కారణాలు ఉంటే అనుమతించే అంశంపై ఛీప్ అబ్జర్వర్లు నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కోసమే ఆర్టీసీ ప్రత్యేకంగా 27 సర్వీసులు నడిపింది.
Comments
Please login to add a commentAdd a comment