
అనంతపురంలో బాలకృష్ణ రోడ్‌షో (ఇన్‌సెట్‌లో) హిందూపురంలో మాట్లాడుతున్న బాలయ్య
అనంతపురం టౌన్/కల్చరల్/హిందూపురం అర్బన్: న్యూస్‌లైన్ : లెజెండ్ చిత్ర హీరో బాలకృష్ణ పర్యటన అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పేరుకు సినిమా విజయయాత్ర అని చెప్పినా పొలిటికల్ యాత్రగా సాగిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ చిత్రం విజయ యాత్రను యూనిట్ సభ్యులుచేపట్టారు. శుక్రవారం అనంతపురం, హిందూపురంలో పర్యటన సాగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు అనంతపురంలోని గంగా-గౌరి థియేటర్ వద్దకు బాలకృష్ణ వస్తాడని చెప్పడంతో మూడు గంటల ముందే అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
సాయంత్రం 6 గంటల తర్వాత జాతీయ రహదారి మీదుగా వచ్చిన బాలయ్య తపోవనం నుంచి రోడ్ షోగా బయలుదేరారు. అప్పటి నుంచి ఇదిగో ఐదు నిమిషాల్లో వస్తాడు.. అదిగో పది నిమిషాల్లో వస్తాడు అని అభిమానులు ఎదురు చూసినా చివరకు రాలేదు. సమయం సరిపోదన్న సాకుతో థియేటర్ వద్దకు వెళ్లకుండానే హిందూపురం వెళ్లిపోయారు. ఈ విషయం తెలియగానే అప్పటి వరకు హుషారుగా ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు.
‘బాలయ్య వచ్చింది సినిమా విజయోత్సవానికి కాదు.. అంతా ఎన్నికల కోసమే.. తెలుగుదేశం వాళ్లకు ప్రచారం చేయడం కోసం వచ్చి అంతా షో చేశాడు.. పొద్దున్నుంచీ పడిగాపు కాసినోళ్లంతా తిక్కోళ్లా’ అనుకుంటూ థియేటర్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ..‘ముందుగా ఖరారైన షెడ్యూల్‌లో భాగంగా థియేటర్‌లో విజయోత్సవ సభలో బాలకృష్ణ పాల్గొనాల్సి ఉంది. అర్ధంతరంగా పర్యటనను ముగించడంపై మాకు సమాచారం లేదు’ అని చెప్పారు.
లెజెండ్ సినిమా విజయ యాత్రకు బాలకృష్ణ వస్తున్నారని మేం ఐదుగురం పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు వచ్చాం. ఇదిగో వస్తాడు.. అదిగో వస్తాడు అని ఊరించారు. చివరకు రాకుండానే వెళ్లిపోయారు. ముందే విషయం తెలుసుంటే కనీసం వేరే పనులకు వెళ్లేవాళ్లం. మరో రెండు చోట్ల మాకు పౌరోహిత్యం పనులు ఉన్నా వాటికి పోలేదు. అభిమానులను చూసి పలకరించి ఉంటే బాగుండేది.
- రాఘవేంద్ర ప్రసాద్, పురోహితుడు, వేణుగోపాల్ నగర్, అనంతపురం