నల్లగొండ అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా 115 పరీక్షా కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు మొత్తం 45,859 మంది విద్యార్థులకు గాను 40,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5096 మంది గైర్హాజరు అయ్యారు. జనరల్ విభాగంలో 41,367 మంది విద్యార్థులకు గాను 37,092 మంది పరీక్ష రాయగా 4275 మంది గైర్హాజరు అయ్యారు. అదే విధంగా ఒకేషనల్ విభాగంలో 4492 మందికి గాను 3671 మంది హాజరు, 821 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. కాగా జిల్లా కేంద్రంలో ఆర్‌ఐఓ ఎన్.ప్రకాశ్‌బాబు పలు సెంటర్లను తనిఖీ చేశారు. హై పవర్ కమిటీ (హెచ్‌పీసీ), జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు, ఫ్లైయింగ్ స్వ్కాడ్, సిట్టింగ్ స్వ్కాడ్‌లు 45 సెంటర్లలో తనిఖీలు జరిపారు.
జిల్లాలోని వివిధ సెంటర్లలో...
మోత్కూరు మండలంలోని అడ్డగూడూరు ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థినులు 21 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షలకు హాజరయ్యారు. గురుకుల విద్యా సంస్థ వారు సమకూర్చిన డీసీఎం వ్యానులో వారు మోత్కూరు మండల కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. ప్రథమ సంవత్సరం వారు 79 మంది విద్యార్థులు ఉండగా, ద్వితీయ సంవత్సరం 73 మంది ఉన్నారు. ఇక్కడే సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులన్నారు. గత సంవత్సరం కేవలం ప్రథమ సంవత్సరం విద్యార్థులే ఉండటం వల్ల సెంటర్ కేటాయించలేదని చెప్పిన అధికారులు, ఈయేడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నప్పటికీ సెంటర్‌ను కెటాయించలేదు.
సూర్యాపేట పట్టణంలో విద్యార్థులకు 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5224 మంది విద్యార్థులకు గాను 4664 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 560 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించాల్సి ఉంది. కానీ కొన్ని కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల కొరత ఉంది. అంఛనాలకు మించి విద్యార్థులకు పరీక్షలకు హాజరుకావడంతో వివిధ పరీక్షా సెంటర్లలో సరిపోను సీటింగ్ లేక వరండాల్లో ఏర్పాటు చేశారు. వరండాల్లో కింద కూర్చొని పరీక్షలు రాయడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. చౌటుప్పల్ పట్టణంలో ఐదు ఇంటర్ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఓ పరీక్షా కేంద్రాన్ని లక్కారం శివారులోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేశారు. ఇది మండల కేంద్రానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలోనే ఉంది. ఇక్కడికి బస్సు, ఆటో సౌకర్యం ఏదీ లేకపోవడంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. నాంపల్లిలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేక, నేలపైనే కూర్చొని పరీక్ష రాశారు. మర్రిగూడలోని వేమన జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు మండల కేంద్రానికి 2కి.మీ దూరంలో ఉండడంతో వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బస్ సౌకర్యంలేక విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Published Mon, Mar 9 2015 11:33 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement