ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
Published Thu, Mar 13 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ :జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, 120 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ అధికారి కేటీ దాశరథి తెలిపారు. కాగా జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 48,270 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉంది. అయితే 3,883 మంది ైగె ర్హాజరు కాగా 44,387 మంది పరీక్షలు రాశారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా 10 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 5 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30లకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా కొన్ని పరీక్షా కేంద్రాలకు మొత్తం 15 మంది విద్యార్థులు ఆలస్యంగా 8.45-9.00 గంటల మధ్య వచ్చారు. అయినా వారు దూరప్రాంతాల నుంచి రావడం వంటి సహేతుకమైన కారణాలు చూపడంతో పరీక్ష రాయడానికి అనుమతించినట్టు దాశరథి తెలిపారు. కాగా గురువారం నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు.
పలు కేంద్రాల్లో కొరవడ్డ కనీస సౌకర్యాలు
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యమూ ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు చెపుతున్నా.. పలు కేంద్రాల్లో అనేక సమస్యలను విద్యార్థులు చవి చూడాల్సి వచ్చింది. ఓవైపు ఎండలు ముదురుతుండడంతో.. విద్యుత్ సదుపాయం లేని చోట్ల, ఉన్నా ఫ్యాన్లు లేని చోట విద్యార్థులు ఉక్కపోతతో, చెమటలు కారుతుండగా పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు లేకపోవడంతో, ఉన్నా కరెంటు పోవడంతో మసక వెలుతురులోనే విద్యార్థులు తడుముకుంటూ జవాబులు రాయాల్సిన దుస్థితి ఎదురైంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో చాలినన్ని డెస్కులు లేకపోవడంతో ఎందరో విద్యార్థులు ప్యాడ్‌లను ఒళ్లో పెట్టుకుని, అవస్థలు పడుతూ పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇక్కడ మరుగుదొడ్లు వినియోగించజాలనంత అధ్వానంగా ఉండడం కూడా విద్యార్థులకు మరో విషమ పరీక్షగా మారింది.
Advertisement
Advertisement