బుధవారం బెంగళూరు బసవనగుడిలోని ఓ కేంద్రం
యశవంతపుర: ఆదిలోనే హంసపాదు అన్నట్లు పీయూసీ (ఇంటర్‌మీడియేట్) ద్వితీయ ఏడాది పరీక్షల మొదటిరోజే లీకేజీ రగడ నెలకొంది. బుధవారం రాష్ట్రమంతటా పీయూసీ పరీక్షలు ఆరంభమయ్యాయి. విజయపుర (బిజాపుర)లో ఇండి పట్టణ పోలీసులు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లీక్ చేసిన మురుగేశ్ సగరతో పాటు పరీక్ష రాస్తూ పేపర్‌ను బయటకు వేసిన మురుఘేంద్ర అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇండి పట్టణంలోని శాంతేశ్వర విద్యావర్ధక సంఘం కాలేజీలో బుధవారం ఉదయం ప్రశ్నాపత్రం లీకైంది. మురుఘేంద్ర అనే విద్యార్థి భౌతికశాస్త్రం పరీక్షను రాస్తూ క్వశ్చన్ పేపర్‌ను కేంద్రం బయట ఉన్న స్నేహితుడు మురుగేశ్ సగరకు విసిరాడు. దీనిని అతడు ఫోటో తీసి వాట్సప్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పేపర్ లీకైందని పెద్దస్థాయిలో ప్రచారం జరిగింది. ఇది తెలిసి ఇండి పట్టణ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
సూపర్‌వైజర్ సస్పెండ్..
పరీక్ష రూం సూపర్‌వైజర్ నారాయణకర్‌ను జిల్లా కలెక్టర్ వైఎస్ పాటిల్ సస్పెండ్ చేశారు. పరీక్ష కేంద్రానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ అనుపమ అగ్రవాల్ వచ్చి పరిశీలించి పునరావృతం కాకుండా సూచనలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో కాలేజీ సిబ్బంది పాత్ర మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మర తనిఖీ జరుగుతోంది. లీకేజీలు, కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు జరుపుతామని ఒకవైపు విద్యామంత్రి సురేష్‌కుమార్ పదేపదే ప్రకటిస్తూ ఉన్న తరుణంలో లీకేజీ సంఘటన సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment