
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను, మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షల కోసం 1,456, పదో తరగతి పరీక్షల కోసం 4,200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం కర్నూలులో ప్రకటించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో విద్యా శాఖ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 3,30,376 మంది బాలురు, 3,09,429 మంది బాలికలు కలిపి మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు.
అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,05,052 (బాలికలు 2,53,406, బాలురు 2,51,646) మంది, ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,81,481 (బాలికలు 2,39,160, బాలురు 2,42,321) మంది హాజరవుతారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 11 నుంచి 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం 1,757 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 7న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, మార్చి 9న ఎన్విరాన్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.