సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తూ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ పరీక్షలపై మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో పరీక్షల అవసరం, వాటి నిర్వహణ కోసం చేపట్టబోయే చర్యల గురించి తెలియచేశామన్నారు. ఈమేరకు మంత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘çసుప్రీంకోర్టులో ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది నిజం కాదు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి? నిర్వహించాల్సిన అవసరమేముంది? అనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం అడిగింది. దానికి సమాధానమిస్తూ పరీక్షలు ఎలా నిర్వహిస్తాం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించాం.
ప్రధానంగా ఒక్కో రూములో 15కి మించి విద్యార్థులు లేకుండా, అలాగే ప్రతి విద్యార్థికీ అయిదడుగుల భౌతికదూరం ఉండేలా చూస్తూ, కోవిడ్–19 ప్రొటోకాల్ నియమ, నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలియచేశాం. అంతేకాకుండా పరీక్షల ఆవశ్యకతను ముఖ్యంగా ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న అంశాన్ని వివరించాం. పదో తరగతిలో కూడా మార్కులు కాకుండా గ్రేడ్లు మాత్రమే ఇస్తామని చెప్పాం. కోర్టు వాటన్నిటినీ అఫిడవిట్ ద్వారా తెలియచేయాలని రెండురోజుల గడువు ఇచ్చింది. కేసును గురువారానికి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులన్నిటినీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించనున్నాం. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం. వారు ఏ నిర్ణయం చెప్పినా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం
Published Wed, Jun 23 2021 5:19 AM | Last Updated on Wed, Jun 23 2021 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment