ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన! | ambiguity on intermediate exams in two telugu states | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!

Published Thu, Nov 27 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!

ఇంటర్ పరీక్షలపై ఎన్నాళ్లీ ప్రతిష్టంభన!

* ఇంటర్ పరీక్షలపై వీడని గందరగోళం
* పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టు
* వేరుగా నిర్వహించేందుకే తెలంగాణ మొగ్గు.. గవర్నర్ సమావేశం పెట్టినా కొలిక్కి రాని సమస్య


సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరీక్షలను వేర్వేరుగా నిర్వహించేందుకు వేర్వేరుగా ఇరు రాష్ట్రాలు పరీక్షల టైం టేబుల్ ప్రకటించినా.. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 19 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షల వ్యవహారాన్ని తేల్చకుండా.. ఇరు ప్రభుత్వాలు వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. వేర్వేరు పరీక్షల వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ఉమ్మడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పట్టుపడుతుండగా... కలిపి నిర్వహిస్తేనే సమస్యలు వస్తాయంటూ, సొంతంగా పరీక్షల నిర్వహణకు తెలంగాణ మొగ్గు చూపుతోంది.

ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన పేపరు కొనుగోళ్లు, ముద్రణ పనుల విషయంలో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తల పట్టుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది ఒక దశలో తెలంగాణ, ఏపీలకు చెందిన మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశమై చర్చించినా... పరీక్షల నిర్వహణ అంశాన్ని తేల్చలేకపోయారు. చివరకు ఈ ఇద్దరు మంత్రులతో గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించినా సమస్య కొలిక్కి రాలేదు.

ఇరు రాష్ట్రాల మంత్రులు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటారని భావించినా కుదరడం లేదు. ఇటీవల ఇంటర్‌బోర్డులో మంత్రుల సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల కారణంగా  జగదీశ్‌రెడ్డి హాజరుకాలేకపోయారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు విదేశ పర్యటనకు వెళ్లడంతో పరీక్షల సమస్య అలాగే ఉండిపోయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోతున్నారు. పరీక్షల విషయంగా ఏదో ఒకటి త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ముందుకు సాగని పనులు..
ఇంటర్ పరీక్షలకు ప్రశ్నపత్రాల రూపకల్పన, పేపర్ సరఫరాకు టెండర్లు పిలవడం తప్ప మరే పనులు మొదలుకాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పేపర్ సరఫరా కోసం టెండర్లు పిలిచినా.. ప్రభుత్వాల నుంచి స్పష్టత రాకపోవడంతో వాటిని ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది.

* ప్రశ్నపత్రాల రూపకల్పనలో భాగంగా ఒక్కో సబ్జెక్టులో 12 సెట్ల పేపర్లు తయారు చేయించా ల్సి ఉంది. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే సరిపోయేలా 18 సెట్ల చొప్పున ప్రశ్నపత్రాలను రూపొందించారు.
 
* ఈ ప్రశ్నపత్రాల ముద్రణ పనులను ఇరు రాష్ట్రాలకు కలిపి ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై స్పష్టత లేదు. దీనిపై ఇరు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. 19 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 1.20 కోట్ల జవాబు పత్రాలకు సంబంధించిన పేపరు కొనుగోలు, బుక్‌లెట్ల ముద్రణకు టెండర్లను కూడా పిలవలేదు.

ఫీజు చెల్లించిన విద్యార్థుల సమాచారం (డాటా) ప్రాసెసింగ్‌కు టెండర్లు పిలవలేదు. వాటిని బట్టే ఏ కోర్సులో ఎంత మంది చదువుతున్నారు. ఏ సబ్జెక్టులో, ఏ మీడియంలో ఎన్ని ప్రశ్నపత్రాలు, ఎన్ని జవాబు పత్రాలు ముద్రిం చాలనేది వెల్లడవుతుంది.
తమ పరిధిలోకి తెచ్చుకుంటుందా?

* వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు కట్టుబడిన తెలంగాణ ప్రభుత్వం.. తొలుత వేరుగా ఇంటర్ బోర్డు ఏర్పాటుకు ఫైలు సిద్ధం చేసింది. ఆ యాక్టును అడాప్ట్ చేసుకున్నా... ఆ తరువాత బోర్డు ఏర్పాటును పక్కనపెట్టింది. ప్రస్తుతం ఉన్న బోర్డుపై అధికారం తమదేనని, కోరితే ఏపీలోనూ తామే పరీక్షలను నిర్వహిస్తామని తెలంగాణ చెబుతోంది. కానీ ఇంతవరకు బోర్డును తమ పరిధిలోకి తెచ్చుకోలేదు. ఏపీ నేతృత్వం లోనే ఇంటర్ బోర్డు కొనసాగుతోంది. అయితే బోర్డును తెలంగాణ తమ పరిధిలోకి తెచ్చుకొని పరీక్షలు నిర్వహిస్తుందా? లేదా? అన్నదీ తేలలేదు.

ఏ పేరిట సర్టిఫికెట్లు..?
ఉమ్మడిగా పరీక్షలను నిర్వహిస్తే సర్టిఫికెట్లను ఏ బోర్డు పేరుతో ఇస్తారన్న అంశంపైనా స్పష్టత లేదు. ప్రస్తుత ఇంటర్‌బోర్డుకు బోర్డు ఇంటర్మీడియట్ ఏపీ అని ఉంటుంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఏపీ బోర్డు పేరుతో సర్టిఫికెట్లను ఇస్తారా? ఒక వేళ బోర్డును తెలంగాణ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఏపీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ఆఫ్ తెలంగాణ పేరుతో సర్టిఫికెట్లు ఇస్తారా? లేక ఏపీ పేరుతో ఇస్తారా? ఒక రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లకు మరో రాష్ట్రం బోర్డుతో పేరుతో ఉంటే అంగీకరిస్తారా? అనే అంశాలను తేల్చాల్సి ఉంది. పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తే జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా స్వ రాష్ట్రం మీద అభిమానంతో ఎక్కువ మార్కు లు వేసుకోవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి.

విద్యార్థులకు నష్టం: ఏపీ
ఉన్నత విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలని పునర్విభజన చట్టంలోనే స్పష్టం చేశారు. అందుకే ఇంటర్ పరీక్షలు కూడా ఉమ్మడిగానే జరగాలి. వేర్వేరు పరీక్షల వల్ల కామ న్ మెరిట్‌ను నిర్ధారించడం కుదరదు. వేరుగా పరీక్షలు నిర్వహిస్తే ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది.

నష్టం జరగదు: తెలంగాణ
విభజన చట్టం స్ఫూర్తిని కచ్చితంగా పాటిస్తాం. చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 15 శాతం ఓపెన్ కోటాను అమలుచేస్తాం. అందులో మెరిట్‌లో ఉన్న ఏపీ విద్యార్థులకు సీట్లను ఇస్తాం. కామన్ మెరిట్ తీసేందుకు పర్సంటైల్, నార్మలైజేషన్ విధానం అమలు చేయవచ్చు. జేఈఈ మెయిన్ వంటి పరీక్షల్లో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ విధానాన్ని సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టింది. లేదంటే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించి, ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించవచ్చు. ఈ విధానాలతో వేర్వేరుగా ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులకు గానీ, ఏపీ విద్యార్థులకు గానీ నష్టం ఉండదు.

తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఇంటర్ పరీక్షలకు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ఇతర పరీక్షలతో సంబంధం ఉంటుం ది. ఇవీ మార్చిలో పూర్తికావాలి. అందుకే నాలుగు నెలల ముందు నుంచే పనులు చేపట్టాలి. కానీ ఇరు రాష్ట్రాలు ఎవరి భేషజాలతో అవి ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చట్టం ప్రకారం ఇంటర్ బోర్డు తెలంగాణకే రావాలి. కానీ బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఈ గొడవల ప్రభావం పరీక్షలపై పడే అవకాశముంది. అందువల్ల దీనిపై త్వరగా తేల్చాలి.
- చుక్కా రామయ్య, విద్యావేత్త

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement