* సొంతంగా నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా టైమ్‌టేబుళ్లు, ప్రశ్నపత్రాలు
* ఏపీలో మార్చి 11 నుంచి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను సొంతంగానే నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ సర్కారు తిరస్కరించింది. రాష్ట్రంలో ఈ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 9 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు టైమ్‌టేబుల్ ప్రకటించింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆమోదం తీసుకున్న వెంటనే బోర్డు అధికారులు ఈ టైమ్‌టేబుల్‌ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు ప్రటించిన మరుసటి రోజే తెలంగాణలో వేరుగా పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ జారీచేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు నిర్వహిస్తామని, వేర్వేరు ప్రశ్నాపత్రాలతోనే ఈసారి పరీక్షలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను కూడా వేరుగానే చేయమని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి గత నెలలోనే ఆదేశించారు.
అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు టైంటేబుల్‌తో కూడిన ప్రతిపాదనలను బోర్డు రెండు రోజుల క్రితం పంపించింది. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శికి వెళ్లిన ఆ ఫైలు మళ్లీ తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ అది తెలంగాణ అధికారులకు రాకముందే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం నుంచి ఆమోదం లభించక ముందే.. ఏపీ విద్యాశాఖ మంత్రి తాము మార్చి 11 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం రాత్రే చర్చించారు.
తెలంగాణలో వేరుగానే పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణకు వేరుగా టైంటేబుల్ రూపొందించి తీసుకురావాలని శుక్రవారం ఉదయమే ఇంటర్ బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు మార్చి 9 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించి తీసుకురావడంతో ఆమోదముద్ర వేశారు. వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు ఆ టైంటేబుల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ టైంటేబుల్‌ను ప్రకటించారు.
మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు
Published Sat, Nov 15 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement