ఇంకా ఉద్యమ నాయకుడిగానే కేసీఆర్...: గంటా
విశాఖ : విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని...అవసరం అయితే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని గంటా అన్నారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహిద్దామని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారం కాకుంటే గవర్నర్ దృష్టికి తీసుకు వెళతామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా ఉద్యమ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎంసెట్ విషయంలోనూ మొండిగా వ్యవహించారని ఆయన అన్నారు. పొలిటికల్ గేమ్తో విద్యార్థులు నష్టపోకూడదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించాలని గంటా విజ్ఞప్తి చేశారు. మార్చి 9 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు కూడా తాము సిద్ధమేనని ఆయన తెలిపారు. కాగా ఇంటర్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మార్చి 9 నుంచి పరీక్షలకు నిర్వహించనున్నట్లు ...ఆమేరకు టైంటేబుల్ను విడుదల చేసింది.