ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు | Intermediate Exams begin in andhra pradesh,telangana states | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Published Wed, Mar 2 2016 9:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

Intermediate Exams begin in andhra pradesh,telangana states

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో సెట్ నెంబర్-3, తెలంగాణలో సెట్-సీ ప్రశ్నాపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీలో 1,363, తెలంగాణలో 1,257 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంటర్ పరీక్షలకు విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 117 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘాతో పాటు, 35 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  ఇవాళ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కాగా, గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు మొదలు కానున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే పరీక్ష  ప్రారంభమవుతుంది. ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిబంధనను అమలు చేసింది. విద్యార్థులను నిర్ధేశిత సమయం కన్నా పావుగంట(8.45గంటలకే) ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతించారు.

విద్యార్థులకు సూచనలు

*పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు ఇచ్చిన ఓఎంఆర్ బార్‌కోడ్‌లో పేరు, హాల్‌టికెట్ నంబర్, మీడియం వివరాలను విద్యార్థులు సరిచూసుకోవాలి.

*జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. వేరు అడిషనల్ షీట్స్ ఇవ్వరు. కొత్త సిలబస్, పాత సిలబస్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా న్యూ సిలబస్ ప్రశ్నపత్రంతోనే రాయాలి.

*దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇంటర్ పరీక్షల నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

*పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఉంటాయి.

*చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, అనుమతి పొందిన వారు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలి. అదీ ప్రశ్నపత్రాల చేరవేత కోసమే. వారి ఫోన్లపైనా హైటెక్ నిఘా ఉంటుంది. జీపీఎస్ సహాయంతో వారి ఫోన్ నుంచి ఇతరులకు ఫోన్ వెళ్లినా, మెసేజ్ వెళ్లినా, ఇతరుల ఫోన్ల నుంచి వారి ఫోన్లకు  కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రికార్డు చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement