పరీక్షా కాలం
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు.
తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు.
కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే.
వాళ్ల ప్లానింగ్‌ని వినాలి
పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్‌లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు.
ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది.
బయటి తిండి వద్దు
పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి.
తోడు వెళ్లండి
పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి.
వారితో వాక్ చేయండి
పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది.
సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు.
Comments
Please login to add a commentAdd a comment