రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పరీక్ష కేంద్రానికి పరుగున వెళ్తున్న విద్యార్థి
నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ప్రకటించిన ఇంటర్ బోర్డు బుధారం ఆ నిబంధనకు కాస్త సడలింపునిచ్చింది.
-
‘నిమిషం’ నిబంధనకు ఇంటర్ బోర్డు సడలింపు..
-
9.05 వరకు పరీక్షహాల్‌లోకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ప్రకటించిన ఇంటర్ బోర్డు బుధారం ఆ నిబంధనకు కాస్త సడలింపునిచ్చింది. 5 నిమిషాలు వరకు ఆలస్యమైన విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత 15 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించడం వల్ల కొన్ని కళాశాలలు ప్రశ్న పత్రాలను తెలుసుకొని తమ విద్యార్థులకు జవాబులు చేరవేస్తున్నాయని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో.. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
అయితే పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే నిమిషం నిబంధనను బోర్డు కాస సడలించింది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు.. అంటే 9.05 గంటల వరకు ఆలస్యానికి గల కారణాన్ని నమోదు చేసి విద్యార్థులను లోనికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అన్ని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చింది. అరుుతే విద్యార్థులు 8.30కే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 9.05 గంటల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
6.75% గైరుహాజరు
బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 65,814 (6.75 శాతం) మంది గైరుహాజరయ్యారు. మొత్తం 9,75,102 (జనరల్ విద్యార్థులు 9,09,038+వొకేషనల్ విద్యార్థులు 66,064) మందికి హాల్‌టికెట్లు ఇవ్వగా అందులో మొదటిరోజు 65,814 మంది మాత్రమే పరీక్షలకు గైరుహాజరయ్యారు. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 8.30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్న విషయం విదితమే.
‘దాదాపు విద్యార్థులంతా ఉదయం 8.45 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.45 నుంచి 9.00 గంటల మధ్య 621 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభ సమయం 9 గంటలకు 9 మంది పరీక్షా కేంద్రాలకు వచ్చారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న 9 మందిని గుర్తించాం..’ అని అధికార వర్గాలు తెలిపాయి. పరీక్షా కేంద్రాల్లో జిరాక్స్ మిషన్లు వాడరాదని, పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష జరిగే సమయంలో రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారం తీసుకొని మూసి వేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.