నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమన్న ఇంటర్ బోర్డు
-
తొలిసారిగా ఈ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన అమలు
-
ఉదయం 8.30 గంటల కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన
-
నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1 పరీక్షతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
నిమిషం నిబంధన అమలు చేయడం ఈసారి ఇంటర్ పరీక్షల ప్రత్యేకత. ఎంసెట్ తరహాలో ఇంటర్ బోర్డు కూడా మొదటిసారిగా నిమిషం నిబంధనను అమల్లోకి తెచ్చింది. అంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థులను ఉదయం 8:30 గంటలనుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడొద్దని స్పష్టం చేసింది.
గతంలో పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించేవారు. ఈసారి అలా కుదరదు. అరగంట ముందుగానే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నందున ఆ వెసులుబాటును తొలగించినట్లు బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థుల్ని సాధారణంగా 8:45 గంటలవరకు పరీక్ష హాల్లోకి పంపుతారు. అయితే 8:45 గంటల నుంచి 9 గంటల వరకూ అనుమతిస్తారు. అయితే ఆలస్యానికి గల కారణాల్ని విద్యార్థులు రాతపూర్వకంగా తెలపాలి.
రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 19.78 లక్షలమంది హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పేర్లు, మీడియం, పరీక్ష రాసే సబ్జెక్టు వివరాలు, హాల్‌టికెట్‌లో ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యార్థులు సంతకాలు చేసేముందు ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్‌పైనా రిజిస్టర్ నంబరు, పేర్లు, సబ్జెక్టు వివరాలను చూసుకోవాలి. కొత్త సిలబస్, పాత సిలబస్ వివరాలను సరిచూసుకోవాలి. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రం లోకి సెల్‌ఫోన్లు తేరాదు. సెల్‌ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉన్న డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరిం టెండెంట్ల ఫోన్లపై ట్యాపింగ్ తరహా నిఘా ఉంటుంది.
పరీక్షలపై సీఎస్ సమీక్ష: ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం సెకండరీవిద్య ముఖ్య కార్యదర్శి(ఇన్‌చార్జి) పూనం మాల కొండయ్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్‌శంకర్ నాయక్‌లతో సమీక్షించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేం దుకవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.