నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ! | one Minute Delayed no Entry on intermediate exams | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ!

Published Tue, Mar 11 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు.

కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ :ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్ష ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రథమ సంవత్సరంలో 37,455 మంది, ద్వితీయ సంవత్సరంలో 33,125 మంది, ప్రైవేటు విద్యార్థులు 7,058 మంది కలిపి మొత్తం 77,638 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 110 కే ంద్రాల్లో పరీక్షలు కొనసాగనున్నాయని, ఈ సారి కొత్తగా ఆలూరు, కోడుమూరు మోడల్ స్కూళ్లనూ కేంద్రాలుగా ఎంపిక చేశామని అన్నారు. 
 
 మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, ద్వితీయ సంవత్సరం సైన్స్ సబ్జెక్టులకు పాత, కొత్త సిలబస్‌లలో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. పరీక్షల పర్యవేక్షణకు నాలుగు ఫ్లైయింగ్‌స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, రవాణా సౌకర్యం కల్పించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖలకు విన్నవించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని చెప్పారు. పాత, కొత్త పేపర్లు ఇచ్చే విషయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత విద్యార్థులందరినీ ఒక రూంలో ఉంచి పరీక్ష రాయించాలని సూచించారు.
 
 ఫీజు పెండింగ్ ఉన్నా హాల్‌టికెట్ ఇవ్వాల్సిందే...
 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఫీజు పెండింగ్‌లో ఉన్నా హాల్‌టికెట్ ఇవ్వాలని ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. ముందుగా హాల్‌టికెట్ ఇచ్చేసి మార్క్‌లిస్ట్ ఇచ్చే సమయంలో ఫీజు వసూలు చేసుకోవాలన్నారు. హాజరుశాతం తక్కువగా ఉండే వారికి అపరాద రుసుము కట్టించుకుని హాల్‌టికెట్ ఇవ్వాలని సూచించారు. 70 నుంచి 75 శాతానికి రూ.200లు, 65 నుంచి 70 శాతానికి రూ.250లు, 60 నుంచి 65 శాతానికి రూ.500లను డీడీ ద్వారా ఫీజు చెల్లించి, దానిని ప్రిన్సిపాల్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
 
 కాపీయింగ్‌ను అరికట్టేందుకు బోర్డు చర్యలు
 పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇంటర్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రాన్ని 8.45 గంటలకు తీస్తారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట నుంచి పరీక్ష నిర్వహణాధికారులు సెల్‌ఫోన్ ద్వారా పేపర్ లీక్ చేసేవారు. క్షణాల్లోనే కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆ ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులకు చెప్పేవి. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు చూసుకున్న విద్యార్థులు 9.15 గంటలకు పరీక్షా కేంద్రంలోకి వెళ్లేవారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటర్ మీడియట్ బోర్డు కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు ఈ యేడాది సరికొత్త ఎత్తుగడ వేసింది. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా విద్యార్థులను 8.30 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. 8.45 నుంచి 9 గంటల మధ్య వచ్చే విద్యార్థులను ఆలస్యంగా వచ్చే వారిగా గురించి పేర్లు నమోదు చేస్తారు. ఆ వివరాలను ఇంటర్ మీడియట్ బోర్డుకు అదే రోజు పంపిస్తారు. దీంతో పాటు ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ ఉపయోగించరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ మాత్రమే సెల్‌ఫోన్ వాడేందుకు అనుమతించారు. అది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్ కాకుండా సాధారణ మొబైల్ ఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మొబైల్ ఫోన్ ద్వారా బయటి వారికి సమాచారం చేరవేసినా క్షణాల్లో జియో పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా ఇంటర్ మీడియట్ బోర్డు అధికారులకు తెలిసిపోతుంది. ఏ ఫోన్ నెంబర్ నుంచి ఏ ఫోన్ నెంబర్‌కు ఏ సమాచారం పంపించారో సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం రేపటి నుంచి  ప్రారంభమయ్యే ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షల నుంచి అమలు కానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement