అయ్యయ్యో... టైమైపోయింది..
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సమయం ముంచుకురావడంతో కొందరు విద్యార్థులు ఇలా పరుగున కేంద్రాలకు చేరారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం తొలి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తక పోవడంతో పరీక్షలు సజావుగా సాగాయి. విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 49,955 మంది హాజరయ్యారు.
జనరల్ గ్రూప్‌లో 46,263 మంది విద్యార్థులకు 44,174 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్ గ్రూప్ లో 3,692 మంది విద్యార్థులకు 3,159 మంది పరీక్షలకు హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆర్‌ఐవో ఎల్.జె.జయశ్రీ తెలిపారు.