first year students
-
ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తేలికగానే ఉంటాయని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్ పూర్తవ్వని పరిస్థితులను ప్రశ్నాపత్రం రూపకల్పనలో కీలకాంశాలుగా తీసుకున్నట్టు చెబుతున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుందంటున్నారు. విద్యార్థులను తికమకపెట్టే డొంక తిరుగుడు ప్రశ్నలను సాధ్యమైనంత వరకూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొద్దిపాటి శ్రద్ధ తీసుకునే విద్యార్థి కూడా గట్టెక్కే రీతిలో పరీక్షలు ఉండబోతున్నాయనే భరోసాను అధికారులు కలి్పస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఫస్టియర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనుమతించిన విషయం తెలిసిందే. మునుపటికన్నా భిన్నంగా, రాయాల్సిన వాటికన్నా ప్రశ్నలు ఎక్కువ ఇవ్వనున్నారు. దీనివల్ల ఏదో ఒక ప్రశ్నకు విద్యార్థి సిద్ధమై ఉంటాడని, సులభంగా జవాబు రాసే వీలుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ప్రశ్నల తీరు ఇలా.... ►సబ్జెక్టుల్లో సగానికి సగం చాయిస్ ఇస్తున్నారు. ముఖ్యంగా గణితంలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు సాధ్యమైనంత వరకూ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. గణితంలో మూడు సెక్షన్లుంటాయి. ‘ఎ’సెక్షన్లో 2 మార్కులు, ‘బి’లో 4, ‘సీ’లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. ఏ సెక్షన్‌లోని 10 ప్రశ్నల కూ సమాధానం ఇవ్వాలి. ‘బీ’లో 10 ప్రశ్నలకుగాను 5, ‘సీ’లో 10 ప్రశ్నలకుగాను ఐదింటికి రాయాలి. ►భౌతికశాస్త్రంలో ఏ సెక్షన్లో 2, బీ సెక్షన్లో 4, సీ సెక్ష న్లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్ ఏలో ఉన్న మొ త్తం పది ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, ‘సీ’ లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలివ్వాలి. ►రసాయనశాస్త్రంలో సెక్షన్ ఏలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్ బీలో 4, సెక్షన్ సీలో 8 మార్కుల ప్రశ్నలివ్వనున్నారు. ‘ఏ’లో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకుగాను 6, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలు రాయాలి. ►బోటనీ సెక్షన్–ఏలో 2 మార్కులు, సెక్షన్–బీలో 4 మార్కులు, సెక్షన్–సీలో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్–ఏలో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకు గాను ఆరింటికి, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి జవాబులు రాయాలి. ►అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో సెక్షన్–ఏలో 10, సెక్షన్–బీలో 5, సెక్షన్–సీలో 2 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్లో 6 ప్రశ్నలకుగాను 3, ‘బీ’లో 16 ప్రశ్నలకుగాను ఎనిమిదింటికి, ‘సీ’లో 30 ప్రశ్నలకుగాను 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వాళ్ల సంగతేంటి? ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గతంలో ఫీజు కట్టిన వాళ్లకే అవకాశం ఇస్తున్నారు. అయితే, అప్పట్లో 10 వేల మంది ఫీజులు చెల్లించలేదు. ఈ సమయంలో పరీక్షలు లేకుండా అందరినీ రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజు కట్టని వాళ్లకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. వీళ్లంతా ద్వితీయ సంవత్సరం కొనసాగిస్తూ ఆ ఏడాదితో పాటే, ఫస్టియర్ పరీక్షలూ రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
అయ్యయ్యో... టైమైపోయింది..
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సమయం ముంచుకురావడంతో కొందరు విద్యార్థులు ఇలా పరుగున కేంద్రాలకు చేరారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం తొలి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తక పోవడంతో పరీక్షలు సజావుగా సాగాయి. విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 49,955 మంది హాజరయ్యారు. జనరల్ గ్రూప్‌లో 46,263 మంది విద్యార్థులకు 44,174 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్ గ్రూప్ లో 3,692 మంది విద్యార్థులకు 3,159 మంది పరీక్షలకు హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆర్ఐవో ఎల్.జె.జయశ్రీ తెలిపారు. -
విజయోస్తు..!
వైవీయూ, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 21,597 మంది పరీక్షలు రాస్తుండగా 869 మంది ఒకేషనల్ విభాగంలో పరీక్షలు రాయనున్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 19,643 మంది జనరల్ విభాగంలోను, 784 మంది వృత్తివిద్యావిభాగంలో పరీక్షలకు హాజరుకానున్నారు. 23 ప్రభుత్వ కళాశాలలు, 4 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 17 ఎయిడెడ్, 44 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో మొత్తంగా 88 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అందుబాటులో మంచినీరు, ఓహెచ్ ప్యాకెట్లతో పాటు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే మొత్తం మీద 19 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టనున్నారు. అయితే విద్యార్థులను 8.30 నిమిషాలకే పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని, 8.45 తర్వాత విద్యార్థి వివరాలు, ఆలస్యానికి గల కారణాలు నమోదు చేసుకుని అనుమతిస్తామని, 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు పేర్కొంటున్నారు. 5 ఫ్లైయింగ్ స్క్వాడ్, 10 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఈసీ సభ్యుల బృందాలు పరీక్షలను తనిఖీ చేయనున్నాయి. వీటితో పాటు పరీక్ష కేంద్రం వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయడంతో పాటు 144 సెక్షన్‌ను అమలుచేయనున్నారు. ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. నలుగురికి మించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు పరీక్ష నిర్వహించే సమయంలో మూసివేయాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.