11 నుండి ఇంటర్‌ వాల్యుయేషన్ | Intermediate Exam Evaluation Process Beginning From 11th May | Sakshi
Sakshi News home page

11 నుండి ఇంటర్‌ మూల్యాంకనం

Published Thu, May 7 2020 4:23 PM | Last Updated on Thu, May 7 2020 6:14 PM

Intermediate Exam Evaluation Process Beginning From 11th May - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 11 నుండి  రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నాల్గవ బ్లాక్ మొదటి అంతస్థులోని మంత్రి తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిన్ వి. రమేష్ లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. (సీబీఎస్‌ఈ సిలబస్‌ కుదింపు!)

లాక్ డౌన్ అనంతరం రెడ్ జోన్‌ జిల్లాల్లో..
ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను  పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్,ఎడ్ సెట్, లా సెట్, పీఈసెట్ తదితర పోటీపరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావడంతో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు.

మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా ఉండాలి..
రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తంగా 10,64,442 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరయినట్లు పేర్కొన్నారు. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తించిన రెండు, మూడు భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.  

మార్గదర్శకాలు పాటించాలి..
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సంబంధింత అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసానిచ్చారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. మూల్యాంకన ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్ లో సుమారు 15వేల మందితో ఈ మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్ జోన్ లో 8 నుండి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. 

వారికి మినహాయింపు ఇవ్వాలి..
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారామ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్‌ కార్యదర్శి వి.రవి 55 ఏళ్లకు పైబడిన వారికి మూల్యాంకన ప్రక్రియలో మినహాయింపు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ నిబంధనల ప్రకారమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని తెలిపారు. దీనికి జోన్-4 కడప జిల్లా ఆర్జేడీ కె.చంద్రశేఖర్ ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement