ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బుధ వారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 52 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా.. వాటిలో 27 ప్రైవేటు, 25 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,679 మంది పరీక్షలు రాయనున్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 14,532, ఒకేషనల్‌లో 2,077 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 16,136, ఒకేషనల్ విభాగంలో 1,934 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నడుమ ప్రశ్నపత్రం బండిళ్లను తెరవనున్నారు.
పరీక్షల హైపవర్ కమిటీ కన్వీనర్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ వ్యవహరించగా.. సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబుతోపాటు సీనియర్ ప్రిన్సిపాల్ ఒకరు ఉండనున్నారు. అలాగే డీఈసీ కమిటీలో ముగ్గురు అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు బృందాలు ఉండగా.. వీటిలో జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్‌ఐ స్థాయి అధికారులు ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయానికి గంట ముందు, తర్వాత మూసివేయాల్సి ఉంటుంది.
నిమిషం నిబంధన అమలు
పరీక్షకు గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 9 నుంచి పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా.. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయండి
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. విద్యార్థులు పరీక్ష సమయానికంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం నిబంధన అమలులో ఉంటుంది. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment