♦ పరస్పర అవగాహనతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కాలేజీలు
♦ సూర్యాపేటలో గణితం పేపర్ లీకయిందంటూ ప్రచారం... అదేం లేదన్న బోర్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పరస్పర అవగాహనతో ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం ఈ తరహా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు పరీక్షల విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లే పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే బుధవారం గణితం పేపర్-2ఏ పరీక్ష సందర్భంగా సూర్యాపేటలో పేపర్ లీకజీ గందరగోళం చోటుచేసుకుందని చెబుతున్నారు. బుధవారం సూర్యాపేటలో గణితం పేపర్ లీక్ అయిందం టూ ప్రచారం జరిగింది. పలు టీవీ చానెళ్లు స్క్రోలింగ్‌లు కూడా వేశాయి. అయితే ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రీజ నల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ విచారణ జరిపినట్లు... అక్కడ ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని తేల్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఆ వదంతులు మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ఇంటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ లీకేజీ ప్రచారాన్ని ఖండించింది. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కుట్రలో భాగంగానే దీన్ని పరిగణించాలని పేర్కొంది. కానీ సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయని జూనియర్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళిక, కాలేజీల మధ్య ఒప్పందాల మేరకు పరీక్ష ప్రారంభమయ్యాక సెల్‌ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేస్తున్నారని... జవాబులను తిరిగి సెల్‌ఫోన్ ద్వారానే పరీక్ష కేంద్రాల్లోకి చేరవేస్తున్నారని పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే సూర్యాపేటలో బుధవారం పరీక్ష సందర్భంగా గందరగోళం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టాలని తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇంటర్ పరీక్షలకు 94.38 శాతం హాజరు
బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 94.38 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ మొత్తం 57 మంది విద్యార్థులు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు.