కోతలు ప్రారంభం
► జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతతో జనం అవస్థలు
► పరీక్షల కాలం కావడంతో విద్యార్థుల ఆందోళన
► కోతలేమీ లేవంటున్నఅధికారులు
నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని పాలకులు చెబుతున్న మాటలు కోతలని తేలిపోయింది. వేసవి ప్రారంభంలోనే విధిస్తున్న అప్రకటిత కోతలు జనానికి విసుగు తెప్పిస్తున్నాయి. పరీక్షల సీజన్ కావడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు తరచూ కరెంటు పోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందో నని ప్రజలు భయపడుతున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం అదేమీ లేదని చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అరసవల్లి: కోతల కాలం వచ్చేసింది. వేసవికాలం తొలి రోజుల నుంచే విద్యుత్ కోతలు తప్పడం లేదు. కావాల్సిన విద్యుత్ సర్‌ప్లస్‌లో ఉందని. ఎక్కడా కోతలంటూ లేవని ఓ వైపు విద్యుత్ శాఖాధికారులు చెప్తుంటే....మరోవైపు గత రెండ్రోజులుగా తరచూ విధిస్తున్న కోతలతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. జిల్లాలో విద్యుత్ విని యోగదారులు సుమారు 18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి సరిపడా విద్యుత్ సరఫరా ఉందని, కోతలు విధించే అవకాశాలే లేవంటూ విద్యుత్ శాఖాధికారులు చెబుతుండగా.. తాజా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
అప్రకటిత కోత: జిల్లాలోని పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా గంటల తరబడి నిలిచిపోయింది. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నాలుగు గంటలకు పైగానే అప్రకటిత కోతలు విధిస్తున్నారు. కొన్ని గ్రామాకు రాత్రి వేళల్లో కూడా సరఫరా నిలిపి వేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో అప్రకటిత కోతలు విధించడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, మరికొద్ది రోజుల్లో డిగ్రీ, పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. వేసవి మొదట్లోనే ఇలా కోతలుంటే..రానురాను ఇంకా ఏమేరకు కోతలుంటాయో అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన ఎంఎల్‌సీ ఎన్నికల సమయంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో చీకట్లోనే బ్యాలెట్‌బాక్సులకు సిబ్బంది సీళ్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్రకటిత కోతతో చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలతో పాటు, వెల్డింగ్, మిల్లులు, జిరాక్స్, నెట్ సెంటర్లు, ఐస్‌క్రీం పార్లర్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క నగదు లేక జనం అవస్థలు పడుతుంటే.. అరకొరగా పని చేస్తున్న ఏటీఎంలు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పనిచేయకుండా పోతున్నాయి.
రోజుకు 40 లక్షల యూనిట్లు వినియోగం: జిల్లాకు 220 కేవీ టెక్కలి, గరివిడి ఉపకేంద్రాలతో పాటు 132/33 కేవీ చిలకపాలెం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, పైడిభీమవరం, పాతపట్నం తదితర తొమ్మిది విద్యుత్ ఉపకేంద్రాల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో ఉన్న మొత్తం గృహ, గృహేతర వినియోగదారులకు రోజుకు 40 లక్షల యూనిట్లు అవసరం. అయితే వేసవి కాలంలో కావాల్సిన డిమాండ్‌కు తగిన సరఫరా ఉండదనేది ఈ కోతలతో స్పష్టమవుతోంది. విద్యుత్ కోతలు ఉండవని.. 24 గంటల సరఫరా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అవన్నీ కోత లేనని తేలిపోయింది. ఇదిలావుంటే కేవలం మరమ్మతుల కారణంగానే విద్యుత్ కోతలు విధిస్తున్నామంటూ సంబంధిత అధికారులు కారణాలు చెబుతున్నారు.
లైన్ క్లియరెన్స్‌తోనే అంతరాయం: గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్న మాట వాస్తవమే. అయితే గాలులు వీయడంతో పలుచోట్ల లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ) తీసుకుని విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేపడుతున్నాం. అందుకే సరఫరా నిలిపివేశాం. ఎటువంటి కోతలు లేవు. సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం లైన్లకు తగిలే చెట్లు కొట్టడం వంటి పనులు చేపడుతున్నాం. విద్యుత్ సరఫరా జిల్లాలో సర్‌ప్లస్‌లో ఉంది. కోతలుండే అవకాశమే లేదు. ---డి.సత్యనారాయణ, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
ఇంటర్ పరీక్షలు రాస్తున్నాం. గంటల కొలది కరెంట్ ఉండటం లేదు. దీంతో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. --- కె.శ్రీనివాస్, అరసవల్లి
విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతుంది. దీంతో వెల్డింగ్ పనులు మధ్యలో ఆగిపోతున్నాయి. షెడ్లు వేయడానికి ఎత్తులో ఉండి పనిచేయాల్సి వస్తుంది. మద్యలో తరచుగా కరెంట్ వస్తూ, పోతూ ఉండడంతో పనులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. --ఆర్.దాలినాయుడు, వప్పంగి
అంధకారంలో వీరఘట్టం: వీరఘట్టం మండల ప్రజలు శనివారం రోజంతా విద్యుత్ కష్టాలను ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పలుమార్లు సరఫరా పోయినప్పటికీ సర్దుకుపోయారు. అయితే మండలానికి విద్యుత్‌ను సరఫరా చేసే వీరఘట్టంలోని సబ్‌స్టేషన్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగ తెగిపోవడంతో మండలం మొత్తం కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం రాత్రి పదిన్నర గంటల వరకూ కొలిక్కిరాలేదు. దీంతో పిల్లలు.. వృద్ధులు..చిన్నారులు..అవస్థలు ఎదుర్కొన్నారు. విక్రంపురం గ్రామానికి చెందిన చీపురుపల్లి అనూష అనే ఆరేళ్ల చిన్నారి ఉబ్బసం కారణంగా ఊపిరి తీసుకోవడానికి అవస్థలు పడింది. దీంతో తల్లిదండ్రులు వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. అయితే కరెంటు లేకపోవడంతో బ్రితింగ్‌మిషన్ పని చేయలేదు. దీంతో సబ్–స్టేషన్ కార్యాలయానికి మాత్రం కరెంటు ఉండడంతో బాలికను అక్కడకు తీసుకొని వెళ్లి కృత్రిమశ్వాసను అందించడంతో ప్రమాదం నుంచి బయటపడింది.