సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు ఆపాలన్న పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈనెల 25 నుంచి పరీక్షలు ఉండగా చివరి నిమిషంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఫస్టియర్ పరీక్షలు ఆపాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా విచారించింది. కరోనా నేపథ్యంలో ద్వితీయ సంవత్సరానికి ఐదు నెలల క్రితం ప్రమోట్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న దాదాపు 4.58 లక్షల మంది విద్యార్థులకు 25వ తేదీ నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు.
సెకండియర్ చదువుతున్న విద్యార్థులు మళ్లీ ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం చదవాలంటే గందరగోళానికి, తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ అయినట్లుగా ప్రకటించిన తరహాలోనే పాస్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఇంటర్ బోర్డు తరఫున డీఎల్ పాండు వాదనలు వినిపించారు. ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసే సమయంలోనే పరిస్థితులకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే పేర్కొన్నామన్నారు. పదవ తరగతి పరీక్షలు కూడా ఈ విద్యార్థులు రాయలేదని, కరోనా నేపథ్యంలో వీరిని పాస్ చేశారని తెలిపారు.
ఇప్పుడు ప్రథమ సంవత్సరం పరీక్షలు కూడా రాయకపోతే భవిçష్యత్తులో ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వస్తే వీరి ప్రతిభను అంచనా వేయడం ఇబ్బందికరంగా మారుతుందని నివేదించారు. ఆ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణకు రెండు రోజుల ముందు పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిమేరకు ధర్మాసనం అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment