రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published Tue, Mar 11 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 96,239 మంది పరీక్షలు రాయనున్నారు. వివరాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కేపీ దాశరథి విలేకరుల సమావేశంలో సోమవారం తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 40 వేల 722 మంది, వృత్తి విద్యా కోర్సుల్లో 6 వేల 146 మంది, మొత్తం 46 వేల 868 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో 42 వేల 424 మంది, వృత్తి విద్యా కోర్సుల్లో 6 వేల 947 మంది, మొత్తం 49 వేల 371 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సమస్యాత్మకంగా 23 పరీక్షా కేంద్రాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 126 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పది సిట్టింగ్ స్క్వాడ్స్, ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, హైపర్ కమిటీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ఆలస్యంగా వచ్చిన వారి వివరాల నమోదు
పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 నుంచి 8.45 గంటల లోపు రావాలి. తొమ్మిది గంటల వరకు వచ్చిన విద్యార్థులను ఆలస్యంగా వచ్చిన వారిగా పరిగణిస్తారు. ఈ విధం గా వచ్చిన వారి వివరాలు నమోదు చేసేందుకు కేంద్రాల వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. విద్యార్థులు ఆలస్యంగా రావడానికి కారణాలను విశ్లేషిస్తారు. హాల్ టికెట్‌లో తప్పు ఒప్పులు, లాంగ్వేజ్ సమస్యలు వంటివి గతంలో హైదరాబాద్ ఇంటర్ బోర్డు వారే సరిచేసేవారు. ఈసారి ఆ అనుమతి ఆర్‌ఐవోలకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటువంటి మార్పులేమైనా ఉంటే నేరుగా ఆర్‌ఐవో కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకునే అవకాశం కల్పించారు.
జీపీఎస్ నిఘా
పరీక్ష పత్రాలు లీకేజీ కాకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జీపీఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సమీపంలోని సెల్ టవర్‌కు పరీక్ష కేంద్రాల ప్రాంతాన్ని అనుసంధానం చేశారు. విద్యార్థులు రహస్య కెమెరాలతో సైబర్ నేరాలకు పాల్పడుతుంటే జీపీఎస్‌తో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ ద్వారా ఆ వివరాలు వెంటనే అధికారులకు చేరుతాయి. దీంతో వారు అప్రమత్తమై సంబంధిత విద్యార్థిపై చర్యలు తీసుకుంటారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్‌టమెంట్ అధికారులకు సాధారణ సెల్‌ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. వీరు ఎటువంటి ఫీచర్లు ఉన్న సెల్‌ఫోన్లు వాడినా నేరంగా పరిగణిస్తారు. 17 రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
నడపనున్నారు.
Advertisement
Advertisement