Board of Intermediate Education Telangana
-
Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. విద్యార్థులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు. ఈ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 65.07గా నమోదైంది. అయితే, సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్స్ ఇవే జనరల్ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఒకేషనల్ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు..? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది. -
మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్ కేలండర్‌ను బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 220 పని దినాలుంటాయని, ఇందులో 47 పనిదినాల్లో ఆన్లైన్ బోధన జరిగిందని, మరో 173 పనిదినాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుందని తెలిపింది. -
జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. జూన్ నెలాఖరుకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిర్వ హించిన వర్చువల్ సమావేశంలో ప్రభుత్వం వెల్ల డించింది. అయితే జూన్ నెలాఖరుకు కరోనా అదు పులోకి వస్తుందో లేదోనన్న భావన అధికారుల్లో నెలకొంది. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్లు తెలిసింది. దీనిపై వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వం మాత్రం జూన్‌లో పరీక్షల నిర్వహణ వైపు మొగ్గు చూపుతుందా? జూలైలో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తుందా? అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. సగం ప్రశ్నలకే జవాబులు రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రశ్న పత్రాలను కూడా ముద్రించింది. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. తర్వాత వీలైనప్పుడు నిర్వహిస్తామని పేర్కొంది. ఇప్పుడు జూలైలో ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు ఇప్పటికే ముద్రించిన ప్రశ్న పత్రాలనే వినియోగించాలని భావిస్తోంది. అయితే కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రశ్న పత్రంలో ముద్రించిన ప్రశ్నల్లో అన్నింటికీ కాకుండా సగం చాయిస్ ఉండేలా చర్యలు చేపడుతోంది. అంటే విద్యార్థులు సమాధానాలు రాసిన సగం ప్రశ్నలకు వేసే మార్కులను రెట్టింపు చేసి తుది మార్కులు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకే కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆప్షన్‌గానే ఫస్టియర్ పరీక్షలు.. జూలైలో ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థుల పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున, జూలైలో నిర్వహించే పరీక్షలను విద్యార్థులకు ఆప్షన్‌గానే నిర్వహించే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ 45 శాతం కనీస మార్కులతో పాస్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మార్కులు తక్కువగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. పరీక్షలకు హాజరై మార్కులు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకోసమే ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ ► 9వ తేదీ పరీక్షలు 19వ తేదీకి మార్పు ► జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదిలాబాద్ అర్బన్ : మార్చి ఒకటి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్మ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. మార్చి 9న నిర్వహించే గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 19వ తేదీకి మార్చిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. విద్యార్థులు bietelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష కేంద్రం లోకేషన్ యాప్‌ను విడుదల చేసిందని, దీని ప్రకారం విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, కేంద్రం నంబర్ నమోదు చేస్తే యాప్ ద్వారా పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్, చేరే సమయం తెలుసుకునే వీలుందని అన్నారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 56,655 మంది విద్యార్థులకు గాను 90 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8.15 నుంచి 9గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అన్నారు. నూతన ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి 30 వరకు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 10,410 విద్యార్థులకు 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని, పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిరాక్స్ సెంటర్ల యజమానులను ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్ఓ బానోత్ శంకర్, డీఐవో నాగేందర్, డీఈవో లింగయ్య, డీఎస్పీ లక్షీ్మనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంగతాయరు తదితరులు పాల్గొన్నారు.