► రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్
► 9వ తేదీ పరీక్షలు 19వ తేదీకి మార్పు
► జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఆదిలాబాద్ అర్బన్ : మార్చి ఒకటి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్మ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. మార్చి 9న నిర్వహించే గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 19వ తేదీకి మార్చిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు.
విద్యార్థులు bietelangana.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష కేంద్రం లోకేషన్ యాప్‌ను విడుదల చేసిందని, దీని ప్రకారం విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, కేంద్రం నంబర్ నమోదు చేస్తే యాప్ ద్వారా పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్, చేరే సమయం తెలుసుకునే వీలుందని అన్నారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 56,655 మంది విద్యార్థులకు గాను 90 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఉదయం 8.15 నుంచి 9గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అన్నారు. నూతన ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి 30 వరకు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 10,410 విద్యార్థులకు 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని, పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిరాక్స్ సెంటర్ల యజమానులను ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్‌ఓ బానోత్ శంకర్, డీఐవో నాగేందర్, డీఈవో లింగయ్య, డీఎస్పీ లక్షీ్మనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంగతాయరు తదితరులు పాల్గొన్నారు.