జిల్లాలో హై అలర్ట్
– కర్నూలు ఆర్టీసీ బస్టాండులో రాత్రి 10 గంటలకు ఎస్పీ తనిఖీ
కర్నూలు(కొండారెడ్డిఫోర్ట్): భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్లలో బందోబస్తును పెంచారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండులో తనిఖీలు నిర్వహించారు.
బాంబ్స్కా్వడ్ జాగిలాలతో హోటళ్లు, లాడ్జీలు, ప్రయాణికుల బ్యాగులు, క్లాక్‌రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసులను చూసి మరో వ్యక్తి తన బ్యాగులను వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ రిపబ్లిక్‌డేను ప్రశాంతంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా అనుమానితులు కనిపించినా, వాహనాలను వదిలి వెళ్లినా 100కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని.. ప్రజలు సహకరించాలని కోరారు. తనిఖీల్లో డీఎస్పీ రమణమూర్తి పాల్గొన్నారు.