
చిత్తూరు, చంద్రగిరి: ఆయన అధికార పార్టీ ఎంపీ. చంద్రగిరి మండలంలో పోలీసులు ఆయన కారుకు పైలెట్ నిర్వహించలేదు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన ఎంపీ పోలీసు స్టేషన్ వద్ద ఆపి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం చిత్తూరులో గణతంత్ర దినోత్సవంలో పాల్గొని తిరుపతికి పయనమయ్యారు. తన స్వగ్రామమైన చంద్రగిరి మండలం పులిత్తి వారిపల్లిని సందర్శించి, అక్కడి నుంచి తిరుపతికి బయలు దేరారు. చంద్రగిరి మండలంలో పర్యటిస్తున్నా అయనకు పోలీసులు పైలెట్ నిర్వహించలేదు.
చంద్రగిరిలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తిన్నగా చంద్రగిరి పోలీసుస్టేషన్‌కు చేరుకుని, నడిరోడ్డుపై తన వాహనాన్ని ఆపి నిరసన వ్యక్తం చేశారు. గంటపాటు నిరసన వ్యక్తం చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏఎస్‌ఐ దేవదత్తారెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఎంపీకి రక్షణ కల్పించలేని పోలీసులు ఇక ప్రజల గురించి ఏమి పట్టించుకుంటారని మండిపడ్డారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. అనంతరం పోలీసులు రాచమర్యాదలతో ఆయన్ను మండల శివారు వరకు సాగనంపారు.