Shiva Prasad Naramalli
-
టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత
సాక్షి, చెన్నై : టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు. శివప్రసాద్ మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చంద్రబాబు నిన్న సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా శివప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక 2006లో ‘డేంజర్’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో విచిత్ర వేషధారణతో శివప్రసాద్ తన నిరసన తెలిపేవారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం శివప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎంపీ గన్‌మెన్ భార్య ఆత్మహత్య
సాక్షి, మదనపల్లె: చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ గన్‌మెన్ వెంకటరమణ భార్య సరస్వతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బాలాజీనగర్‌లోని ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా వెంకటరమణ తన భార్య సరస్వతిని సర్వీస్ గన్‌తో చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. ఆత్మహత్య విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులపై చిత్తూరు ఎంపీ ఆగ్రహం
చిత్తూరు, చంద్రగిరి: ఆయన అధికార పార్టీ ఎంపీ. చంద్రగిరి మండలంలో పోలీసులు ఆయన కారుకు పైలెట్ నిర్వహించలేదు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన ఎంపీ పోలీసు స్టేషన్ వద్ద ఆపి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం చిత్తూరులో గణతంత్ర దినోత్సవంలో పాల్గొని తిరుపతికి పయనమయ్యారు. తన స్వగ్రామమైన చంద్రగిరి మండలం పులిత్తి వారిపల్లిని సందర్శించి, అక్కడి నుంచి తిరుపతికి బయలు దేరారు. చంద్రగిరి మండలంలో పర్యటిస్తున్నా అయనకు పోలీసులు పైలెట్ నిర్వహించలేదు. చంద్రగిరిలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తిన్నగా చంద్రగిరి పోలీసుస్టేషన్‌కు చేరుకుని, నడిరోడ్డుపై తన వాహనాన్ని ఆపి నిరసన వ్యక్తం చేశారు. గంటపాటు నిరసన వ్యక్తం చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏఎస్ఐ దేవదత్తారెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఎంపీకి రక్షణ కల్పించలేని పోలీసులు ఇక ప్రజల గురించి ఏమి పట్టించుకుంటారని మండిపడ్డారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. అనంతరం పోలీసులు రాచమర్యాదలతో ఆయన్ను మండల శివారు వరకు సాగనంపారు. -
బొజ్జల, ఎంపీ శివప్రసాద్ గైర్హాజరు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్ గైర్హాజరు అయ్యారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జల అలకబూనగా, తమను పట్టించుకోవడం లేదంటూ ఎంపీ శివప్రసాద్ బాహాటంగానే ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెర మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో భగ్గుమన్న విషయం తెలిసిందే. అయితే బుజ్జగింపుల పర్వంలో బొజ్జల మాత్రం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. -
‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’
-
పధకం ప్రకారమే ఎంపీపై దాడిచేయిస్తున్నారు
-
నేనేం తప్పు మాట్లాడాను?
-
శివప్రసాద్‌పై చర్యలు తప్పవు
-
శివప్రసాద్‌పై చర్యలు తప్పవు
చిత్తూరు ఎంపీపై బాబు ఆగ్రహం సాక్షి, అమరావతి: తాను దళితులను పట్టిం చుకోవట్లేదంటూ సొంత పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తీవ్ర విమర్శలు చేయడంతో కంగుతిన్న సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. శనివా రం ఉదయం మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యవహారంపై చర్చించి న సీఎం.. ఆ తర్వాత శివప్రసాద్ మరలా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో ముఖ్యనేతలతో మరోసారి చర్చించారు. ఉదయం మంత్రులతో టెలీకా న్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం .. శివప్రసాద్ విమర్శలను ప్రస్తావించి ఆయన పద్ధతి సరిగా లేదని అన్నట్లు తెలిసింది. ఏం జరిగిందని చిత్తూరు జిల్లా నేతలను ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి రోజున అంతా బాగా చేయాల నుకుంటే ఆయన అదేరోజు ఇలా చేశాడే మిటని వాపోయారు. తనను విమర్శిస్తున్నా ఎవరూ స్పందించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించడంతో టెలీకాన్ఫరెన్స్ ముగిశాక ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్.. ఎంపీపై విమర్శలు చేశారు. అనంతరం శివప్రసాద్ మరింత దూకుడుగా విమర్శలు చేయడంతో మధ్యాహ్నం చంద్ర బాబు ఉండవల్లిలోని తన నివాసంలోనే ముఖ్యనేతలతో మాట్లాడారు. ఆరునెలల నుంచి శివప్రసాద్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండట్లేదన్నారు. హథిరాంజీ మఠం భూములు దళితులకివ్వాలని అడిగాడని, ఆ పని చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పి చేయనన్నానని, దాన్ని మనసులో పెట్టుకుని అంబేడ్కర్ జయంతిరోజు తనపై విమర్శలు చేశాడని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. శివప్రసాద్‌పై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసినట్లు తెలిసింది. (నేనేం తప్పు మాట్లాడాను?: చంద్రబాబుపై శివప్రసాద్ ఆగ్రహం) -
నేనేం తప్పు మాట్లాడాను?
సీఎం చంద్రబాబుపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘చిత్తూరు వేదికపై నేనేం తప్పు మాట్లాడలేదే.. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాను. అధికార పార్టీలో ఉండీ కూడా ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడాల్సి వస్తోందని ఎప్పటి నుంచో కడుపులో బాధ. నాలుగు నెలల కిందటే శ్రేయోభిలాషులకు చెప్పాను. అంబేడ్కర్ జయంతి సభలో నా జనాన్ని చూసే సరికి ఆపుకోలేక పోయాను. మనసులో భాధ బయటకొచ్చింది. ఇందులో తప్పేముంద’ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్ చిత్తూరులో ధ్వజమెత్తడం విదితమే. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. నిజంగానే చంద్రబాబు దళితులకు ఏం చేశారనే చర్చ ఆ పార్టీ నేతల్లోనే మొదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం చంద్రబాబు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఆవేదనకు గురైన ఎంపీ శివప్రసాద్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో, ముఖ్యమంత్రి వద్ద తనకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. ఎంపీలందరూ బాధపడుతున్నారు.. ‘సీఎంతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా టైమివ్వడం లేదు. రాష్ట్రంలో కాకుండా ఢిల్లీకి వచ్చినపుడూ ఒక్క నిమిషం సమయం కేటాయించడం లేదు. ఎంపీలం దరూ బాధ పడుతు న్నారు. ఈ మధ్య విజయవాడలో జరిగిన పార్టీ వర్క్ షాప్‌నకు వెళ్లినపుడు కాలు జారి కింద పడ్డాను. అప్పుడు సీఎం నన్ను చూశారు కూడా. మరుసటి రోజు సీఎంను కలిసేందుకు ఇంటికెళ్లాను. మూడు గంటలు వెయిట్ చేయించారు. నేను కింద పడితే ఎలా ఉన్నావంటూ అడగడానికి కూడా ఆయనకు (సీఎంకు) టైం లేకపోతే మాకిచ్చే గౌరవం ఏమిటి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్తాననీ చెప్పలేదే. ఎవరో ఏదో చెబితే మీరు నమ్ముతారా? మీరే చెట్టును పెంచి మీరే కూల్చేయాలనుకోవడం న్యాయం కాదు. టెలీకాన్ఫరెన్సు ద్వారా నన్ను తిట్టాల్సిన పని లేదు. బురదలోకి లాగడానికి ప్రయత్నిస్తే నేనూ సిద్ధమే’ అని శివప్రసాద్ ఘాటుగా సమాధానమిచ్చారు. (శివప్రసాద్‌పై చర్యలు తప్పవు: చంద్రబాబు ఆగ్రహం) -
శివప్రసాద్ వ్యాఖ్యలపై జవహర్ ఆగ్రహం
ఏలూరు: ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని జెడ్పీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 75 కోట్లు కేటాయించి దళితుల పట్ల తనకున్న ప్రేమను సీఎం చంద్రబాబు చాటుకున్నారన్నారు. ప్రాంతాలవారీగా పదవులు ఇచ్చారనడం శివప్రసాద్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీనియర్ నాయకుడిగా ఉన్న శివప్రసాద్ పార్టీని అప్రదిష్టపాలు చేస్తున్నారన్నారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని జవహర్ చెప్పారు. -
చంద్రబాబుపై ఎంపీ శివప్రసాద్ అసంతృప్తి
తిరుపతి: టీడీపీ ఎంపీ శివప్రసాద్.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను భూకబ్జాదారుడిగా పేర్కొనడం దారుణమని, వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో అవాస్తవాలు మాట్లాడారని శివప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా దళితులకు జరుగుతున్న అన్యాయాలపై తాను మాట్లాడానని చెప్పారు. టీడీపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోవడం దారుణమని అన్నారు. దళితులకు న్యాయం జరగాలని కోరడం తప్పా? అని శివప్రసాద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. దళితులు ఇంకెంత కాలం మోసపోవాలని ప్రశ్నించారు. -
చంద్రబాబూ.. దళితులంటే చులకనా?
- ముఖ్యమంత్రిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ ధ్వజం - రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగారు. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. దళితులు ఇంకెంత కాలం మోసపోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల బ్యాక్లాగ్ పోస్టులున్నా.. ఈ మూడేళ్లలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా దళిత యువకులకు అన్యాయం చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరులో ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం కింద దళితుల భూములను లాక్కొని.. వారిని కూలీలుగా మారుస్తోందని ఆరోపించారు. ఫలితంగా దళితులు ఆర్థికంగా. సామాజికంగా మరింత వెనక్కి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని చెప్పారు. దళితులు మంత్రులుగా పనికిరారా? ‘‘రాష్ట్ర జనాభాలో 20 శాతం కంటే ఎక్కువగా ఉన్న దళితులు, గిరిజనులకు కేవలం రెండు మంత్రి పదవులే కేటాయిస్తారా? జనాభా దామాషా ప్రకారం ఐదు నుంచి ఆరు రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు పదవులతో సరిపెట్టారు. కేంద్ర మంత్రి పదవుల విషయంలోనూ దళితులకు తీరని అన్యాయం చేశారు. కేంద్ర మంత్రులుగా దళితులు పనికిరారా? మంత్రివర్గంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులుంటే, అందులో ఒక్కరు కూడా దళితులు లేకపోవడం శోచనీయం. టీడీపీకి దక్కిన రెండు కేంద్ర మంత్రి పదవులను అగ్రవర్ణాల వారికే ఇచ్చారు. దళితులంటే ఎందుకంత చులకన? ఉప ప్రణాళిక(సబ్‌ప్లాన్) నిధుల వినియోగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది’’ అని శివప్రసాద్ అన్నారు. ఇంకెంత కాలం మోసపోవాలి? ‘‘సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు దళితులకు ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్క దళితుడికైనా ఇల్లు కట్టించలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చామని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, మిగిలిన 10 శాతం హామీలు ఎస్సీ, ఎస్టీలవి కాబట్టే నెరవేర్చలేదు. దళితులు ఇంకెంతకాలం మోసపోవాలి? ఇంకెంతకాలం ఇతరుల పల్లకీ మోయాలి? జయంతి ఉత్సవాలప్పుడే అంబేడ్కర్ లాంటి మహనీయులు పాలకులకు గుర్తుకొస్తారు. తరువాత వారిని మరచిపోతారు. ఎకరాలకు ఎకరాలు సర్కారు భూములు కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. ఒక్క సెంటు భూమిలో దళితులు వేసుకున్న గుడిసెలను మాత్రం కూల్చేస్తారు. దళితుల డీకేటీ పట్టా భూములను పరిశ్రమల కోసం కారుచౌకగా తీసుకుంటూ 259 జీవోకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. డీకేటీ పట్టాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంకా నెరవేర్చలేకపోయారు’’ అని ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమరనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రభుత్వంలో మహిళకు ఇదేనా న్యాయం?
టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత సూటి ప్రశ్న సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘ఒక దళిత మహిళను ఇంత ఘోరంగా అవమానిస్తారా... నేనొక డాక్టర్ని. పైగా అధికార పార్టీ ఎంపీ కూతుర్ని.. నాలుగు గంటలుగా రోడ్డు మీద కూర్చొని జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఈ ప్రభుత్వంలో ఉన్నం దుకు ఇదా మాకు జరిగే న్యాయం?’ అంటూ చిత్తూరు ఎంపీ కుమార్తె డాక్టర్ మాధవీలత భోరున విలపించారు. ‘తిరుపతిలో మహిళా ఎస్పీ ఉండి కూడా న్యాయం జరగలేదు. కనీ సం వచ్చి పలకరించనూ లేదు. నన్ను తోసేసి, నా డ్రైవర్ని కొట్టిన వ్యక్తి పోలీస్‌స్టేషన్ వద్ద ఉంటే నేనే అక్కడికెళ్లి సారీ చెప్పించుకోవాలంట. ఇదేమైనా న్యాయంగా ఉందా?’ అంటూ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కారు. నాకు న్యాయం జరిగే వరకూ రోడ్డు మీద నుంచి కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో రెండు గంటల పాటు తీవ్రస్థాయిలో హైడ్రామా నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. డాక్టర్ మాధవీలతకు మద్దతుగా కొందరు డాక్టర్లు, యువకులు రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి నగరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. డాక్టర్ మాధవీలత, పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ మాధవీలత కల్యాణ్ జ్యూయలరీ రోడ్డు లోంచి కారులో వెళ్తున్నారు. రోడ్డు మధ్యలో డోర్లు తెరిచి నిలబెట్టిన కారును పక్కకు తీయాల్సిందిగా మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు హారన్ కొట్టారు. పక్కనే ఉన్న ఇంట్లోంచి బయటకు వచ్చిన నరేంద్ర అనే వ్యక్తి హారన్ కొడితే నరుకుతానన్నట్లు సైగ చేశాడు. మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు కారు దిగి ఆయనతో వాగ్వాదానికి దిగాడు. వీరు వాదులాడుకుంటుండగానే పక్కనే ఉన్న నరేంద్ర డ్రైవర్ దీపు.. ఆంజనేయులుపై దాడి చేశాడు. కారులోంచి గమనించిన డాక్టర్ మాధవీలత వెంటనే కిందకు దిగి ఇదేమిటని వారిని నిలదీసింది. నరేంద్ర, మాధవీలతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తనకు న్యాయం చేయాలని డాక్టర్ మాధవీలత అక్కడే రోడ్డుపై బైఠాయించింది. ‘ఆయన మా డ్రైవర్ని దారుణంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో ధూషించాడు. మహిళనని చూడకుండా నాపై దౌర్జన్యం చేస్తూ రోడ్డు మీద తోసేసి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చుని న్యాయం కోసం పోరాటం చేస్తుంటే పట్టించుకున్న వారే లేరు. మహిళలకు రక్షణ ఇదేనా?’ అని కన్నీటి పర్యంతమయ్యారు. నరేంద్ర అరెస్ట్: విషయం తెలియగానే డీఎస్పీ మురళీకృష్ణ ఘటన స్థలికి పోలీసులను పంపారు. నరేంద్రను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 3 గంటల తర్వాత చంద్రగిరి పోలీసులు వాహనంలో వెళ్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పోలీసులు కొమ్ముకాస్తున్నారు... నరేంద్రను అదుపులోకి తీసుకున్నామంటోన్న పోలీసులు అతన్ని సంఘటనా స్థలికి ఎందుకు తీసుకు రావడం లేదని డాక్టర్ మాధవీలత ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత తాను వెంటనే డీఐజీ ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి వివరించానని చెప్పారు. ‘రోడ్డు మీద నుంచి లేచి నేనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంట.. వెళ్లే ప్రసక్తే లేద’ని ఆమె స్పష్టం చేశారు. అడకత్తెరలో పోలీసులు ‘ఇటు వైపు ఎంపీ శివప్రసాద్.. అటు వైపు మంత్రి బొజ్జల.. ఇద్దరూ ఫోన్లలో వాయించేస్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేద’ని ఓ పోలీసు అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. గొడవ పడ్డ నరేంద్ర.. శ్రీకాళహస్తికి చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి దగ్గరి బంధువని సమాచారం. ఎక్సైజ్ శాఖలో పనిచేసే పోలీస్ ఉన్నతా«ధికారికి స్వయాన సోదరుడు. మంత్రి నుంచి ఫోన్లు మోగడంతో రంగంలోకి దిగిన డీజీపీ సాంబశివరావు తిరుపతి పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మరో పక్క ఎంపీ శివప్రసాద్ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శ రోడ్డు మీద కూర్చొని నిరసన తెల్పుతున్న మాధవీలతను సాయంత్రం ఆరు గంటలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓదార్చారు. అక్కడే ఉన్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ, పోలీసులతో మాట్లాడారు. విద్యావంతురాలైన ఓ మహిళ న్యాయం కోసం రోడ్డుమీద కన్నీళ్లు పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని పోలీసులను హెచ్చరించారు. నరేంద్రను అరెస్టు చేశామని, సుమోటోగా అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో మాధవీలత నిరసన విరమించి ఇంటికెళ్లారు. -
మోదీ బాణం సామాన్యులకు గుచ్చుకుంది
ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణతో నిరసన సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్న తరహాలో నిరసనకు దిగారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేలా నలుపు, తెలుపు రంగులో ఉన్న దుస్తులు ధరించి మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని విజయ్‌చౌక్‌లో నిరసన తెలిపారు. చొక్కాకు ఒకవైపున్న నలుపు రంగుపై ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నల్లకుబేరులు స్వాగతిస్తూ వికటాట్టహాసం చేస్తూ ముద్రించిన చిత్రాలు.. మరోవైపున్న తెల్లరంగుపై సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుపుతూ ముద్రించిన చిత్రాలు ఉన్నారుు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దశరథ మహారాజు ఏనుగు అనుకొని ముని కుమారుడిని చంపినట్టు.. ప్రధాని అనాలోచిత నిర్ణయం వల్ల ఆయన వదిలిన బాణం నల్లకుబేరులకు కాకుండా సామాన్య ప్రజలకు గుచ్చుకుందని వ్యాఖ్యానించారు. -
ప్రధానిది తొందరపాటు నిర్ణయం
ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని నిరోధించడానికంటూ ప్రధాని అకస్మాత్తుగా విసిరిన బాణం దిశ మారి పేదలను తీవ్రంగా తాకింది’అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. బురక్రథకుని వేషధారణలో తిరుపతి వీధుల్లోకి వచ్చిన ఎంపీ.. సోమవారం ఉదయం తిలక్‌రోడ్డులోని ఘంటసాల సర్కిల్లో మోదీ నిర్ణయంపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బుర్రకథ రూపంలో ఆయన ప్రజలకు వివరించారు. -
హోదా కోసం ‘తప్పెటగుళ్లు’
-
హోదా కోసం ‘తప్పెటగుళ్లు’
టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన.. సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ మంగళవారం ఢిల్లీలో తప్పెటగుళ్ల వేషధారణలో టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆందోళన చేశారు. ఈ సందర్భగా ఏపీకి ఇచ్చిన హామీలపై శివప్రసాద్ పాట పాడి వినిపించారు. ప్రత్యేక హోదా కోసం వేచి చూసి ఓపిక నశిస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోందని, అయితే హోదా కోసమే తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. హోదా సాధనకు వైఎస్ జగన్ సహా ఏ పార్టీ పోరాటం చేసినా సహకరిస్తామని వెల్లడించారు. -
ఫ్లెక్సీలో నా ఫొటో ఏదీ ?
అధికారులపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం పాకాల : పాకాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ వారు రూపొందించిన ఫ్లెక్సీని వే దిక ముందు ఉంచారు. అందులో ప్రొటోకాల్ ప్రకారం తన ఫొటో లేకపోవడంపై ఎంపీ అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమానికి పిలిచి ఈ విధంగా అవమానపరచడం తగదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపిగా తనకు ఉందని, అయితే సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు లేకుండా చేశారని ప్రశ్నించారు. ఎంపీ పట్ల ఇంత నిర్లక్ష్య దోర ణి వహించడం అధికారుల పని తీరుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీపీ చాముండేశ్వరి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగా నరేష్‌రెడ్డి, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ మునీశ్వర్‌రెడ్డి, టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు నాగరాజనాయుడు, ఎంపీడీవో ఎల్వీ. రాజ్‌గోపాల్, తహశీల్దార్ సుధాకరయ్య, సర్పంచ్‌లు, ప్రజాప్రతిధులు, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. -
పదవులు బాబును అడగండి
టీడీపీ ఎస్సీ నాయకులపై ఎంపీ శివప్రసాద్ మండిపాటు చిత్తూరు(రూరల్):‘‘పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు నామినేటెడ్ పదవులు మేం ఇవ్వలేం.. మీరు చంద్రబాబును అడగండి’’ అంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని బాలత్రిపుర సుందరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఎస్సీ నాయకులు తమకు పదవులు ఇవ్వాలని నాయకులను డిమాండ్ చేశారు. వారిని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా. ఆయన వచ్చినప్పుడు ఆయన మాటలకు చప్పట్లు కొట్టడం మాత్రమే తెలుసా..? ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు.. మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు. మా కన్నా ముందే మీరు వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నారు. మరి మేమెందుకు..? పదవులు అడగడం మా వల్ల కాదు, ఇవ్వడం కుదరదండి.. మీరే వెళ్లి సీఎంను అడగండి.’’ అని ఎంపీ తేల్చి చెప్పేశారు. చివరన రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. దీంతో ఆ పార్టీ ఎస్సీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా కాపు ఉద్యమం లాగా ఎస్సీ ఉద్య మం లేవనెత్తితే గానీ మీరూ స్పందించరా? అని ఆయన్ని నిలదీశారు. ఆయన్ని మరిన్ని ప్రశ్నలు అడిగే సరికి వద్దు అంటూ దండం పెట్టి వెళ్లిపోయారు. -
'నంది నాటకోత్సవాల్లో బిజీగా ఉన్నాను'
- ఆరోగ్యమిత్రలపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం తిరుపతి కార్పొరేషన్: ఏళ్ల తరబడి సేవ చేసిన మమ్మల్ని ఉన్నపళంగా తొలగించడంతో రోడ్డున పడ్డాం. మీరైనా స్పందించి మాకు న్యాయం చేయండి. మీకోసం జిల్లా కేంద్రం నుంచి వచ్చాం’’ అని ప్రాధేయపడిన చిత్తూరు జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలకు టీడీపీ ఎంపీ శివప్రసాద్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. తమను ఉద్యోగాల నుంచి తొలగించారని నిరసన తెలిపేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి ఆరోగ్యమిత్రలు తిరుపతికి వచ్చారు. అధికార పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మహతిలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల్లో ఉన్నట్టు తెలిసి అక్కడికి వె ళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో ఆయన ఎందుకు కంగారు పడతారు. ఏం కాదులే.. మీరే కాదు మీలా రోడ్లపై చాలామంది ఉన్నారు. వారందరికీ న్యాయం చేసేందుకే మేమున్నాం. నేను నంది నాటకోత్సవాల్లో బిజీగా ఉన్నాను. సమయం, సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఇలా నిలదీయడం సరికాదు. సీఎం చంద్రబాబు నాయుడు ఊళ్లో లేరు. ఆయన వచ్చాక చూద్దాంలే.. ఒక వేళ మీవల్ల అవుతుందనుకుంటే మీరే పరిష్కరించుకోండి.. వెళ్లండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ మాట తీరుతో ఆరోగ్యమిత్రలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎంపీ కదా అని సమస్యను చెప్పుకుందామని వస్తే ఇలా అవమానిస్తారా అంటూ వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మాట నిలుపుకోండి.. లేదంటే కాంగ్రెస్ గతే..
హరిశ్చంద్రుడి వేషంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ హెచ్చరించారు. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరి వేషధారణలో మంగళవారం విజయ్‌చౌక్‌లో ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. ‘కష్టములెన్నియున్నను..సత్యవాక్కు పరిపాలన సాగించవలయును కదా..ఇచ్చిన మాట తీర్చవలెను కదా..’అంటూ తన విజ్ఞప్తిని పద్యరూపంలో మీడియా ముందు వినిపించారు. ‘ఆంధ్రా ఎంపీలను కొట్టి..బలవంతంగా బయటకు నెట్టి..టీవీలను సైతం కట్టిపెట్టి..ఏపీని రెండుగా చీల్చినది..అట్టుడుకిన ఆంధ్ర జనం ఆగ్రహించగా..ఏమాయే..సోనియా కాంగ్రెస్ గతి..ఇది ఆదర్శమగు గాక..’ అంటూ తనదైన శైలిలో కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. -
పార్లమెంట్లో పాములోడు
-
'పార్లమెంట్లో పాములోడు'
న్యూఢిల్లీ : చిత్ర విచిత్ర వేషాలతో నిరసన వ్యక్తం చేసే చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాదరెడ్డి మరోసారి వినూత్నంగా తన నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాములు పట్టేవాడి వేషంతో ఆయన సోమవారం పార్లమంట్ ఆవరణలో తన నిరసన తెలియజేశారు. అంతకు ముందు శివప్రసాద్ యముడుగా, కృష్ణుడు, నారదుడు.... ఇలా రకరకాల వేషధారణలతో పార్లమెంట్లో సమైక్యగళాన్ని వెలుగెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు మతహింస నిరోధక బిల్లును అడ్డుకున్న తరహాలోనే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ప్రకటించారు. ఇప్పటికే అన్ని పార్టీలతో చర్చించామని... అందరూ సహకరిస్తారనే నమ్మకం తమకుందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి నివాసంలో సమావేశమైన ఎంపీలు ఈ సమైక్య రాష్ట్రం కోసం పోరాడాలని నిర్ణయించారు. -
'సోనియా ఏందిరో....ఆమె పీకుడేందిరో'
న్యూఢిల్లీ : విచిత్ర వేషధారణతో సమైక్యాంధ్ర గురించి ప్రచారం చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్న నిరసనతో మీడియాను ఆకర్షించారు. అయితే ఈసారి షర్టు విప్పి.... భుజంపై గొంగళి వేసుకున్నారు.. చేతిలో ఓ కర్ర పట్టుకుని ముందున్న మీడియా, పక్కనే ఉన్న ఎంపీలు కూడా అదిరిపడేలా ఓ విప్లవ గీతం అందుకున్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ బుధవారం ఉదయం పార్లమెంట్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర వినూత్న వేషదారణతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దొర ఏందిరో.. అన్న పాటనే మార్చి సోనియా ఏందిరో...ఆమె పీకుడేందిరో పేరడీ రూపంలో విభజన చేస్తున్న కాంగ్రెస్, సోనియాపై విరుచుకుపడ్డారు. గతంలోనూ ఇలాగే పార్లమెంట్ ఆవరణలో కొరడాతో కొట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర సంగతేంటోగానీ ఇలా వెరైటీ చేష్టలతో దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అంతకు ముందు కృష్ణుడు, నారదుడు, యముడుగా వేషధారణల్లో తన నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పార్లమెంట్ ఆవరణలో చిడతలు పట్టుకుని చెక్కభజన కూడా చేశారు. -
దొర ఏందిరో...ఆమె పీకుడు ఏందిరో
-
జీసస్ సమైక్యాంధ్రను బహుమతిగా ఇవ్వు
చిత్తూరు: విచిత్ర వేషధారణతో సమైక్యాంధ్ర గురించి ప్రచారం చేస్తున్న టిడిపి ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మరో కొత్త వేషం వేశారు. క్రిస్మస్ సందర్భంగా చిత్తూరులో ఆయన శాంతా క్లాజ్ వేషం వేశారు. సమైక్యాంధ్ర చాక్లెట్లు పంచారు. జీసస్ ప్రభు సమైక్యాంధ్రను మాకు బహుమతిగా ఇవ్వు అని పాట కూడా పాడారు. తనతోపాటు పిల్లలను కూడా పాట పాడమని ఆయన కోరారు. శివప్రసాద్ గతంలో ఢిల్లీలో కూడా అనేక రకాల వేషధారణలతో వార్తలకెక్కారు. కృష్ణుడు, నారదుడు వంటి పౌరాణిక పాత్రల వేషంలో, బుడబుక్కల వాడి వంటి అనేక వేషాలు వేయడం ద్వారా ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలిపారు. రాష్ట్ర విభజనకు శివప్రసాద్ వంటి వారు ఎంత వ్యతిరేకత తెలిపినా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సమైక్యాంధ్రకు మద్దతు తెలుపరు. ఆయన విభజనకే మద్దతు తెలుపుతున్నారు. -
భలే గొప్ప చిచ్చుపెడితివే...ఓ సోనియమ్మ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై చిత్రవిచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు టిడిపి ఎంపి శివప్రసాద్ మంగళవారం ఏకంగా నారదుడి అవతారమెత్తారు. నారదుడి అవతారంలో పార్లమెంట్‌కు వచ్చిన ఆయన చిడతలు వాయిస్తూ ... పాటలు పాడుతూ హడావుడి చేశారు. సీమాంధ్ర సమస్యలను ఏకరువు పెడుతూ .. హరికథ చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కోరారు. భలే గొప్ప చిచ్చుపెడితివే..... ఓ సోనియమ్మ .... అన్నదమ్ములే అసెంబ్లీలో, పార్లమెంట్లో తన్నుకునే చచ్చేలా భలే గొప్ప చిచ్చుపెడితివే... భలే గొప్ప ఉన్న రాష్ట్రాలు ఏలుకోక...ఊరుకే కూర్చోక సీమాంధ్ర జనం శఠగోపం పెట్టినావు రెండుసార్లు గెలిపిస్తే...రాష్ట్రం రెండు కావాలా? రాహుల్ పదవి కోసం ...రాద్ధాంతం చేస్తావా? భలే గొప్ప చిచ్చుపెడితివే..... ఓ సోనియమ్మా .... అని రాగయుక్తంగా పాడారు. ప్రజల కోసం కాదని .... తన కొడుకు కోసం సోనియాగాంధీ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టారని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని... ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లేందుకే నారదుని అవతారంలో వచ్చినట్లు ఆయన చెప్పి....నారాయణ ...నారాయణ అంటూ వెళ్లిపోయారు. -
యమహో యమా....శివన్న
*మొన్న శ్రీకృష్ణుడి వేషం... *నిన్న కొరడతో దెబ్బలు.... *ఆ తరువాత చేతిలో చిడతలతో చెక్కభజన *అనంతరం ముసలి వితంతువు వేషం, గంగమ్మ అవతారం తాజాగా యమధర్మరాజు..... ఇవన్నీ తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ వేస్తున్న వేషాలు. వేషాలు అంటే అపార్థం చేసుకోకండి. ఇవన్నీ రాష్ట్రాన్ని వీడదీయవద్దంటూ ఆయన తనకు తోచిన రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా శివప్రసాద్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో యముడి గెటప్‌లో నిరసన తెలిపారు. జానపద నాటక రూపంలో ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఆయన వివరించారు. సమైక్యంధ్ర ఉద్యమం నేటికి వంద రోజులుకు చేరుకున్న నేపథ్యంలో శివప్రసాద్ మరోసారి తనదైన శైలిలో సమైక్యాంధ్ర వాణిని వినిపించారు. సాధారణంగా నాయకులు ఎవరి మీదనైనా నిరసన వ్యక్తం చేయాలంటే వారి వేషం వేసుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తిరడం, అర్ధనగ్నంగా.. రకరకాల వేషాల్లో ఊరేగడం.. ఇలాంటి చేయటం సాధారణమే. అయితే శివప్రసాద్ రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ నెత్తికో కిరీటం, మెడలో చెమికీ దండ, చేతిలో పిల్లనగ్రోవితో శ్రీకృష్ణుడి వేషధారణలో సభకు వెళ్లి పద్యాలు పాడి సభ్యులకు వినోదాన్ని కూడా కలిగించారు. ఆతర్వాత పార్లమెంట్ ఆవరణలో చెర్నాకోలాతో తనకు తానే కొట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్ర విభజన విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్న వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తెచ్చేందుకు శివప్రసాద్ వినూత్న పోకడలకు పోయారు. ఇందిరాగాంధీ మాస్క్ వేసుకుని సభలోకి వెళ్లి సహచర ఎంపీలను సైతం నివ్వెరపోయేలా చేశారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలోని మెట్లపై కూర్చుని శివప్రసాద్ చెక్క భజన చేస్తే..... ఆయనకు సహచర ఎంపీలు తాళం వేయటం విశేషం. ఆ తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ముసలి వితంతువు వేషం వేశారు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. శివన్న ఏం చేసినా వెరైటీ అన్నట్లు ఇప్పుడు కూడా యముడి వేషంలో అందర్నీ అలరించారు. -
శివన్న చెక్క భజన
బంగి అనంతయ్య ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేంది ..... విచిత్ర వేషధారణతో నిరసనలు తెలుపుతూ ప్రజలతో పాటు, మీడియాను ఆకర్షించేవాడు. మాజీ టీడీపీ నేత, అయిన ఆయన విచిత్ర వేషధారణకు పెట్టింది పేరు. బంగి అనంతయ్యకు వచ్చినన్ని వెరైటీ ఆలోచనలుల ఎవ్వరికీ రావేమో అనిపిస్తుంది. తాజాగా ఆయన వారసత్వాన్ని ఎంపీ శివప్రసాద్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొన్న శ్రీకృష్ణుడి వేషం...నిన్న కొరడతో దెబ్బలు.... ఈరోజు చేతిలో చిడతలతో టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నిరసన తెలిపారు. మొన్నటికి మొన్న తెలంగాణకు అనుకూలమని చెప్పిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇప్పుడు రాష్ట్రాన్ని చీల్చడం సరికాదంటూ పార్లమెంట్ ముందు చెక్కభజన చేశారు. చేతిలో చిడతలు పట్టుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగా ఉంచాలని సోనియాకు విజ్ఞప్తి చేస్తూ భజనలు, పద్యాలు పాడారు. తిరుపతిలో డాక్టర్‌గా శివప్రసాద్ ఆ తర్వాత నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన ఆతర్వాత తన విలక్షణ నటనతో ఆదరణ పొందారు. అయితే వంటబట్టించుకున్న నటనను శివప్రసాద్ ఇప్పుడు కూడా అంత తేలిగ్గా వదిలించుకోలేకపోతున్నారు. అవకాశం దొరకటంతో సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్ వేదికగా విలక్షణంగా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాయకులు ఎవరి మీదనైనా నిరసన వ్యక్తం చేయాలంటే వారి వేషం వేసుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తిరడం, అర్ధనగ్నంగా.. రకరకాల వేషాల్లో ఊరేగడం.. ఇలాంటి చేయటం సాధారణమే. అయితే శివప్రసాద్ రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ నెత్తికో కిరీటం, మెడలో చెమికీ దండ, చేతిలో పిల్లనగ్రోవితో శ్రీకృష్ణుడి వేషధారణలో సభకు వెళ్లి పద్యాలు పాడి సభ్యులకు వినోదాన్ని కూడా కలిగించారు. ఆతర్వాత పార్లమెంట్ ఆవరణలో చెర్నాకోలాతో తనకు తానే కొట్టుకుని నిరసన తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్న వైఖరికి భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తెచ్చేందుకు శివప్రసాద్ వినూత్న పోకడలకు పోయారు. ఇందిరాగాంధీ మాస్క్ వేసుకుని సభలోకి వెళ్లి సహచర ఎంపీలను సైతం నివ్వెరపోయేలా చేశారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలోని మెట్లపై కూర్చుని శివప్రసాద్ బుధవారం చెక్క భజన చేశారు. ఆయనకు సహచర ఎంపీలు తాళం వేయటం విశేషం. మరోవైపు చట్టసభల వేదికగా వినోదం పండిస్తున్న టీడీపీ ఎంపీలు వేస్తున్న తెలుగువారిని ఢిల్లీలో అభాసుపాలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీలు వాపోతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, పరువు అని డైలాగులు కొట్టే టీడీపీ ఎంపీలు చిల్లరవేషాలతో తెలుగుజాతి పరువు ఢిల్లీ వీధుల్లో మంటగలుపుతున్నారని మండిపడుతున్నారు. ఓ వైపు రాష్ట్ర విభజనపై ఆ పార్టీ నేత లేఖ ఇస్తే... ఆపార్టీ ఎంపీలు మాత్రం సమైక్యాంధ్ర అంటూ డ్రామాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి కోటి విద్యలు కూటి కోసం అన్నట్లు నేతలు కూడా వచ్చే 'కోట్లు', ఓట్లు కోసం తిప్పలు పడుతున్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తిరుపతి, చిత్తూరు
సమైక్యాంధ్ర ఉద్యమం పల్లెలనూ తాకింది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఆందోళనలు మొదలయ్యాయి. సామాన్యులే సారథులై సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. జనం చేయిచేయి కలిపి ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సమైక్య నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. ఐదురోజుల నుంచి నిర్విరామంగా చేపడుతున్న దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లా దద్దరిల్లిపోతోంది. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలు, ఆటో, టాక్సీ యూనియన్లు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు పట్టణాల్లో మున్సిపల్ ఉద్యోగులు 72 గంటల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల పర్యవేక్షణను మినహా యించారు. వీరితో పాటు అతి సామాన్యులు, చిన్న పిల్లలు సమైక్య జెండాలు చేతపట్టుకుని రోడ్డెక్కుతున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన సమైక్య ఉద్యమం హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు మినహా మిగిలిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమై క్య ఉద్యమంలో వెనుక వరుసలో నడుస్తుండ గా, సామాన్య ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు. అందుకు ఆదివారం జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ చింతామోహన్ నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. కానీ ఆయన మాత్రం రాజీనామాకు అంగీకరించలేదు. తిరుపతిలో ఆదివారం తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే గాలిముద్దుకృష్ణమనాయుడు, తూర్పు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే చదలవాడకృష్ణమూర్తిని పిలిచారు. ఉదయం 10గంటలకు కార్యక్రమం ఉంటుందని చెప్పి యువత తెలుగుతల్లి విగ్రహానికి చేరుకున్నారు. అయితే ముఖ్య నేతలు మాత్రం తీరిగ్గా 11 గంటలకు వచ్చి మీడియా వారితో మాట్లాడారు. అనంతరం తెలుగుతల్లికి పూలమాలవేసి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. అయితే యువత నాయకులు మాత్రం తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సమైక్యానికి హిజ్రాల మద్దతు సమైక్యాంధ్ర ఉద్యమానికి హిజ్రాలు మద్దతు పలికారు. మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ కార్యాలయం ముందు ఆటపాటలతో నిరసన తెలిపారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హిజ్రాలంతా నేటి నుంచి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మదనపల్ల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ఆందోళనకారులు ఆదివారం ఉదయం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి డప్పుకొట్టి కూరగాయలు తరిగి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమైక్యవాదులు కోలాటాలు ఆడుతూ నిరసన తెలియజేశారు. రజకులు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట దుస్తులు ఉతికారు. మరి కొందరు ఉద్యమకారులు రిలేదీక్షలు చేపట్టారు. లారీ వర్కర్స్ అసోసియేషన్ వారు లారీలపై కేసీఆర్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ ర్యాలీ నిర్వహించారు. తోపుడు బండ్లవారు కూడా మోకాళ్లపై నిరసన తెలియజేశారు. వెల్డింగ్, ట్రాక్టర్ అసోసియేషన్ వారు కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. జర్నలిస్టు లు గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రెవెన్యూ అసోసియేషన్ వారు సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించారు. తిరుపతిలో ఐదోరోజూ బంద్ విజయవంతం తిరుపతిలో ఆదివారం కూడా బంద్ విజయవంతమైంది. ఉద్యమకారులు వీధుల్లో మోటర్‌బైక్ ర్యాలీలు నిర్వహించి దుకాణాలు తెరవనివ్వలేదు. ఎక్కడి వాహనాలను అక్కడే అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జ్యోతి థియేటర్ సర్కిల్లో నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు రుయా ఆస్పత్రి నుంచి టౌన్ క్లబ్, గాంధీ రోడ్ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహిచి మున్సిపల్ కార్యాలయం వద్ద శాప్స్ రిలే దీక్షకు మద్దతు పలికారు. ఆర్యవైశ్య సంఘం, భవన నిర్మాణ కార్మికులు, ఆటో స్టాండ్ వర్కర్లు ఆటో, బైక్, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేశారు. పల్లెల్లో ఉద్యమ జోరు సమైక్య ఉద్యమం పల్లెలకు పాకింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని ప్రతిపల్లెలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. పల్లెల్లోనూ ద్విచక్ర వాహనాలను కూడా తిరగనివ్వలేదు. పీలేరులో జాతీయ రహదారిపై ఆందోళనకారులు వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీయూలో విద్యార్థులు ఆమరణ నిరాహారదీక్ష రెండవ రోజుకు చేరింది. కుప్పం, గుడుపల్లె, ఎద్దులగట్టు, శాంతిపురం, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం, కురుబలకోట, పుత్తూరు, నగరి, చిత్తూరు, మదనపల్లె, చంద్రగిరి, పలమనేరు, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, గంగాధరనెల్లూరు, పుంగనూరు పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్షం, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిం చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు కూడా ఆందోళనలను కొనసాగిస్తున్నట్లు ఉద్యమకారులు ప్రకటించారు.