భలే గొప్ప చిచ్చుపెడితివే...ఓ సోనియమ్మ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై చిత్రవిచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు టిడిపి ఎంపి శివప్రసాద్ మంగళవారం ఏకంగా నారదుడి అవతారమెత్తారు. నారదుడి అవతారంలో పార్లమెంట్‌కు వచ్చిన ఆయన చిడతలు వాయిస్తూ ... పాటలు పాడుతూ హడావుడి చేశారు. సీమాంధ్ర సమస్యలను ఏకరువు పెడుతూ .. హరికథ చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కోరారు.
భలే గొప్ప చిచ్చుపెడితివే.....
ఓ సోనియమ్మ ....
అన్నదమ్ములే అసెంబ్లీలో, పార్లమెంట్లో తన్నుకునే చచ్చేలా
భలే గొప్ప చిచ్చుపెడితివే... భలే గొప్ప
ఉన్న రాష్ట్రాలు ఏలుకోక...ఊరుకే కూర్చోక
సీమాంధ్ర జనం శఠగోపం పెట్టినావు
రెండుసార్లు గెలిపిస్తే...రాష్ట్రం రెండు కావాలా?
రాహుల్ పదవి కోసం ...రాద్ధాంతం చేస్తావా?
భలే గొప్ప చిచ్చుపెడితివే.....
ఓ సోనియమ్మా .... అని రాగయుక్తంగా పాడారు.
ప్రజల కోసం కాదని .... తన కొడుకు కోసం సోనియాగాంధీ రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టారని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలని... ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లేందుకే నారదుని అవతారంలో వచ్చినట్లు ఆయన చెప్పి....నారాయణ ...నారాయణ అంటూ వెళ్లిపోయారు.