యమహో యమా....శివన్న
*మొన్న శ్రీకృష్ణుడి వేషం...
*నిన్న కొరడతో దెబ్బలు....
*ఆ తరువాత చేతిలో చిడతలతో చెక్కభజన
*అనంతరం ముసలి వితంతువు వేషం, గంగమ్మ అవతారం
తాజాగా యమధర్మరాజు..... ఇవన్నీ తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ వేస్తున్న వేషాలు. వేషాలు అంటే అపార్థం చేసుకోకండి. ఇవన్నీ రాష్ట్రాన్ని వీడదీయవద్దంటూ ఆయన తనకు తోచిన రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా శివప్రసాద్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో యముడి గెటప్లో నిరసన తెలిపారు. జానపద నాటక రూపంలో ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఆయన వివరించారు. సమైక్యంధ్ర ఉద్యమం నేటికి వంద రోజులుకు చేరుకున్న నేపథ్యంలో శివప్రసాద్ మరోసారి తనదైన శైలిలో సమైక్యాంధ్ర వాణిని వినిపించారు.
సాధారణంగా నాయకులు ఎవరి మీదనైనా నిరసన వ్యక్తం చేయాలంటే వారి వేషం వేసుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తిరడం, అర్ధనగ్నంగా.. రకరకాల వేషాల్లో ఊరేగడం.. ఇలాంటి చేయటం సాధారణమే. అయితే శివప్రసాద్ రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ నెత్తికో కిరీటం, మెడలో చెమికీ దండ, చేతిలో పిల్లనగ్రోవితో శ్రీకృష్ణుడి వేషధారణలో సభకు వెళ్లి పద్యాలు పాడి సభ్యులకు వినోదాన్ని కూడా కలిగించారు. ఆతర్వాత పార్లమెంట్ ఆవరణలో చెర్నాకోలాతో తనకు తానే కొట్టుకుని నిరసన తెలిపారు.
అనంతరం రాష్ట్ర విభజన విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్న వైఖరికి భిన్నంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తెచ్చేందుకు శివప్రసాద్ వినూత్న పోకడలకు పోయారు. ఇందిరాగాంధీ మాస్క్ వేసుకుని సభలోకి వెళ్లి సహచర ఎంపీలను సైతం నివ్వెరపోయేలా చేశారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలోని మెట్లపై కూర్చుని శివప్రసాద్ చెక్క భజన చేస్తే..... ఆయనకు సహచర ఎంపీలు తాళం వేయటం విశేషం.
ఆ తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ముసలి వితంతువు వేషం వేశారు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. శివన్న ఏం చేసినా వెరైటీ అన్నట్లు ఇప్పుడు కూడా యముడి వేషంలో అందర్నీ అలరించారు.