'సోనియా ఏందిరో....ఆమె పీకుడేందిరో'
న్యూఢిల్లీ : విచిత్ర వేషధారణతో సమైక్యాంధ్ర గురించి ప్రచారం చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్న నిరసనతో మీడియాను ఆకర్షించారు. అయితే ఈసారి షర్టు విప్పి.... భుజంపై గొంగళి వేసుకున్నారు.. చేతిలో ఓ కర్ర పట్టుకుని ముందున్న మీడియా, పక్కనే ఉన్న ఎంపీలు కూడా అదిరిపడేలా ఓ విప్లవ గీతం అందుకున్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ బుధవారం ఉదయం పార్లమెంట్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర వినూత్న వేషదారణతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
దొర ఏందిరో.. అన్న పాటనే మార్చి సోనియా ఏందిరో...ఆమె పీకుడేందిరో పేరడీ రూపంలో విభజన చేస్తున్న కాంగ్రెస్, సోనియాపై విరుచుకుపడ్డారు. గతంలోనూ ఇలాగే పార్లమెంట్ ఆవరణలో కొరడాతో కొట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర సంగతేంటోగానీ ఇలా వెరైటీ చేష్టలతో దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అంతకు ముందు కృష్ణుడు, నారదుడు, యముడుగా వేషధారణల్లో తన నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పార్లమెంట్ ఆవరణలో చిడతలు పట్టుకుని చెక్కభజన కూడా చేశారు.