శివన్న చెక్క భజన
బంగి అనంతయ్య ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేంది ..... విచిత్ర వేషధారణతో నిరసనలు తెలుపుతూ ప్రజలతో పాటు, మీడియాను ఆకర్షించేవాడు. మాజీ టీడీపీ నేత, అయిన ఆయన విచిత్ర వేషధారణకు పెట్టింది పేరు. బంగి అనంతయ్యకు వచ్చినన్ని వెరైటీ ఆలోచనలుల ఎవ్వరికీ రావేమో అనిపిస్తుంది. తాజాగా ఆయన వారసత్వాన్ని ఎంపీ శివప్రసాద్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మొన్న శ్రీకృష్ణుడి వేషం...నిన్న కొరడతో దెబ్బలు.... ఈరోజు చేతిలో చిడతలతో టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నిరసన తెలిపారు. మొన్నటికి మొన్న తెలంగాణకు అనుకూలమని చెప్పిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇప్పుడు రాష్ట్రాన్ని చీల్చడం సరికాదంటూ పార్లమెంట్ ముందు చెక్కభజన చేశారు. చేతిలో చిడతలు పట్టుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగా ఉంచాలని సోనియాకు విజ్ఞప్తి చేస్తూ భజనలు, పద్యాలు పాడారు.
తిరుపతిలో డాక్టర్గా శివప్రసాద్ ఆ తర్వాత నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన ఆతర్వాత తన విలక్షణ నటనతో ఆదరణ పొందారు. అయితే వంటబట్టించుకున్న నటనను శివప్రసాద్ ఇప్పుడు కూడా అంత తేలిగ్గా వదిలించుకోలేకపోతున్నారు. అవకాశం దొరకటంతో సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్ వేదికగా విలక్షణంగా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
నాయకులు ఎవరి మీదనైనా నిరసన వ్యక్తం చేయాలంటే వారి వేషం వేసుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తిరడం, అర్ధనగ్నంగా.. రకరకాల వేషాల్లో ఊరేగడం.. ఇలాంటి చేయటం సాధారణమే. అయితే శివప్రసాద్ రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ నెత్తికో కిరీటం, మెడలో చెమికీ దండ, చేతిలో పిల్లనగ్రోవితో శ్రీకృష్ణుడి వేషధారణలో సభకు వెళ్లి పద్యాలు పాడి సభ్యులకు వినోదాన్ని కూడా కలిగించారు. ఆతర్వాత పార్లమెంట్ ఆవరణలో చెర్నాకోలాతో తనకు తానే కొట్టుకుని నిరసన తెలిపారు.
ఆ తర్వాత రాష్ట్ర విభజన విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్న వైఖరికి భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తెచ్చేందుకు శివప్రసాద్ వినూత్న పోకడలకు పోయారు. ఇందిరాగాంధీ మాస్క్ వేసుకుని సభలోకి వెళ్లి సహచర ఎంపీలను సైతం నివ్వెరపోయేలా చేశారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలోని మెట్లపై కూర్చుని శివప్రసాద్ బుధవారం చెక్క భజన చేశారు. ఆయనకు సహచర ఎంపీలు తాళం వేయటం విశేషం.
మరోవైపు చట్టసభల వేదికగా వినోదం పండిస్తున్న టీడీపీ ఎంపీలు వేస్తున్న తెలుగువారిని ఢిల్లీలో అభాసుపాలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీలు వాపోతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, పరువు అని డైలాగులు కొట్టే టీడీపీ ఎంపీలు చిల్లరవేషాలతో తెలుగుజాతి పరువు ఢిల్లీ వీధుల్లో మంటగలుపుతున్నారని మండిపడుతున్నారు. ఓ వైపు రాష్ట్ర విభజనపై ఆ పార్టీ నేత లేఖ ఇస్తే... ఆపార్టీ ఎంపీలు మాత్రం సమైక్యాంధ్ర అంటూ డ్రామాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి కోటి విద్యలు కూటి కోసం అన్నట్లు నేతలు కూడా వచ్చే 'కోట్లు', ఓట్లు కోసం తిప్పలు పడుతున్నారు.