
'నంది నాటకోత్సవాల్లో బిజీగా ఉన్నాను'
ఏళ్ల తరబడి సేవ చేసిన మమ్మల్ని ఉన్నపళంగా తొలగించడంతో రోడ్డున పడ్డాం.
- ఆరోగ్యమిత్రలపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం
తిరుపతి కార్పొరేషన్: ఏళ్ల తరబడి సేవ చేసిన మమ్మల్ని ఉన్నపళంగా తొలగించడంతో రోడ్డున పడ్డాం. మీరైనా స్పందించి మాకు న్యాయం చేయండి. మీకోసం జిల్లా కేంద్రం నుంచి వచ్చాం’’ అని ప్రాధేయపడిన చిత్తూరు జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలకు టీడీపీ ఎంపీ శివప్రసాద్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. తమను ఉద్యోగాల నుంచి తొలగించారని నిరసన తెలిపేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి ఆరోగ్యమిత్రలు తిరుపతికి వచ్చారు. అధికార పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మహతిలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల్లో ఉన్నట్టు తెలిసి అక్కడికి వె ళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో ఆయన ఎందుకు కంగారు పడతారు. ఏం కాదులే.. మీరే కాదు మీలా రోడ్లపై చాలామంది ఉన్నారు.
వారందరికీ న్యాయం చేసేందుకే మేమున్నాం. నేను నంది నాటకోత్సవాల్లో బిజీగా ఉన్నాను. సమయం, సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఇలా నిలదీయడం సరికాదు. సీఎం చంద్రబాబు నాయుడు ఊళ్లో లేరు. ఆయన వచ్చాక చూద్దాంలే.. ఒక వేళ మీవల్ల అవుతుందనుకుంటే మీరే పరిష్కరించుకోండి.. వెళ్లండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ మాట తీరుతో ఆరోగ్యమిత్రలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎంపీ కదా అని సమస్యను చెప్పుకుందామని వస్తే ఇలా అవమానిస్తారా అంటూ వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.