
పదవులు బాబును అడగండి
‘‘పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు నామినేటెడ్ పదవులు మేం ఇవ్వలేం..
టీడీపీ ఎస్సీ నాయకులపై ఎంపీ శివప్రసాద్ మండిపాటు
చిత్తూరు(రూరల్):‘‘పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఎస్సీ నాయకుడికీ, కార్యకర్తకు నామినేటెడ్ పదవులు మేం ఇవ్వలేం.. మీరు చంద్రబాబును అడగండి’’ అంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీడీపీ ఎస్సీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగరంలోని బాలత్రిపుర సుందరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఎస్సీ నాయకులు తమకు పదవులు ఇవ్వాలని నాయకులను డిమాండ్ చేశారు. వారిని ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు పదవులు అడగవచ్చు కదా. ఆయన వచ్చినప్పుడు ఆయన మాటలకు చప్పట్లు కొట్టడం మాత్రమే తెలుసా..? ఆయన్ని ఎందుకు ప్రశ్నించరు.. మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు.
మా కన్నా ముందే మీరు వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నారు. మరి మేమెందుకు..? పదవులు అడగడం మా వల్ల కాదు, ఇవ్వడం కుదరదండి.. మీరే వెళ్లి సీఎంను అడగండి.’’ అని ఎంపీ తేల్చి చెప్పేశారు. చివరన రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. దీంతో ఆ పార్టీ ఎస్సీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా కాపు ఉద్యమం లాగా ఎస్సీ ఉద్య మం లేవనెత్తితే గానీ మీరూ స్పందించరా? అని ఆయన్ని నిలదీశారు. ఆయన్ని మరిన్ని ప్రశ్నలు అడిగే సరికి వద్దు అంటూ దండం పెట్టి వెళ్లిపోయారు.