
ఈ ప్రభుత్వంలో మహిళకు ఇదేనా న్యాయం?
‘ఒక దళిత మహిళను ఇంత ఘోరంగా అవమానిస్తారా... నేనొక డాక్టర్ని. పైగా అధికార పార్టీ ఎంపీ కూతుర్ని..
టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత సూటి ప్రశ్న
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘ఒక దళిత మహిళను ఇంత ఘోరంగా అవమానిస్తారా... నేనొక డాక్టర్ని. పైగా అధికార పార్టీ ఎంపీ కూతుర్ని.. నాలుగు గంటలుగా రోడ్డు మీద కూర్చొని జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఈ ప్రభుత్వంలో ఉన్నం దుకు ఇదా మాకు జరిగే న్యాయం?’ అంటూ చిత్తూరు ఎంపీ కుమార్తె డాక్టర్ మాధవీలత భోరున విలపించారు. ‘తిరుపతిలో మహిళా ఎస్పీ ఉండి కూడా న్యాయం జరగలేదు. కనీ సం వచ్చి పలకరించనూ లేదు. నన్ను తోసేసి, నా డ్రైవర్ని కొట్టిన వ్యక్తి పోలీస్‌స్టేషన్ వద్ద ఉంటే నేనే అక్కడికెళ్లి సారీ చెప్పించుకోవాలంట. ఇదేమైనా న్యాయంగా ఉందా?’ అంటూ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కారు. నాకు న్యాయం జరిగే వరకూ రోడ్డు మీద నుంచి కదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో రెండు గంటల పాటు తీవ్రస్థాయిలో హైడ్రామా నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. డాక్టర్ మాధవీలతకు మద్దతుగా కొందరు డాక్టర్లు, యువకులు రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి నగరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. డాక్టర్ మాధవీలత, పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ మాధవీలత కల్యాణ్ జ్యూయలరీ రోడ్డు లోంచి కారులో వెళ్తున్నారు. రోడ్డు మధ్యలో డోర్లు తెరిచి నిలబెట్టిన కారును పక్కకు తీయాల్సిందిగా మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు హారన్ కొట్టారు. పక్కనే ఉన్న ఇంట్లోంచి బయటకు వచ్చిన నరేంద్ర అనే వ్యక్తి హారన్ కొడితే నరుకుతానన్నట్లు సైగ చేశాడు. మాధవీలత డ్రైవర్ ఆంజనేయులు కారు దిగి ఆయనతో వాగ్వాదానికి దిగాడు. వీరు వాదులాడుకుంటుండగానే పక్కనే ఉన్న నరేంద్ర డ్రైవర్ దీపు.. ఆంజనేయులుపై దాడి చేశాడు.
కారులోంచి గమనించిన డాక్టర్ మాధవీలత వెంటనే కిందకు దిగి ఇదేమిటని వారిని నిలదీసింది. నరేంద్ర, మాధవీలతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తనకు న్యాయం చేయాలని డాక్టర్ మాధవీలత అక్కడే రోడ్డుపై బైఠాయించింది. ‘ఆయన మా డ్రైవర్ని దారుణంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో ధూషించాడు. మహిళనని చూడకుండా నాపై దౌర్జన్యం చేస్తూ రోడ్డు మీద తోసేసి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చుని న్యాయం కోసం పోరాటం చేస్తుంటే పట్టించుకున్న వారే లేరు. మహిళలకు రక్షణ ఇదేనా?’ అని కన్నీటి పర్యంతమయ్యారు.
నరేంద్ర అరెస్ట్: విషయం తెలియగానే డీఎస్పీ మురళీకృష్ణ ఘటన స్థలికి పోలీసులను పంపారు. నరేంద్రను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. 3 గంటల తర్వాత చంద్రగిరి పోలీసులు వాహనంలో వెళ్తున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
పోలీసులు కొమ్ముకాస్తున్నారు...
నరేంద్రను అదుపులోకి తీసుకున్నామంటోన్న పోలీసులు అతన్ని సంఘటనా స్థలికి ఎందుకు తీసుకు రావడం లేదని డాక్టర్ మాధవీలత ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత తాను వెంటనే డీఐజీ ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి వివరించానని చెప్పారు. ‘రోడ్డు మీద నుంచి లేచి నేనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంట.. వెళ్లే ప్రసక్తే లేద’ని ఆమె స్పష్టం చేశారు.
అడకత్తెరలో పోలీసులు
‘ఇటు వైపు ఎంపీ శివప్రసాద్.. అటు వైపు మంత్రి బొజ్జల.. ఇద్దరూ ఫోన్లలో వాయించేస్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేద’ని ఓ పోలీసు అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. గొడవ పడ్డ నరేంద్ర.. శ్రీకాళహస్తికి చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి దగ్గరి బంధువని సమాచారం. ఎక్సైజ్ శాఖలో పనిచేసే పోలీస్ ఉన్నతా«ధికారికి స్వయాన సోదరుడు. మంత్రి నుంచి ఫోన్లు మోగడంతో రంగంలోకి దిగిన డీజీపీ సాంబశివరావు తిరుపతి పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మరో పక్క ఎంపీ శివప్రసాద్ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.
ఎమ్మెల్యే చెవిరెడ్డి పరామర్శ
రోడ్డు మీద కూర్చొని నిరసన తెల్పుతున్న మాధవీలతను సాయంత్రం ఆరు గంటలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓదార్చారు. అక్కడే ఉన్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ, పోలీసులతో మాట్లాడారు. విద్యావంతురాలైన ఓ మహిళ న్యాయం కోసం రోడ్డుమీద కన్నీళ్లు పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని పోలీసులను హెచ్చరించారు. నరేంద్రను అరెస్టు చేశామని, సుమోటోగా అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో మాధవీలత నిరసన విరమించి ఇంటికెళ్లారు.