కీచకపర్వానికి ‘పచ్చ’ నేత అండ
- పొలంలో పనిచేస్తున్న వివాహితపై కిరాతకం
- నోటిలో టవల్‌కుక్కి దారుణానికి పాల్పడిన ముగ్గురు
- మొబైల్‌తో ఫొటోలు తీసి బెదిరించి మరో రెండుసార్లు...
- ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
సాక్షి, అమరావతి: కూటికోసం కూలికెళ్లిన ఓ అభాగ్యురాలిని నోట్లో టవల్ కుక్కి ముగ్గురు యువకులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేత ఆదేశాలకే విలువ ఇచ్చి నిందితులకు అండగా నిలిచారు. ప్రాణ భయంతో బాధితురాలు భర్తతో కలిసి ఊరు విడిచి పారిపోయి హైదరాబాద్‌లో తలదా చుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్‌ను ప్రారంభించిన రోజునే న్యాయం కోసం బాధితురాలు, ఆమె భర్త డీజీపీ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు పడటంతో జరిగిన దారుణం వెలుగుచూసింది.
దోషులకు టీడీపీ నేత అండ ఉండటంతో ధైర్యాన్ని కూడగట్టుకుని న్యాయం కోసం పోలీస్ డీజీపీని ఆశ్రయించారు. ఆయన ఆదేశించినా న్యాయం జరక్కపోవడంతో మరోమారు పోలీస్ బాస్‌ను కలిసేందుకు ఆ దంపతులు శుక్రవారం విజయవాడకు వచ్చారు. సోమవారం రావాలంటూ క్యాంపు కార్యాలయం వద్ద గార్డులు చెప్పడంతో వారు రోడ్డుపక్కన రోజంతా పడిగాపులు పడ్డారు. వారిని కదలించిన మీడియా వద్ద విలపిస్తూ జరిగిన అన్యా యాన్ని ఏకరువు పెట్టారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు...
బెదిరించి అత్యాచారం చేశారు..
కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 13న పొలంలో పనిచేస్తున్న వివాహితను నోట్లో తువ్వాలు కుక్కి ఎత్తుకపోయిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన కె.శ్రీను, కె.కృష్ణ, గొల్ల శివ అత్యాచారం చేసి నగ్నంగా సెల్‌ఫోన్‌లో వీడియో, ఫొటోలు కూడా తీశారు. చంపుతామని బెదిరించారు. కొద్ది రోజుల తరువాత ఆ ఫొటోలు చూపించి మళ్లీ రెండు పర్యాయాలు అత్యాచారం చేశారు.
ప్రాణభయంతోనే.. బాధితురాలి భర్త
తన భార్య నీరసంగా ఉండడంతో గత ఏడాది డిసెంబర్ 14న వైద్యం చేయించినట్టు బాధితురాలి భర్త తెలిపాడు. భయపడిన ఆమె అప్పుడు విషయం చెప్పలేదనీ, మరో రెండు పర్యాయాలు కూడా బెదిరించి అత్యాచారం జరగడంతో నిందితులను అడ్డగించి ఫొటోలు తీసిన సెల్ మెమెరీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయవాడ వచ్చి డీజీపీ సాంబశివరావుకు ఫిర్యాదు చేస్తే ఆయన ఆదేశాలతో కర్నూలు సీఐ మహేశ్వరరెడ్డిని ఈ నెల 2న కలిసి ఫిర్యాదు చేశామన్నాడు. తొలుత సానుకూలంగా స్పందించిన సీఐ అటు తరువాత టీడీపీ నేత ఒత్తిడితో మారిపోయారన్నారు. టీడీపీ నాయకుడు విష్ణువర్థన్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడిన దోషులను కాపాడుతున్నాడని చెప్పాడు.
కేసు నమోదు చేశాం: ఎస్పీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తనపై అత్యాచారం జరిగిందంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వారం రోజుల క్రితమే కేసు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ ఆకే హరికృష్ణ వివరణ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని కర్నూలు పోలీసులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, దోషులను పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ఎస్పీ చెప్పారు.