National Womens Parliament
-
మా క్లయింట్‌కు ప్రాణహాని ఉంది
న్యాయమూర్తికి తెలిపిన రోజా తరఫు న్యాయవాదులు గన్నవరం : తమ క్లయింట్‌కు ప్రాణహాని ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రైవేట్ కేసును విచారణకు స్వీకరించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు గత నెల 11న గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన తనను పోలీసులు అక్రమంగా నిర్బంధించి, బలవంతంగా హైదరాబాద్ తరలించిన ఘటనపై గన్నవరం అదనపు కోర్టులో రోజా దాఖలు చేసిన ప్రైవేట్ కేసు విచారణార్హతపై న్యాయ మూర్తి డి.షర్మిల ముందు శుక్రవారం వాదనలు జరిగాయి. ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం రోజా తన లాయర్లు, పార్టీనేతలతో కలిసి కోర్టుకు చేరుకున్నారు. -
సింధు ఇక డిప్యూటీ కలెక్టర్!
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్లు జరిగితే... బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు భవిష్యత్‌లో ఐఏఎస్ అధికారిణి కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ చేసిన డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్–1) ఉద్యోగానికి సింధు అంగీకరించడంతో... యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఆమె మరో ఎనిమిది, తొమ్మిదేళ్లలో కన్ ఫర్డ్ ఐఏఎస్ అవుతుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధును ఏపీ సీఏం చంద్రబాబు విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. ఉన్నత ఉద్యోగాన్ని కూడా అప్పట్లోనే ఆమెకు ఆఫర్ చేశారు. ఇటీవలే అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా... ఏపీ ప్రభుత్వ ఆఫర్‌కు తన సమ్మతిని తెలియజేస్తూ సింధు ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని ఆమె తల్లి విజయ వెల్లడించారు. ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ (స్పోర్ట్స్)గా వ్యవహరిస్తోంది. రియో నుంచి వచ్చిన ఆమెకు ఏపీ సర్కారు కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. రూ. 5 కోట్ల నజరానాతో పాటు హైదరాబాద్‌లో 1000 గజాల నివాస స్థలాన్ని ఇచ్చింది. తెలంగాణ సీఏం కేసీఆర్ ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చే గ్రూప్–1 పోస్ట్‌కు అంగీకారం తెలిపింది. -
ఇదా నిర్వాకం?!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సొమ్ముతో అమరావతిలో ఎంతో ఆర్భాటంగా మొదలై మూడురోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు అందరూ అనుకున్నట్టే ప్రహసనంగా ముగిసింది. అమరావతి డిక్లరేషన్ పేరిట ఒక కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పినవారు చివరకు దానిపై చడీచప్పుడూ లేకుండా సదస్సు ముగించారు. ఈ సదస్సు వివరాలను ఏకరువు పెట్టడానికి జరిగిన విలేకరుల సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడిన మాటలే దాని తీరుతెన్నులెలా ఉండబోతున్నాయో చూచాయిగా తెలియజెప్పాయి. మహిళల భద్రత గురించిన ప్రశ్నకు జవాబుగా కోడెల ఇచ్చిన జవాబు చూసి మహిళలు మాత్రమే కాదు అందరూ విస్మయానికి గురయ్యారు. ‘వాహనం షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు. బయటికి తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది’ అంటూ మహిళలను వాహనాలతో పోల్చి వారు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయటతిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారని ఆయన చెప్పిన తీరు సగటు రాజకీయ నాయకుల అభిప్రాయాలకు అద్దం పట్టింది. ఆయనకు మహిళల గురించి, వారిపై నానావి«ధాలుగా అమలవుతున్న హింస గురించి కనీస పరిజ్ఞానం లేదని ఈ వ్యాఖ్యలు తెలియజెప్పాయి. మహిళలపై సాగే నేరాల్లో 94 శాతం ఇళ్లలో జరిగేవేనని, పరిచయం లేని ప్రదేశాల్లో అపరిచితులవల్ల జరిగే నేరాలు అతి తక్కు వని గణాంకాలు చెబుతున్నాయి. మహిళను వస్తువుతో, ఆస్తితో పోల్చడం కోడెలతో మొదలు కాలేదు. అది ఈ పురుషాధిక్య సమాజం నరనరానా జీర్ణించుకుపోయి ఉంది.‘మమ్మల్ని మనుషు లుగా చూడండి... సమాజ నిర్మాణంలో సమాన భాగస్వామ్యమివ్వండ’ని దశాబ్దా లుగా మహిళలు పోరాడుతున్నారు. తమను చిన్నచూపు చూసే ధోరణులపైనా, వంటింటికే పరిమితం చేయాలన్న బూజుపట్టిన భావాలపైనా తిరగబడుతున్నారు. చేతనైతే నేతలుగా వారికి అండగా నిలవాలి. సమాజంలో మహిళలపట్ల నెలకొన్న దురభిప్రాయాలను పారదోలడానికి, సరిచేయడానికి కృషి చేయాలి. ఆ పని చేయకపోగా అందుకు విరుద్ధమైన అర్ధం ధ్వనించేలా స్పీకర్ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం అభ్యంతరకరం. మహిళా సాధికారత సాధనకు ఉద్దేశించామని చెప్పిన సదస్సుపై ఆదిలోనే ఇలాంటి అపశ్రుతులు వినిపించాయనుకుంటే... ముగి శాక నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు కూడా ఇష్టానుసారం మాట్లాడారు. సదస్సుపై పౌర సమాజ కార్యకర్తల విమర్శలకూ, జాతీయ మీడి యాలో వ్యక్తమైన అభిప్రాయాలకూ సహేతుకమైన జవాబివ్వకపోగా వారంతా డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఆ వేదికపై మూడురోజులపాటు ఏకధాటిగా వినబడిన స్తోత్రపాఠాలు, తనను సమర్ధించే మీడియాలో అట్టహాసంగా వెలువడిన కథనాలు ఆయనకు సంతృప్తినిచ్చినట్టు లేవు. ఒకపక్క కోడెల వ్యక్తీకరణ సరిగాలేదని సమర్ధించడానికి ప్రయత్నించిన బాబుకు... తన నోటి వెంబడి ఎలాంటి మాటలొస్తున్నాయోనన్న స్పృహ కూడా లేనట్టుంది. ఈ సదస్సు తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. తమ వేదిక గనుక ఎవరినైనా పిల్చు కోవచ్చు. ఏమైనా మాట్లాడించవచ్చు. అప్పుడు సైతం ఆ సదస్సు ఉద్దేశం, తీరు తెన్నులు వగైరాలపై విమర్శలొస్తాయి. చేసే పాలనకూ, చెప్పే సుభాషితాలకూ పొంతన లేనప్పుడు జనం ఎప్పుడైనా, ఎక్కడైనా నిలదీస్తారు. ప్రశ్నించినవారి నోరు నొక్కాలని, వారిపై బురదజల్లాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఈ సదస్సుకు ముందు స్పీకర్ నోట వినబడిన మాటలపైగానీ, అది కొనసాగుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించి తిరిగి హైదరాబాద్‌కు పంపిన వైనంపైగానీ సదస్సులో ఒక్కరంటే ఒక్కరు అభ్యంతరం చెప్పకపోవడం అందులో పాల్గొన్నవారి చిత్తశుద్ధిని ప్రశ్నార్ధకం చేసింది. మహిళా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగ తలా ఉంచి సమాజ సేవా రంగం మొదలుకొని కార్పొరేట్ రంగం వరకూ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న మహిళలు ఆ సదస్సుకు హాజరయ్యారు. మహిళా సాధికారత సాధనకు ఉద్దేశించిన సదస్సులో ఇలాంటి అంశాల విషయంలో మౌనంగా మిగిలి పోవడం భావ్యం కాదని వారిలో ఏ ఒక్కరికీ అనిపించలేదా? రాష్ట్ర అసెంబ్లీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సులో పాల్గొనే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ సభలో సభ్యులుగా ఉన్నవారికి అది మరింతగా ఉంటుంది. శాసనసభ్యురాలు రోజా తనంత తాను కాదు...ఆహ్వానిస్తే అక్కడి కొచ్చారు. అలాంటపుడు గన్నవరం విమానాశ్రయంలో ఆమె దిగగానే మాయ మాటలు చెప్పి నిర్బంధంలోకి తీసుకోవడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్ప కుండా వాహనంలో తిప్పడం, చివరికి హైదరాబాద్‌లో వదిలిపెట్టడం ఏ సంస్కృ తికి నిదర్శనం? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పాలన మొదలైన దగ్గరనుంచీ మహి ళల పట్ల అనుసరిస్తున్న వైఖరికి ఈ ఉదంతం కొనసాగింపు మాత్రమే. ఇసుక మాఫియాను అడ్డగించిన తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే తన అను చరులతో దాడిచేసిన వైనం వీడియోలో రికార్డయినా దిక్కులేదు. సాక్షాత్తూ చంద్ర బాబే ఆ ఉదంతంలో మధ్యవర్తిత్వం పేరిట తంతు నడిపి చివరకు వనజాక్షిదే తప్పని తేల్చారు. విజయవాడ నగరంలో టీడీపీ నేతలు కాల్‌మనీ గ్యాంగులతో సాగించిన దుశ్శాసనపర్వాన్ని ఎలా మరుగునపరిచారో అందరికీ తెలుసు. ఇక రిషితేశ్వరి మొదలుకొని డాక్టర్ సంధ్యారాణి వరకూ సామాన్యులపై సాగిన దురం తాలకు అంతేలేదు. వాస్తవం ఇదైనప్పుడు సదస్సు డిక్లరేషన్ లేకుండానే ముగియ డంలో వింతేముంది? ఆ సంగతలా ఉంచి అందులో ఒక్కటంటే ఒక్క సమస్యపై కూడా అర్ధవంతమైన చర్చ జరిగిన దాఖలా లేదు. ఇలాంటి సదస్సుకు కోట్ల రూపా యల ప్రజాధనాన్ని వృథా చేసింది చాలక తనను ప్రశంసలతో ముంచెత్తలేదని నదురూ బెదురూ లేకుండా జాతీయ మీడియాను బాబు ఆడిపోసుకుంటున్నారు. ఇదెక్కడి ధోరణి?! -
రాష్ట్రానికి తగ్గిన ప్రాతినిధ్యం
సాక్షి, అమరావతి బ్యూరో : జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ద్వారా నవ్యాంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవాలని ఆరాటపడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి స్వరాష్ట్రం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుకు సొంత రాష్ట్రానికి చెందిన ప్రముఖులను ఆహ్వానించక పోవడంపై చాలామంది పెదవి విరిచారు. పైగా రాజకీయ ప్రముఖులు కానివారికి సదస్సులో పెద్దపీట వేయడాన్ని తప్పుబట్టారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, విద్యార్థినులు వస్తున్న నేపథ్యంలో వారికి సౌకర్యాల కల్పనలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎండగట్టారు. ముఖ్యంగా రెండో రోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను సదస్సుకు ఆహ్వానించి.. అవమానించిన తీరుపై పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకుంటున్న వేళ ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసులు వ్యవహరించిన విధానంపై మండిపడ్డారు. రోజాను సదస్సుకు ఆహ్వానించి మాట్లాడించి ఉంటే సబబుగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఏదీ? ఎందరో ధీరవనితలు ఉన్న మన రాష్ట్రానికి మాత్రం మహిళా పార్లమెంటు సదస్సులో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లభించలేదు. మూడు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. మన రాష్ట్రానికి చెందిన కొందరికి మాత్రమే ఆహ్వానాలు పంపటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో పలు రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయినా వారికెవరికి ఆహ్వానం లభించలేదు. మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్న వారిని సైతం ప్రభుత్వం విస్మరించడంపై విమర్శలు వినిపించాయి. కొందరికే మాట్లాడే అవకాశం! మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటు సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరికే మాట్లాడే అవకాశం కల్పించడంపైనా మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కొందరిని మాత్రమే మాట్లాడించేందుకు అవకాశం ఇవ్వడం శోచనీయమని సదస్సుకు హాజరైన వారు విచారం వ్యక్తం చేశారు. కేవలం మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, మృణాళిని, ఎమ్మెల్యేలు అఖిలప్రియ, అనిత, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలు మినహాయిస్తే మరెవ్వరికీ మాట్లాడే అవకాశం రాకపోవడం గమనార్హం. రోజాకు అవకాశం ఇవ్వాల్సింది.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, స్పీకర్ కోడెల కుమార్తె విజయలక్ష్మిలకు ప్రభుత్వం సదస్సులో పెద్దపీట వేసింది. ఎమ్మెల్యే రోజాకు సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపిన తర్వాత ఆమె రాకను అడ్డుకుని హడావుడిగా హైదరాబాద్‌కు తరలించడాన్ని పలువురు మహిళలు ఖండించారు. పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యే రోజా విషయంలో వివక్ష చూపిన తీరుపై ఆదివారం మహిళా పార్లమెంటు సదస్సులో పలువురు చర్చించుకోవడం కనిపించింది. రోజాకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే సబబుగా ఉండేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ఏర్పాట్లలో వైఫల్యం.. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ఏర్పాట్ల విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపించాయి. తొలిరోజు, రెండోరోజు తాగునీటి, మరుగుదొడ్ల సమస్యలు మహిళల్ని వెంటాడాయి. భోజన ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో చాలా మంది సందర్శకులు భోజనాలు తినకుండానే వెనుదిరిగి వెళ్లడం కనిపించింది. ఇక సదస్సుకు జాతీయ స్థాయిలో ప్రచారం ఇప్పించుకోవాలని భావించిన ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితంగా వివిధ చానెళ్లు, మీడియా ప్రతినిధులు ఇక్కట్లు పడ్డారు. ఈ సమస్య చివరి రోజు వరకు కొనసాగినా అధికారులు పరిష్కరించలేకపోవడం గమనార్హం. -
ప్రపంచానికే ఉదాహరణవుతుంది
మహిళా బిల్లుపై శ్రీశ్రీ రవిశంకర్ సాక్షి, అమరావతి: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పాస్ అయితే అది ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారుతుందని ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ఈ బిల్లు పాసవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం ఘాట్‌వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సభనుద్దేశించి బెంగుళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ‘రాజకీయాల్లో మహిళలు’ అంశంపై మాట్లాడారు. కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్ని కచ్చితంగా చేసే నైపుణ్యం ఒక్క భారతీయ మహిళకే ఉంటుందన్నారు. రాజకీయాల్లో అయినా.. బ్యూరోక్రసీలో అయినా మహిళల్లో గొప్ప నిర్వహణా సామర్థ్యం ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత మహిళలు కొంత ముందుకెళ్లినా గ్రామాల్లో మహిళలకు ఇంకా అవకాశాలు లభించడంలేదన్నారు. ఈ వ్యత్యాసాన్ని పూరించడం కోసం గ్రామీణ మహిళలకు సహకారం అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లింగ వివక్ష లేకపోవడమే సాధికారిత: జయసుధ లింగ వివక్ష లేనప్పుడే నిజమైన సాధికారిత సాధ్యమని సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. స్త్రీపురుష సమానత్వం కావాలని అందరూ అంటారని, కానీ అది వాస్తవ రూపం దాల్చే పరిస్థితుల్ని నెలకొల్పాల్సి ఉందన్నారు. ‘రాజకీయాల్లో మహిళలు’ అంశంపై ఆమె మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు, కట్టుబాట్లు పురుషుడికి మహిళలను బానిసగా మార్చాయన్నారు. చట్ట సభల్లో మహిళలు సభ్యులుగా ఉన్నా.. వారి భర్తల జోక్యం ఎక్కువగా ఉంటోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 12 శాతం మంది మహిళలే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, భారత్ కంటే సౌదీ అరేబియా వంటి దేశాల్లోనే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని తెలిపారు. నిర్ణయాధికారం పొందాలి మహిళలు అవకాశాలను చేజిక్కించుకోవడంతో పాటు నిర్ణ యాధికారాలు పొందాలి. ప్రపంచంలో సామాజిక సమానత్వం, లింగ వివక్ష ఎక్కువగా ఉంది. మా దేశంలో మహిళల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. – జోయెసె లబొసె, కెన్యా జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ‘స్థానిక’ మహిళా ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఏదీ? మహిళలు గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు గా ఎన్నికైన చోట ఆయా మహిళా ప్రజాప్రతినిధి భర్తలే అ«ధికా రాలు చెలాయిస్తున్నారు. మహిళా ప్రజా ప్రతినిధులకు భర్తలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారి పూర్తి సామర్థ్యంతో పనిచేయగల రు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం మేర రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. – పరిటాల సునీత, ఏపీ మంత్రి ప్రతి తల్లి తమ కొడుకులను స్త్రీ వాదులుగా తీర్చిదిద్దాలి మహిళా సాధికారిత సాధనలో మొదటి మెట్టుగా ప్రతి తల్లి తమ కొడుకులను స్త్రీవాదులుగా తీర్చిదిద్దాలి. హక్కుల సాధన కోసం జరుగుతున్న ఇలాంటి వేదికలపై వక్తలు ఏం చేయాలన్న దానిపై ప్రసంగాలకు పరిమితం కాకుండా చేసింది చెప్పుకునే పరిస్థితి ఉంటే విజయాలు మనముందే ఉంటాయి. – వినీషా నీరో, కర్టాటక నామినేటెడ్ ఎమ్మెల్యే ముందు మనిషిగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరికీ తాను స్త్రీ లేదా పురుషుడు అనే స్పృహ కలిగే ముందు మొదట తాను మనిషి అన్న విషయం గుర్తెరిగి వ్యవహ రించాలి. వ్యక్తి ప్రవర్తన వల్లే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. మరణించిన తర్వాత కూడా తన ప్రవర్తన గురించి ఇతరులు ఉన్నతంగా చెప్పుకోవాలన్న తపన మనిషిని సన్మామార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది. – మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ 90 శాతం విద్యార్థినులకు రక్తహీనత రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థినుల్లో 90 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించాను. విజయనగరం జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 130 మంది విద్యార్థినుల రక్తాన్ని పరీక్షిస్తే అందులో 10 మందే రక్తదానం చేయడానికి అర్హులుగా తేలారు. ఆడపిల్ల యుక్త వయస్సులోనే రక్తహీనతతో బాధపడే పరిస్థితి ఉంటే పెళ్లయ్యాక బిడ్డని ఆరోగ్యకరంగా ఎలా కనగలదు! – మృణాళిని, ఏపీ మంత్రి ప్రసవ వేదనకన్నా కష్టం ఏముంటుంది..! ప్రసవ సమయంలో మహిళ అనుభవించే బాధ కన్నా ప్రపంచంలో పెద్ద కష్టం ఏదీ ఉండదు. మహిళలు పెద్ద పెద్ద కలల సాధనలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ఆడపిల్ల పెద్ద కలలు కని... సవాళ్లను అధిగమించి వాటిని సాకారం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. – సలోని సాధన, యువ ఐఏఎస్ అధికారిణి మహిళా బిల్లు ఆమోదానికి ఏకతాటిపైకి రావాలి జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం రెండు దశాబ్దాలుగా నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మహిళా బిల్లును ఆమోదించేలా ఏకతాటిపైకి రావాలి. పనిచేసే ప్రాంతాల్లో వేధింపులు మహిళలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతున్నాయి. వేదకాలంలో భారతీయ సమాజం మహిళలకు సమున్నత స్థానం కల్పించింది. కానీ మహిళలను ఇంటికి పరిమితం చేసే వివక్షాపూరిత సంప్రదాయం మధ్యయుగాల్లోనే మొదలైంది. – రాజ్‌కుమారీ భట్, రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే సదస్సులో బాబు భజనలు మహిళా పార్లమెంట్ సదస్సులో రాష్ట్ర మహిళా మంత్రులు, అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తమకు అవకాశం కలిగించడం వల్లే తాము ఉన్నత స్థాయికి ఎదగామంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి పరిటాల సునీత, కిమిడి మృణాళిని, పీతల సుజాత, టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగా తాము ఎమ్మెల్యే, మంత్రులు కాగలిగామంటూ కీర్తించారు. స్త్రీత్వాన్ని గౌరవిస్తేనే దేశం పురోభివృద్ధి ప్రముఖ నర్తకి సోనాల్ మాన్సింగ్ స్త్రీత్వాన్ని గౌరవిం చినప్పుడే సమాజం, దేశం పురోభివృద్ధి సాధించగలుగుతాయని ప్రముఖ నర్తకి సోనాల్ మాన్సింగ్ పేర్కొన్నారు. విజయ వాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ముగింపు సమావేశంలో ఆమె ప్రసంగించారు. ‘దేశంలోని నగరాల్లో ప్రధాన రోడ్లకు ప్రముఖ నేతల పేర్లు పెట్ట డంతోపాటు ముఖ్య కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటాం. కానీ ఢిల్లీ సహా దేశంలోని ఏ నగరంలోనూ రోడ్లకు మహిళా ప్రముఖుల పేర్లు.. విగ్రహాలూ ఏర్పాటు చేయడమే లేదు. కస్తూరీబాయి గాంధీ, సావి త్రిబాయి పూలే, సరోజినీనాయుడు తదితర మహిళా ప్రముఖులకు తగిన గుర్తింపే లభించడం లేదు’ అన్నా రు. మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లోని ప్రతిబంధకాలు, రాజకీ యాలను ఎదురొడ్డి విజయం సాధించే స్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అందుకు తాము ఎంచుకున్న రంగంపట్ల అవ్యాజ్య మైన ప్రేమ ఉండాలన్నారు. ‘నేను ఓ గవర్నర్ మనుమరాలిని. నాట్యంలో రాణిం చాలని భావించాను. అందుకోసం 1963లో ముంబైలోని మా ఇంటిని విడిచిపెట్టి బెంగ ళూరు వచ్చేశాను. నేను ఎంచుకున్న రంగం లో ఎదురైన అన్ని ప్రతిబంధకాలను విజయ వంతంగా ఛేదిస్తూ ప్రయాణం సాగించడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోగలిగాను’ అని సోనాల్ పేర్కొన్నారు. -
మహిళా ప్రోత్సాహంపై స్పష్టత ఉంది
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి: ఆడ బిడ్డలను ప్రోత్సహించడంలో తాను చాలా స్పష్టతతో ఉంటానని, వీటిపై తనకు రెండో అభిప్రాయం వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని ఉండదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్, పార్లమెంటు సదస్సు నిర్వాహకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎవరైనా తనపై చెడు అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నిస్తే అది అవాస్తవం అవుతుందని, మహిళలకు వ్యతిరేకమైనవి తన నోటి వెంట రావని, చేతల్లో కూడా జరగవని మరోసారి మనవి చేసుకుంటున్నానన్నారు. చివరి రోజున ఆదివారం మహిళా పార్లమెంటు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు మూడు రోజు ల పాటు బ్రహ్మాండంగా జరిగిందన్నారు. కార్యక్ర మం ఎంత గొప్పగా జరిగినా చెడగొట్టడానికి ఎక్కడో ఒక చిన్న ప్రయ త్నం జరిగిందని తాను అనుకుంటున్నానని కోడెల అన్నారు. యువ మహిళలు, ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారు చేసిన ప్రసంగాలు విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రజా ప్రతినిధులు, ఏపీ కి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు హాజరై తమ అనుభవాలను పంచుకున్నార న్నారు. మొత్తం మీద ఈ మహిళలంతా తమ ఆకాంక్షలకు అనుగుణంగా సూచనలు చేసి యావత్ మహిళా లోకానికే దిక్సూచిగా నిలి చారని కోడెల అభిప్రాయపడ్డారు. -
గౌరవప్రదంగా రిజర్వేషన్లు ఇవ్వాలి
మహిళా రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్త్రీలు నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి రంగం శోభిల్లుతోంది (పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు గౌరవప్రదంగా ఇవ్వాలే తప్ప వివాదాలు, విభేదాలతో కాదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాజకీయ పక్షా లకు హితవు పలికారు. మహిళలకు రిజర్వే షన్లు ఇవ్వడమంటే జాతి నిర్మాణానికి దోహద పడడమన్నారు. మహిళలకు నిర్ణయాధికారం తోనే జాతికి జవసత్వాలని చెప్పారు. విజయ వాడకు సమీపంలోని పవిత్ర సంగమంలో మూడు రోజులుగా జరుగుతున్న తొలి జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు ఆదివారం ముగిశాయి. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమిత్ర మాట్లాడారు. మహిళ లకు రిజర్వేషన్లు పురుషులు ఇచ్చినట్టు.. వాళ్లు తీసుకున్నట్టు ఉండకూడదన్నారు. ఎవ్వరూ మరొకరికి ఏమీ ఇవ్వలేరని చెప్పారు. ‘‘దేశ జనాభాలో సగం మహిళలు. కానీ జాతి నిర్మా ణంలో మాత్రం యావత్తు (పుల్రౌండ్) మహి ళలే. కుటుంబాన్ని నడుపుతున్నది వారు. కుటుంబ సంరక్షకులు వారు. కుటుంబానికి జన్మనిస్తున్నది వారు. ఎవరో అడిగితే వాళ్లు ఆ పని చేయడం లేదు. రిజర్వేషన్లు కూడా అంతే. కానీ పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కొందరు వద్దంటారు, ఇంకొం దరు కావాలంటారు. ఈతరహా తీరును మనం కోరుకోవడం లేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడ మంటే జాతి నిర్మాణానికి సహకరించడం. ఆమెకు అర్హమైంది ఆమెకు ఇవ్వడం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహక రించాలి’’ అని మహాజన్ కోరారు. మహిళా శక్తి కేంద్రం ఏపీ... మహిళ అంటే కళ్యాణి అని, శక్తి స్వరూపిణి అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌లో సాకారాత్మక శక్తియుక్తులున్న మహిళలున్నారని మహాజన్ చెప్పారు. మహిళ ఎక్కడుంటే అక్కడ పవర్(శక్తి) ఉంటుందన్నారు. మహిళలు నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి రంగం శోభిల్లుతోందన్నారు. పార్లమెంటు సభ్యుల కోసం ఏర్పాటు చేసిన స్పీకర్స్ పరిశో ధనా సంస్థలోనూ మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువ గా ఉంటుందన్నారు. పర్యావరణ పరిశుభ్ర తకు, వాతావరణ పరిరక్షణకు పాటు పడుతున్నదీ మహిళలేనని చెప్పారు. నది ఎవరితోనైనా కొట్లాడుతుందా? స్త్రీని నదితో పోల్చిన సుమిత్రా మహాజన్ జీవిత సాఫల్యానికి నది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. నదీ ప్రవాహానికీ ఎక్కడైనా ఆటంకం కలిగితే ఆ పక్క నుంచి పోతుందే గానీ ఎవ్వరిపైనా పోరాటానికి దిగదని, మహిళ కూడా అంతేనని చెప్పారు. స్త్రీ ఉద్దేశం పురుషునిపై పోరాటం కాదన్నారు. మహిళల సాధికారతకు తాము ఇప్పటికే రెండు సమా వేశాలు నిర్వహించామన్నారు. మహిళా జాతీయ పార్లమెంటును ముందుకు తీసుకు వెళ్లేందుకు సహకారాలను అందిస్తామన్నారు. తల్లికి వందనం పేరిట కార్యక్రమం... మాతృమూర్తికి గౌరవ ప్రతిష్టలు చేకూరేలా ఇకపై ఏడాదిలో ఒకరోజు తల్లికి వందనం పేరిట విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించ నున్న ట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిం చారు. ఇండోనేషియాలో మాతృది నోత్సవం నిర్వహిస్తున్నట్టే ఆంధ్రాలోనూ చేపట్టనున్నట్టు తెలిపారు. తల్లికి వందనం పేరిట స్కూళ్లు, కళాశాలల్లో ఓ రోజు మాతమూర్తులను పిలిపించి వారి పిల్లలతో కాళ్లు కడిగించి ఆశీర్వచనం తీసుకునేలా చేస్తామన్నారు. 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయ్యేందుకు సుమిత్రా మహాజన్‌ను నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. మహిళల ఆర్థికాభివృద్ధి, ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి డిక్లరేషన్ ఇప్పుడే కాదు... జాతీయ మహిళా పార్లమెంటు సందర్భంగా అమరావతి డిక్లరేషన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆ కల నెరవేరలేదు. లింగ వివక్ష, మహిళా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికీ, ఐక్యరాజ్య సమితికి మధ్య అవగాహన కుదిరినందున డిక్లరేషన్ చేయలేక పోయినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎంవో యూలోని అంశాలను ఐక్యరాజ్య సమితి బృందం పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇస్తుందని, ఎంత మంది మద్దతు ఇస్తారో తెలుస్తుందని, అది పరిశీలించి డిక్లరేషన్ ప్రకటిస్తామని వివరించారు. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మీనాక్షీ లేఖి, ప్రముఖ నృత్యకా రిణి డాక్టర్ సోనాల్ మాన్సింగ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ, తెలంగాణ శాసనమండలి చైర్మన్లు చక్రపాణీ, స్వామిగౌడ్, సెర్ప్ సలహాదారు విజయభారతి తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో లోక్‌సభ స్పీకర్ ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమం): లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణా నికి చేరుకున్న స్పీకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలు అందజేశారు. -
'ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేయడం అక్రమం'
కృష్ణా జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజాను అరెస్ట్ చేయడం అక్రమమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆమెకు ఏమైనా జరిగితే పోలీసులు, సీఎం చంద్రబాబుదే బాధ్యత వహించాలన్నారు. మహిళా సదస్సుకు ఓ మహిళా ఎమ్మెల్యేను ఆహ్వానించి అడ్డుకోవడం దారుణమన్నారు. రోజా నిర్బంధం మహిళా లోకంపై దాడి అని వెల్లంపల్లి అభివర్ణించారు. ఎమ్మెల్యే రోజాను పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర డీజీపీ సాంబశివరావును కలవనున్నారు. దీనిపై నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి ఈవెంట్ మేనేజ్మెంట్పై ఉన్న శ్రద్ధ మహిళలపై లేదన్నారు. మహిళా ప్రజాప్రతినిధులను అవమానించడం, సమావేశాలను అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావం బయటపడిందని కల్యాణి విమర్శించారు. సంబంధిత వార్తలు చదవండి. 1. ఎమ్మెల్యే రోజా నిర్బంధం 2.తెలియని రోజా ఆచూకీ! -
ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. సదస్సులో పాల్గొనేందుకు ముందుగానే అందరు ఎమ్మెల్యేలలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆమె.. శనివారం గన్నవరం చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో పోలీసులు రోజాను అడ్డుకున్నారు. దలైలామా అక్కడకు వస్తున్నారని సాకుగా చూపించి ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే పోలీసులు అడ్డుకుని ఒక గదిలో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. గంటసేపు ఎయిర్ పోర్టులోనే నిర్బంధించి.. ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో రోజాను విజయవాడకు తరలించారు. సదస్సులో కూడా ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వ అధికారులే మహిళా సదస్సుకు రమ్మంటూ ఆహ్వానించి, పాస్ జారీ చేశారు. తీరా సదస్సు కోసం విమానాశ్రయం వరకు వచ్చిన తర్వాత అడ్డుకున్నారు. ఒక వైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తూ.. మరోవైపు మహిళా ఎమ్మెల్యేను నిర్బంధించడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపణలు వస్తున్నాయి. డీజీపీని నిలదీస్తాం: జోగి రమేష్ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనాలంటూ ఆహ్వానించి, పాస్ ఇవ్వడంతోనే ఆమె ఇక్కడకు వచ్చారని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టులో రోజాను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామన్నారు. (చదవండి: టోల్ గేటును ఢీ కొట్టిన ఏపీ పోలీసులు) -
వనిత..నీదే భవిత
-
కీచకపర్వానికి ‘పచ్చ’ నేత అండ
పొలంలో పనిచేస్తున్న వివాహితపై కిరాతకం నోటిలో టవల్కుక్కి దారుణానికి పాల్పడిన ముగ్గురు మొబైల్‌తో ఫొటోలు తీసి బెదిరించి మరో రెండుసార్లు... ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం సాక్షి, అమరావతి: కూటికోసం కూలికెళ్లిన ఓ అభాగ్యురాలిని నోట్లో టవల్ కుక్కి ముగ్గురు యువకులు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేత ఆదేశాలకే విలువ ఇచ్చి నిందితులకు అండగా నిలిచారు. ప్రాణ భయంతో బాధితురాలు భర్తతో కలిసి ఊరు విడిచి పారిపోయి హైదరాబాద్‌లో తలదా చుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్‌ను ప్రారంభించిన రోజునే న్యాయం కోసం బాధితురాలు, ఆమె భర్త డీజీపీ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు పడటంతో జరిగిన దారుణం వెలుగుచూసింది. దోషులకు టీడీపీ నేత అండ ఉండటంతో ధైర్యాన్ని కూడగట్టుకుని న్యాయం కోసం పోలీస్ డీజీపీని ఆశ్రయించారు. ఆయన ఆదేశించినా న్యాయం జరక్కపోవడంతో మరోమారు పోలీస్ బాస్‌ను కలిసేందుకు ఆ దంపతులు శుక్రవారం విజయవాడకు వచ్చారు. సోమవారం రావాలంటూ క్యాంపు కార్యాలయం వద్ద గార్డులు చెప్పడంతో వారు రోడ్డుపక్కన రోజంతా పడిగాపులు పడ్డారు. వారిని కదలించిన మీడియా వద్ద విలపిస్తూ జరిగిన అన్యా యాన్ని ఏకరువు పెట్టారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు... బెదిరించి అత్యాచారం చేశారు.. కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 13న పొలంలో పనిచేస్తున్న వివాహితను నోట్లో తువ్వాలు కుక్కి ఎత్తుకపోయిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన కె.శ్రీను, కె.కృష్ణ, గొల్ల శివ అత్యాచారం చేసి నగ్నంగా సెల్ఫోన్లో వీడియో, ఫొటోలు కూడా తీశారు. చంపుతామని బెదిరించారు. కొద్ది రోజుల తరువాత ఆ ఫొటోలు చూపించి మళ్లీ రెండు పర్యాయాలు అత్యాచారం చేశారు. ప్రాణభయంతోనే.. బాధితురాలి భర్త తన భార్య నీరసంగా ఉండడంతో గత ఏడాది డిసెంబర్ 14న వైద్యం చేయించినట్టు బాధితురాలి భర్త తెలిపాడు. భయపడిన ఆమె అప్పుడు విషయం చెప్పలేదనీ, మరో రెండు పర్యాయాలు కూడా బెదిరించి అత్యాచారం జరగడంతో నిందితులను అడ్డగించి ఫొటోలు తీసిన సెల్ మెమెరీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయవాడ వచ్చి డీజీపీ సాంబశివరావుకు ఫిర్యాదు చేస్తే ఆయన ఆదేశాలతో కర్నూలు సీఐ మహేశ్వరరెడ్డిని ఈ నెల 2న కలిసి ఫిర్యాదు చేశామన్నాడు. తొలుత సానుకూలంగా స్పందించిన సీఐ అటు తరువాత టీడీపీ నేత ఒత్తిడితో మారిపోయారన్నారు. టీడీపీ నాయకుడు విష్ణువర్థన్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడిన దోషులను కాపాడుతున్నాడని చెప్పాడు. కేసు నమోదు చేశాం: ఎస్పీ సాక్షి ప్రతినిధి, కర్నూలు : తనపై అత్యాచారం జరిగిందంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వారం రోజుల క్రితమే కేసు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ ఆకే హరికృష్ణ వివరణ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయాలని కర్నూలు పోలీసులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, దోషులను పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని ఎస్పీ చెప్పారు. -
భారతీయ సంస్కృతి చాలా గొప్పది: దలైలామా
గన్నవరం: ఎక్కడ శాంతి ఉంటుందో ఆ ప్రదేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడానికి ఆయన గురువారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ పురాతన సంస్కృతి చాలా గొప్పదన్నారు. భారత సంస్కృతి పట్ల నేటి యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. కాగా పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానం ఉదయం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచు కప్పేయడంతో.. రన్‌వే కనిపించక గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం దలైలామా క్షేమంగా విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. మరోవైపు అమరావతిలోని స్థానిక బౌద్ధ స్తూప వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన చోట ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2006 తర్వాత దలైలామ అమరావతికి రావడం ఇదే తొలిసారి. -
మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్
► ఉద్యోగాలు, వ్యాపారాలంటూ తిరగడం వల్లే మహిళలకు వేధింపులు ► షెడ్లో ఉంచితేనే వాహనానికి భద్రత.. ► ఆడవాళ్ల పరిస్థితి కూడా అంతే..! ►వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి ► మీట్ ది ప్రెస్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి : ‘ఒక వాహనం కొని షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు.. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారు. అలాగని వారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి.. ’ అని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి స్పీకర్ హాజరై మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టాలంటే చట్టాలు ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. ఆ చట్టాలు అమలు కావాలంటే ముఖ్యంగా మహిళల్లో ధైర్యం రావాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 12 గంటల పాటు పనిచేసే తనకు స్పీకర్‌గా ప్రస్తుతం పెద్దగా పని ఉండటం లేదన్నారు. ఆ సమయంలో ఆలోచించి శాసనసభ ద్వారా ‘మహిళా సాధికారత’ అనే అంశంపై సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందనుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలకు దేశ, విదేశాల నుంచి 60 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్లూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్ తదితరులు పాల్గొన్నారు.