'ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేయడం అక్రమం'
కృష్ణా జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అరెస్ట్ చేయడం అక్రమమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆమెకు ఏమైనా జరిగితే పోలీసులు, సీఎం చంద్రబాబుదే బాధ్యత వహించాలన్నారు. మహిళా సదస్సుకు ఓ మహిళా ఎమ్మెల్యేను ఆహ్వానించి అడ్డుకోవడం దారుణమన్నారు. రోజా నిర్బంధం మహిళా లోకంపై దాడి అని వెల్లంపల్లి అభివర్ణించారు.
ఎమ్మెల్యే రోజాను పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర డీజీపీ సాంబశివరావును కలవనున్నారు. దీనిపై నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పై ఉన్న శ్రద్ధ మహిళలపై లేదన్నారు. మహిళా ప‍్రజాప్రతినిధులను అవమానించడం, సమావేశాలను అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావం బయటపడిందని కల్యాణి విమర్శించారు.
సంబంధిత వార్తలు చదవండి.