సింధు ఇక డిప్యూటీ కలెక్టర్!
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్లు జరిగితే... బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు భవిష్యత్‌లో ఐఏఎస్ అధికారిణి కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ చేసిన డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్–1) ఉద్యోగానికి సింధు అంగీకరించడంతో... యూపీఎస్‌సీ నిబంధనల ప్రకారం ఆమె మరో ఎనిమిది, తొమ్మిదేళ్లలో కన్ ఫర్డ్ ఐఏఎస్ అవుతుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధును ఏపీ సీఏం చంద్రబాబు విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. ఉన్నత ఉద్యోగాన్ని కూడా అప్పట్లోనే ఆమెకు ఆఫర్ చేశారు.
ఇటీవలే అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా... ఏపీ ప్రభుత్వ ఆఫర్‌కు తన సమ్మతిని తెలియజేస్తూ సింధు ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని ఆమె తల్లి విజయ వెల్లడించారు. ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ (స్పోర్ట్స్)గా వ్యవహరిస్తోంది. రియో నుంచి వచ్చిన ఆమెకు ఏపీ సర్కారు కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. రూ. 5 కోట్ల నజరానాతో పాటు హైదరాబాద్‌లో 1000 గజాల నివాస స్థలాన్ని ఇచ్చింది. తెలంగాణ సీఏం కేసీఆర్ ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చే గ్రూప్–1 పోస్ట్‌కు అంగీకారం తెలిపింది.