ఇదా నిర్వాకం?!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సొమ్ముతో అమరావతిలో ఎంతో ఆర్భాటంగా మొదలై మూడురోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు అందరూ అనుకున్నట్టే ప్రహసనంగా ముగిసింది. అమరావతి డిక్లరేషన్ పేరిట ఒక కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పినవారు చివరకు దానిపై చడీచప్పుడూ లేకుండా సదస్సు ముగించారు. ఈ సదస్సు వివరాలను ఏకరువు పెట్టడానికి జరిగిన విలేకరుల సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడిన మాటలే దాని తీరుతెన్నులెలా ఉండబోతున్నాయో చూచాయిగా తెలియజెప్పాయి.
మహిళల భద్రత గురించిన ప్రశ్నకు జవాబుగా కోడెల ఇచ్చిన జవాబు చూసి మహిళలు మాత్రమే కాదు అందరూ విస్మయానికి గురయ్యారు. ‘వాహనం షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు. బయటికి తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది’ అంటూ మహిళలను వాహనాలతో పోల్చి వారు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయటతిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారని ఆయన చెప్పిన తీరు సగటు రాజకీయ నాయకుల అభిప్రాయాలకు అద్దం పట్టింది. ఆయనకు మహిళల గురించి, వారిపై నానావి«ధాలుగా అమలవుతున్న హింస గురించి కనీస పరిజ్ఞానం లేదని ఈ వ్యాఖ్యలు తెలియజెప్పాయి. మహిళలపై సాగే నేరాల్లో 94 శాతం ఇళ్లలో జరిగేవేనని, పరిచయం లేని ప్రదేశాల్లో అపరిచితులవల్ల జరిగే నేరాలు అతి తక్కు వని గణాంకాలు చెబుతున్నాయి.
మహిళను వస్తువుతో, ఆస్తితో పోల్చడం కోడెలతో మొదలు కాలేదు. అది ఈ పురుషాధిక్య సమాజం నరనరానా జీర్ణించుకుపోయి ఉంది.‘మమ్మల్ని మనుషు లుగా చూడండి... సమాజ నిర్మాణంలో సమాన భాగస్వామ్యమివ్వండ’ని దశాబ్దా లుగా మహిళలు పోరాడుతున్నారు. తమను చిన్నచూపు చూసే ధోరణులపైనా, వంటింటికే పరిమితం చేయాలన్న బూజుపట్టిన భావాలపైనా తిరగబడుతున్నారు. చేతనైతే నేతలుగా వారికి అండగా నిలవాలి. సమాజంలో మహిళలపట్ల నెలకొన్న దురభిప్రాయాలను పారదోలడానికి, సరిచేయడానికి కృషి చేయాలి.
ఆ పని చేయకపోగా అందుకు విరుద్ధమైన అర్ధం ధ్వనించేలా స్పీకర్ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం అభ్యంతరకరం. మహిళా సాధికారత సాధనకు ఉద్దేశించామని చెప్పిన సదస్సుపై ఆదిలోనే ఇలాంటి అపశ్రుతులు వినిపించాయనుకుంటే... ముగి శాక నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు కూడా ఇష్టానుసారం మాట్లాడారు. సదస్సుపై పౌర సమాజ కార్యకర్తల విమర్శలకూ, జాతీయ మీడి యాలో వ్యక్తమైన అభిప్రాయాలకూ సహేతుకమైన జవాబివ్వకపోగా వారంతా డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఆ వేదికపై మూడురోజులపాటు ఏకధాటిగా వినబడిన స్తోత్రపాఠాలు, తనను సమర్ధించే మీడియాలో అట్టహాసంగా వెలువడిన కథనాలు ఆయనకు సంతృప్తినిచ్చినట్టు లేవు. ఒకపక్క కోడెల వ్యక్తీకరణ సరిగాలేదని సమర్ధించడానికి ప్రయత్నించిన బాబుకు... తన నోటి వెంబడి ఎలాంటి మాటలొస్తున్నాయోనన్న స్పృహ కూడా లేనట్టుంది.
ఈ సదస్సు తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. తమ వేదిక గనుక ఎవరినైనా పిల్చు కోవచ్చు. ఏమైనా మాట్లాడించవచ్చు. అప్పుడు సైతం ఆ సదస్సు ఉద్దేశం, తీరు తెన్నులు వగైరాలపై విమర్శలొస్తాయి. చేసే పాలనకూ, చెప్పే సుభాషితాలకూ పొంతన లేనప్పుడు జనం ఎప్పుడైనా, ఎక్కడైనా నిలదీస్తారు. ప్రశ్నించినవారి నోరు నొక్కాలని, వారిపై బురదజల్లాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో చెల్లదు.
ఈ సదస్సుకు ముందు స్పీకర్ నోట వినబడిన మాటలపైగానీ, అది కొనసాగుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించి తిరిగి హైదరాబాద్‌కు పంపిన వైనంపైగానీ సదస్సులో ఒక్కరంటే ఒక్కరు అభ్యంతరం చెప్పకపోవడం అందులో పాల్గొన్నవారి చిత్తశుద్ధిని ప్రశ్నార్ధకం చేసింది. మహిళా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగ తలా ఉంచి సమాజ సేవా రంగం మొదలుకొని కార్పొరేట్ రంగం వరకూ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న మహిళలు ఆ సదస్సుకు హాజరయ్యారు. మహిళా సాధికారత సాధనకు ఉద్దేశించిన సదస్సులో ఇలాంటి అంశాల విషయంలో మౌనంగా మిగిలి పోవడం భావ్యం కాదని వారిలో ఏ ఒక్కరికీ అనిపించలేదా?
రాష్ట్ర అసెంబ్లీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సులో పాల్గొనే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ సభలో సభ్యులుగా ఉన్నవారికి అది మరింతగా ఉంటుంది. శాసనసభ్యురాలు రోజా తనంత తాను కాదు...ఆహ్వానిస్తే అక్కడి కొచ్చారు. అలాంటపుడు గన్నవరం విమానాశ్రయంలో ఆమె దిగగానే మాయ మాటలు చెప్పి నిర్బంధంలోకి తీసుకోవడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్ప కుండా వాహనంలో తిప్పడం, చివరికి హైదరాబాద్‌లో వదిలిపెట్టడం ఏ సంస్కృ తికి నిదర్శనం? ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పాలన మొదలైన దగ్గరనుంచీ మహి ళల పట్ల అనుసరిస్తున్న వైఖరికి ఈ ఉదంతం కొనసాగింపు మాత్రమే.
ఇసుక మాఫియాను అడ్డగించిన తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే తన అను చరులతో దాడిచేసిన వైనం వీడియోలో రికార్డయినా దిక్కులేదు. సాక్షాత్తూ చంద్ర బాబే ఆ ఉదంతంలో మధ్యవర్తిత్వం పేరిట తంతు నడిపి చివరకు వనజాక్షిదే తప్పని తేల్చారు. విజయవాడ నగరంలో టీడీపీ నేతలు కాల్‌మనీ గ్యాంగులతో సాగించిన దుశ్శాసనపర్వాన్ని ఎలా మరుగునపరిచారో అందరికీ తెలుసు. ఇక రిషితేశ్వరి మొదలుకొని డాక్టర్ సంధ్యారాణి వరకూ సామాన్యులపై సాగిన దురం తాలకు అంతేలేదు. వాస్తవం ఇదైనప్పుడు సదస్సు డిక్లరేషన్ లేకుండానే ముగియ డంలో వింతేముంది? ఆ సంగతలా ఉంచి అందులో ఒక్కటంటే ఒక్క సమస్యపై కూడా అర్ధవంతమైన చర్చ జరిగిన దాఖలా లేదు. ఇలాంటి సదస్సుకు కోట్ల రూపా యల ప్రజాధనాన్ని వృథా చేసింది చాలక తనను ప్రశంసలతో ముంచెత్తలేదని నదురూ బెదురూ లేకుండా జాతీయ మీడియాను బాబు ఆడిపోసుకుంటున్నారు. ఇదెక్కడి ధోరణి?!