ఎమ్మెల్యే రోజా నిర్బంధం, విజయవాడ తరలింపు
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి గన్నవరం ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. సదస్సులో పాల్గొనేందుకు ముందుగానే అందరు ఎమ్మెల్యేలలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆమె.. శనివారం గన్నవరం చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో పోలీసులు రోజాను అడ్డుకున్నారు. దలైలామా అక్కడకు వస్తున్నారని సాకుగా చూపించి ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే పోలీసులు అడ్డుకుని ఒక గదిలో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు.
గంటసేపు ఎయిర్ పోర్టులోనే నిర్బంధించి.. ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో రోజాను విజయవాడకు తరలించారు. సదస్సులో కూడా ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వ అధికారులే మహిళా సదస్సుకు రమ్మంటూ ఆహ్వానించి, పాస్ జారీ చేశారు. తీరా సదస్సు కోసం విమానాశ్రయం వరకు వచ్చిన తర్వాత అడ్డుకున్నారు. ఒక వైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తూ.. మరోవైపు మహిళా ఎమ్మెల్యేను నిర్బంధించడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపణలు వస్తున్నాయి.
డీజీపీని నిలదీస్తాం: జోగి రమేష్
ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనాలంటూ ఆహ్వానించి, పాస్ ఇవ్వడంతోనే ఆమె ఇక్కడకు వచ్చారని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టులో రోజాను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామన్నారు.