భారతీయ సంస్కృతి చాలా గొప్పది: దలైలామా
గన్నవరం: ఎక్కడ శాంతి ఉంటుందో ఆ ప్రదేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడానికి ఆయన గురువారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ పురాతన సంస్కృతి చాలా గొప్పదన్నారు. భారత సంస్కృతి పట్ల నేటి యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.
కాగా పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానం ఉదయం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచు కప్పేయడంతో.. రన్‌వే కనిపించక గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం దలైలామా క్షేమంగా విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. మరోవైపు అమరావతిలోని స్థానిక బౌద్ధ స్తూప వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన చోట ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2006 తర్వాత దలైలామ అమరావతికి రావడం ఇదే తొలిసారి.