సమైక్యాంధ్ర ఉద్యమం పల్లెలనూ తాకింది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఆందోళనలు మొదలయ్యాయి. సామాన్యులే సారథులై సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. జనం చేయిచేయి కలిపి ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సమైక్య నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. ఐదురోజుల నుంచి నిర్విరామంగా చేపడుతున్న దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లా దద్దరిల్లిపోతోంది. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలు, ఆటో, టాక్సీ యూనియన్లు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి.
సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు పట్టణాల్లో మున్సిపల్ ఉద్యోగులు 72 గంటల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల పర్యవేక్షణను మినహా యించారు. వీరితో పాటు అతి సామాన్యులు, చిన్న పిల్లలు సమైక్య జెండాలు చేతపట్టుకుని రోడ్డెక్కుతున్నారు.
ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన సమైక్య ఉద్యమం హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు మినహా మిగిలిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమై క్య ఉద్యమంలో వెనుక వరుసలో నడుస్తుండ గా, సామాన్య ప్రజలే ముందుండి నడిపిస్తున్నారు. అందుకు ఆదివారం జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ చింతామోహన్ నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. కానీ ఆయన మాత్రం రాజీనామాకు అంగీకరించలేదు.
తిరుపతిలో ఆదివారం తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే గాలిముద్దుకృష్ణమనాయుడు, తూర్పు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే చదలవాడకృష్ణమూర్తిని పిలిచారు. ఉదయం 10గంటలకు కార్యక్రమం ఉంటుందని చెప్పి యువత తెలుగుతల్లి విగ్రహానికి చేరుకున్నారు. అయితే ముఖ్య నేతలు మాత్రం తీరిగ్గా 11 గంటలకు వచ్చి మీడియా వారితో మాట్లాడారు. అనంతరం తెలుగుతల్లికి పూలమాలవేసి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. అయితే యువత నాయకులు మాత్రం తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
సమైక్యానికి హిజ్రాల మద్దతు
సమైక్యాంధ్ర ఉద్యమానికి హిజ్రాలు మద్దతు పలికారు. మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ కార్యాలయం ముందు ఆటపాటలతో నిరసన తెలిపారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న హిజ్రాలంతా నేటి నుంచి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మదనపల్ల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ఆందోళనకారులు ఆదివారం ఉదయం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి డప్పుకొట్టి కూరగాయలు తరిగి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమైక్యవాదులు కోలాటాలు ఆడుతూ నిరసన తెలియజేశారు.
రజకులు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట దుస్తులు ఉతికారు. మరి కొందరు ఉద్యమకారులు రిలేదీక్షలు చేపట్టారు. లారీ వర్కర్స్ అసోసియేషన్ వారు లారీలపై కేసీఆర్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ ర్యాలీ నిర్వహించారు. తోపుడు బండ్లవారు కూడా మోకాళ్లపై నిరసన తెలియజేశారు. వెల్డింగ్, ట్రాక్టర్ అసోసియేషన్ వారు కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. జర్నలిస్టు లు గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రెవెన్యూ అసోసియేషన్ వారు సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించారు.
తిరుపతిలో ఐదోరోజూ బంద్ విజయవంతం
తిరుపతిలో ఆదివారం కూడా బంద్ విజయవంతమైంది. ఉద్యమకారులు వీధుల్లో మోటర్‌బైక్ ర్యాలీలు నిర్వహించి దుకాణాలు తెరవనివ్వలేదు. ఎక్కడి వాహనాలను అక్కడే అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు జ్యోతి థియేటర్ సర్కిల్‌లో నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు రుయా ఆస్పత్రి నుంచి టౌన్ క్లబ్, గాంధీ రోడ్‌ల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహిచి మున్సిపల్ కార్యాలయం వద్ద శాప్స్ రిలే దీక్షకు మద్దతు పలికారు. ఆర్యవైశ్య సంఘం, భవన నిర్మాణ కార్మికులు, ఆటో స్టాండ్ వర్కర్లు ఆటో, బైక్, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేశారు.
పల్లెల్లో ఉద్యమ జోరు
సమైక్య ఉద్యమం పల్లెలకు పాకింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని ప్రతిపల్లెలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. పల్లెల్లోనూ ద్విచక్ర వాహనాలను కూడా తిరగనివ్వలేదు. పీలేరులో జాతీయ రహదారిపై ఆందోళనకారులు వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీయూలో విద్యార్థులు ఆమరణ నిరాహారదీక్ష రెండవ రోజుకు చేరింది. కుప్పం, గుడుపల్లె, ఎద్దులగట్టు, శాంతిపురం, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం, కురుబలకోట, పుత్తూరు, నగరి, చిత్తూరు, మదనపల్లె, చంద్రగిరి, పలమనేరు, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, గంగాధరనెల్లూరు, పుంగనూరు పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్షం, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిం చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు కూడా ఆందోళనలను కొనసాగిస్తున్నట్లు ఉద్యమకారులు ప్రకటించారు.