
మాట నిలుపుకోండి.. లేదంటే కాంగ్రెస్ గతే..
హరిశ్చంద్రుడి వేషంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ హెచ్చరించారు. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరి వేషధారణలో మంగళవారం విజయ్‌చౌక్‌లో ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. ‘కష్టములెన్నియున్నను..సత్యవాక్కు పరిపాలన సాగించవలయును కదా..ఇచ్చిన మాట తీర్చవలెను కదా..’అంటూ తన విజ్ఞప్తిని పద్యరూపంలో మీడియా ముందు వినిపించారు.
‘ఆంధ్రా ఎంపీలను కొట్టి..బలవంతంగా బయటకు నెట్టి..టీవీలను సైతం కట్టిపెట్టి..ఏపీని రెండుగా చీల్చినది..అట్టుడుకిన ఆంధ్ర జనం ఆగ్రహించగా..ఏమాయే..సోనియా కాంగ్రెస్ గతి..ఇది ఆదర్శమగు గాక..’ అంటూ తనదైన శైలిలో కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు.